దైవమ్- మనమ్

డిజిటల్ మేగజైన్ – నిత్య దివ్యానుగ్రహం

కథ కాని కథ!!​

శ్రీ గణపతి వందనం

  శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.

ఎడిటర్ ఎ.బాలరెడ్డి అంతరంగం

ఇది ఇప్పటి మాట కాదు, 2005 నాటిది. నమ్మవచ్చా? అనిపించవచ్చు! విశ్వాసానికి ప్రమాణం ఆధారమైనప్పుడు ఇక సందేహానికి ఆస్కారం లేదు. అంత నిక్కచ్చిగా చెబుతున్నా, ‘ఇది నిజం’. ముందుగా ‘ప్రమాణ గణపతి’ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి ప్రణామాలు. నాటి ఘటనకు సాక్షి, సూత్రధారీ- ఆ వరసిద్ధుడే!

అందరికీ రక్ష
‘దేవుడు – దేవత’ ఉన్నారా? లేరా? అనే మీమాంస వద్దే వద్దు. సూర్యుడు నిత్యం మన కంటికి కనిపిస్తూనే ఉన్నాడు. అలాగే ‘భగవంతుడు’ కూడా విశ్వమంతా వ్యాపించాడని మహర్షులు, మహాయోగులు, సిద్ధులు, భక్తాగ్రేసరులు, పండితులు, ఆచార్యులు, ఆధ్యాత్మిక చింతనాపరులు… అందరూ లోకానికి చెప్పడమే గాక దర్శించారు కూడా. జీవితంలో వయసు పెరిగే కొద్దీ భగవంతునికి దగ్గరవుతాం. ఆటు-పోట్ల తాకిడి పెరుగుతూ ఉంటే- రక్షగా కనిపించేది దైవం మాత్రమే. నా అరవై ఏళ్ల ‘జీవిత గురువు’ చెప్పిన పాఠం- ‘భగవంతుడిని నమ్ముకో. కష్టంలో కాపాడతాడు!’ ఇది అక్షర సత్యం. దుఃఖ తీరాన్ని దాటిన వారు నా మాటతో తప్పక ఏకీభవిస్తారు.

శ్వేతార్క గణపతి
అది 2005, సెప్టెంబరు. వినాయకచవితి పర్వదిన మాసం. దైవమ్ మాసపత్రికతో బాటు ‘శ్వేతార్క (తెల్లజిల్లేడు) గణపతి’ ప్రతిమను పాఠకులకు ఇవ్వాలని అప్పటికి రెండు నెలల క్రితం సంకల్పం. ఒక మాసపత్రిక ఈ విధమైన ప్రయోగం చేయడం మొదటిసారి. పైగా తెలుగు వార-మాస పత్రికలు పది-పదిహేను రూపాయలకు అమ్ముడవుతోన్న రోజుల్లో ‘దైవమ్’ సెప్టెంబరు 2005 సంచిక వెలను 51 రూపాయలుగా నిర్ణయించడం ఆనాటి చరిత్ర. నాడు తెల్లజిల్లేడు గణపతి బొమ్మల తయారీ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉండేది. శ్రీకాళహస్తిలోని ఒక తయారీదారునితో ఒప్పందం కుదుర్చుకొన్నాం. ‘దైవమ్’ ప్రతుల ప్రచురణ వేలల్లో. ఆ సంఖ్యకు తగినట్లు ప్రతిమలు తయారుచేయాలి. ఆగస్టు 25 నాటికి ఇస్తానని తయారీదారుని అంగీకారం. శ్వేతార్క గణపతితో ‘దైవమ్’ సెప్టెంబరు సంచిక 1వ తేదీన మార్కెట్లో ఉండాలి. మహిమాన్వితమైన ఈ పూజా ద్రవ్యం గురించి పాఠకులు ముందుగా తెలుసుకోవాలని ‘దైవమ్’ ఆగస్టు సంచికలో ప్రకటించాం. పాఠకుల్లో చాలామంది తమ ప్రతులను స్థానిక విక్రేతల (ఏజెంట్ల) దగ్గర రిజర్వు చేసుకొన్నారు.

దుర్భర కాలం
అంతా మనం అనుకొన్నట్లు జరిగితే పరమాత్మను మరచిపోతాం. ఆ తరవాత ఏం జరిగిందో చెప్పబోయే ముందు- నా పాత్రికేయ వృత్తి నడక ఎలా సాగిందో వివరిస్తాను. జీవితం ఎత్తు పల్లాల రహదారి. ఆ పయనంలో తెలిసీ తెలియక చేసే పనుల వల్ల పొందే మంచీ-చెడు ఫలితాలు మనమే అనుభవించాలి. నా జీవితంలో 2003-05 మధ్య కాలం దుర్భరమైనది.

ఫ్రీలాన్స్ టు ఫిల్మ్ జర్నలిస్ట్
1980లో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా మొదలైన కెరీర్ ‘ఎడిటర్’ స్థాయికి చేరింది. 1980-83 మధ్య ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, జనత- దినపత్రికలకు ఫ్రీలాన్స్ జర్నలిస్టును. ’84-85 మధ్యలో ఖమ్మం జిల్లా ప్రాంతీయ వారపత్రికలో పాత్రికేయ ఉద్యోగం. ’86 జూలై నాటికి ‘ఈనాడు’ హైదరాబాదులో ట్రైనీ జర్నలిస్టును. ’86 డిసెంబరులో ‘సితార’ సినీవారపత్రిక విలేకరి బాధ్యతను అప్పగిస్తూ ఈనాడు చెన్నైకు పంపింది. ’86 డిసెంబరు నుండి ’89 మే వరకు సితార, ఈనాడు పత్రికల ఫిల్మ్ జర్నలిస్టుగా చెన్నైలో పని చేశాను.

ఎడిటర్ పదోన్నతి
సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు, శ్రీ దాసరి నారాయణరావు గారు స్థాపించిన ‘ఉదయం – శివరంజని’ పత్రికల ప్రచురణ సంస్థ- 1989 మేలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి ‘మాగుంట బ్రదర్స్’ గ్రూప్ ఆధీనంలోకి వెళ్లింది. వీరి కార్పొరేట్ కార్యాలయ కేంద్రం చెన్నయ్. శ్రీ సుబ్బరామరెడ్డి గారి సోదరులు- ప్రస్తుత ఒంగోలు లోక్-సభ ప్రజా ప్రతినిధి (వైఎస్సార్సీపీ – ఎం.పి.) శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు, శ్రీ సుధాకరరెడ్డి గారు. వీరు ‘మాగుంట బ్రదర్స్’గా సుప్రసిద్ధులు, దానశీలురు. ప్రజాభిమానం చూరగొన్న మానవతామూర్తులు. ’89 జూన్ మాసంలో ‘సితార’ నుండి మాగుంట వారి ‘ఉదయం’ సంస్థలోకి వెళ్లాను. ‘శివరంజని’ సినీవారపత్రిక ముఖ్య ప్రతినిధిగా ’90 ఫిబ్రవరి వరకు చెన్నైలో పని చేశాను. ’90 మార్చిలో ‘శివరంజని’ ఎడిటర్ పదోన్నతితో హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యాను.

జాతకంలో ‘మహర్దశ’
ప్రతి వ్యక్తికీ జీవితంలో ఒక ‘ఉన్నత దశ’ ఉంటుందని ‘జ్యోతిష’ శాస్త్రం చెబుతోంది. 1990-98 నా జాతకంలో ‘మహర్దశ’. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉత్తమస్థాయిలో నిలబెట్టిన కాలమది. ఎడిటర్ బాధ్యతను సమర్థంగా నిర్వహించి, సహ ఉద్యోగుల తోడ్పాటుతో ‘శివరంజని’ సినీ వారపత్రికను ‘నంబర్-వన్’ స్థానానికి తీసుకెళ్లాను. అత్యధిక సర్క్యులేషన్ గల సినీ వారపత్రికగా ‘శివరంజని’ అధికారిక కిరీటాన్ని ధరించింది. ’92-93లో ‘ఉదయం’ యాజమాన్యం ప్రవేశపెట్టిన ‘యాపిల్’ కంప్యూటర్లను వినియోగించి ‘శివరంజని’ని పూర్తి కలర్ పేజీల పత్రికగా తీర్చిదిద్దాం. అదొక సంచలనం. సినీ తారల చిత్రాలు ప్రతి పేజీలోనూ రంగుల్లో కనిపించడం, ఇంటర్వ్యూలు, షూటింగుల కబుర్లు, విశ్లేషణలు విభిన్నంగా ఉండడంతో ఆ కాలంలో లక్షలాది సినీ అభిమానులు ‘శివరంజని’ కోసం వారం వారం ఎదురు చూస్తుండేవారు. స్టార్స్ సైతం అభిమానించేవారు. ఆనాడు యాజమాన్యం ‘శివరంజని’ రూపకల్పనకై సిబ్బందికి సమకూర్చిన యాపిల్ కంప్యూటర్లలో ఒక్కో దాని ఖరీదు అప్పట్లోనే రెండున్నర నుండి మూడు లక్షల రూపాయలు. ఈ తరహా ఆధునిక సాంకేతికతను తెలుగు పత్రికా రంగంలోకి మొదటిసారి ప్రవేశపెట్టిన యాజమాన్యం ‘ఉదయం’ మాగుంట బ్రదర్స్. ఇవ్వాళ ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకొన్న ‘అడోబ్’ వారి పేజ్ మేకర్, ఫొటోషాప్ అప్లికేషన్లతో యాపిల్ కంప్యూటర్లలో ‘శివరంజని’ పేజీలను రూపొందించాం. అక్షరాల అల్లిక, పేజీల అలంకరణ…. అన్నీ కంప్యూటర్లోనే. ఈ అద్భుతం గురించి అప్పట్లో విశేషంగా మాట్లాడుకొనేవారు. కంప్యూటర్ విద్యను నేర్చుకోవడానికి రేయింబవళ్లూ పని చేశాం. ధనం పోయినా విద్య ఉన్నవాడు ఈ లోకంలో బతుకుతాడని పదేళ్ల తరవాత స్వానుభవంతో గ్రహించాను. ‘ఉదయం’ అధినేత, పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1995లో మరణించారు. పత్రికల ప్రచురణ నిలచిపోయింది. ఉద్యోగులు ఉపాధి కోసం వేరే సంస్థల్లోకి వెళ్లారు.

ఈటీవి – మేఘసందేశం
సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు, ‘ఈనాడు’ వ్యవస్థాపకులు, సంచలనాల చలనచిత్ర (ఉషాకిరణ్ మూవీస్) నిర్మాణ సంస్థ అధినేత, ఉషాకిరణ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ యజమాని, ‘మార్గదర్శి’ స్థాపకులు, ప్రపంచ ప్రఖ్యాత స్టూడియో రామోజీ ఫిలింసిటీ ‘రూపశిల్పి’, మా తరానికి మార్గదర్శకులైన శ్రీ సిహెచ్.రామోజీరావు గారు 1995లో ప్రారంభించిన ఈటీవీలో చేరాను. స్టూడియో రౌండప్, డయల్ యువర్ స్టార్, తదితర సినీ కార్యక్రమాలకు దర్శకత్వం వహించాను. ఒక ఏడాది తరవాత దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారి ‘మేఘసందేశం’ సినీ వారపత్రిక ఎడిటర్ బాధ్యతను స్వీకరించాను.

స్వయంకృతాపరాధం
1998లో సొంతంగా ‘నంబర్ వన్’ సినీ వారపత్రిక ప్రారంభించాను. ‘మహర్దశ’ ముగిసి ‘కష్టకాలం’ మొదలైంది ఇక్కడే! తెలియక తప్పు చేయడమంటే ఇదే. మధ్యలో మరో రెండు పత్రికలు- జయమ్, దైవమ్. శక్తికి మించిన బరువును నెత్తి మీద పెట్టుకోవడం స్వయంకృతాపరాధం. నా జాతకంలో శని దశ- 1998 నుండి 2005 వరకు. ఆస్తులు పోయి అప్పులు మిగిలాయి. ప్రతిష్ఠ మంటగలసింది. మిత్రులు శత్రువులయ్యారు. ఉన్న ఊరును వదిలేసినట్లు- సినీరంగాన్ని కాదనుకొని బయటకు వచ్చిన వేళ- నాకున్న ఒకే ఒక్క బలం ‘దైవమ్’.

కథ కాని కథ
‘శ్వేతార్క గణపతి’తో మొదలైన ‘కథ కాని కథ’ ఎక్కడకు వెళుతోంది? ఈ ప్రశ్న మీదే కాదు, నాది కూడా. నా స్వోత్కర్ష చెప్పుకోవడానికి మీ సమయం తీసుకోవడం లేదు. స్వయంకృషిని నమ్ముకొన్న ఒక వ్యక్తి ప్రయాణ నేపథ్యం, ప్రమాదాన్ని అధిగమించిన వైనం, కొనసాగుతోన్న వైదిక జీవనం- వీటి గురించి తెలిస్తే కంటికి కనిపించని ‘విశ్వశక్తి’ పట్ల మన విశ్వాసం, ఆరాధన వృద్ధి చెందుతాయి. ‘భగవంతుడు ఉన్నాడు, కాపాడతాడు’ అన్న నమ్మకం మనలో సుస్థిరమవుతుంది. అందుకే ఇది సుదీర్ఘ కథగా సాగుతోంది.

ముందుకు నడిపించిన మనోశక్తి
2005లో ఆ రంగానికి దూరంగా వచ్చేశాను. తిరిగి అటువైపు వెళ్లలేదు. అక్కడి వ్యక్తులనూ కలవలేదు. నంబర్ వన్, జయమ్ పత్రికల ముద్రణ ఆపాను. ‘దైవమ్’ కొనసాగింది. ఆర్థిక వనరులు అడుగంటాయి. జీతాలిచ్చి సిబ్బందితో పని చేయించుకొనే ధనశక్తి లేదు. కార్యాలయం, ఇల్లు- రెండూ ఒక చోటే. సంపద పోయినా, విద్య మాత్రం వ్యక్తితోనే ఉంటుంది. ‘శివరంజని’ సంపాదకునిగా నేర్చుకొన్న కంప్యూటర్ విద్య, పాత్రికేయ ప్రతిభ- దైవమ్ మాసపత్రిక ప్రచురణ దిగ్విజయంగా సాగడానికి దోహదపడ్డాయి. ఇతర వ్యాపకాలేవీ లేవు. పూర్తి సమయం దైవమ్ కోసమే. ఒకే ఒక్క సహాయకుడిని పెట్టుకొని, రేయింబవళ్లు పని చేశాను. ఆర్థికపుష్ఠి లేకపోయినా భగవంతుడిచ్చిన మనోశక్తి ముందుకు నడిపించింది.

‘తెల్లజిల్లేడు గణపతి’ ఒప్పందం
పాఠకుల అభిరుచికి తగినట్లు పత్రిక రూపకల్పనలో వైవిధ్యాన్ని చూపడం సంపాదకుని ప్రతిభకు పరీక్ష. శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినీ వారపత్రికల విజయంతో ఎడిటర్-గా వృత్తిపరమైన తృప్తిని పొందాను. వాటికి భిన్నమైన పత్రిక ‘దైవమ్’. మార్కెట్ పోటీలో కొన్ని ఆధ్యాత్మిక పత్రికలు ముందు వరుసలో ఉన్నాయి. వాటిని అధిగమించాలి. పాఠకులు మెచ్చే ప్రత్యేక పంథాలో వెళితేనే లక్ష్యానికి చేరుకోగలం. అలా సాగిన అన్వేషణలో ‘శ్వేతార్క గణపతి’ ఆవిర్భవించాడు. తెల్లజిల్లేడు గణపతి ప్రతిమను ఆ రోజుల్లో పూజా సామగ్రి దుకాణాలు నూరు రూపాయల దాకా అమ్మేవి. వినాయకచవితి పండుగ సందర్భంగా ‘దైవమ్ పత్రిక – శ్వేతార్క గణపతి ప్రతిమ’ కలిపి యాభై ఒక్క రూపాయలకే ఇవ్వాలని సంకల్పం. ప్రతిమ కొనుగోలుకు లక్షలు కావాలి. అంత సొమ్ము ముందుగా ఇచ్చే స్థోమత లేదు. మొత్తం పెట్టుబడిలో ఇరవై ఐదు శాతం చెల్లింపుతో వ్యాపార ఒప్పందం కుదిరింది. మిగతా సొమ్ము నెల లోపు చెల్లించాలి. 2005 జూలైలో పిల్లల ఫిక్సడ్ డిపాజిట్లు రద్దు చేసి, ఆ ధనాన్ని శ్రీకాళహస్తి గణపతి ప్రతిమల తయారీదారునికి అడ్వాన్సుగా ఇచ్చాను. ప్రతిమలను ఆగస్టు రెండో వారం నుండి 25వ తేదీ లోపు రెండు మూడు దఫాలుగా హైదరాబాదుకు పంపుతానని తయారీదారుడు మాటిచ్చాడు.

మోసపోయానా?!
ఆగస్టు రెండో వారం ముగిసినా శ్రీకాళహస్తి నుండి గణపతి ప్రతిమలు రాలేదు. ఫోన్ చేస్తే ఇదిగో, అదిగో అంటున్నాడు కానీ స్పష్టత లేదు. మోసపోయానా?! ఈ ఊహ మదిలో మెదిలిన క్షణాన గుండె ఝల్లుమంది. ఒకటి- ధననష్టం. రెండు- పాఠకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని అసహాయత. భయానికి ఇంతకంటే ముడిసరుకు అక్కర్లేదు. ఆగస్టు 15 రాత్రి హైదరాబాదులో రైలెక్కి తిరుపతి వెళ్లాను. స్థానిక ఏజెంటుతో కలసి మధ్యాహ్నానికి శ్రీకాళహస్తికి చేరుకొన్నాం. తయారీదారుని దగ్గర సిద్ధమైన ప్రతిమలు రెండు వేలకు మించి లేవు. వారంలో మొత్తం ప్రతిమలు ఇస్తాననే అతని మాటను నమ్మడానికి తగిన ఆధారమేదీ మాకు కనిపించలేదు.

స్వామి సన్నిధిలో మరపురాని క్షణాలు
ప్రత్యామ్నాయం కోసం వెదికాను. మా సమస్య గురించి తెలుసుకొన్న మరొక తయారీదారుడు ఫోన్ చేశాడు. చిత్తూరుకు 20 కిలో మీటర్ల దూరంలో ఉంటాడు. ముందుగా కాణిపాకం వెళ్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొన్నాం. నా కష్టాన్ని నివేదించాను. ఈ సంకటాన్ని అధిగమించే శక్తినివ్వమని వేడుకొన్నాను. గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర పది నిముషాలు నిల్చొని స్వామిని స్తుతించాను. అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు. ఆ క్షణాలను ఎన్నటికీ మరువలేను. ఈ అక్షరాలు టాబ్ స్క్రీన్ మీద రాస్తుంటే- ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తోంది. అక్కడ నుండి బయలుదేరి చిత్తూరు మీదుగా శ్వేతార్క గణపతి ప్రతిమల కొత్త తయారీదారుని గ్రామానికి వెళ్లాం. ఆయన ఒక గదిలోకి తీసుకెళ్లి తన దగ్గరున్న వేల గణపతి బొమ్మలను చూపించాడు. ఒక్కసారిగా ఆశ్చర్యం! ఆనందం!! మనసు పట్టలేని సంతోషం. కాణిపాకం మహిమ. ఈ దారి చూపించిన వరసిద్ధునికి కోటి దండాలు అంటూ బుద్ధి స్థిమితపడింది. మాకు కావలసిన సంఖ్య మేరకు ప్రతిమల తయారీ పూర్తి చేసి, సకాలంలో హైదరాబాదుకు పంపుతానని విక్రయదారుడు మాటిచ్చాడు. ఒప్పందం కుదుర్చుకొన్నాం.

కష్టాలు కనుమరుగు
2005 సెప్టెంబరు- వినాయకచవితికి మూడు రోజుల ముందు శ్వేతార్క గణపతితో ‘దైవమ్’ మార్కెట్లోకి విడుదలైంది. తెలియని వారికి అతిశయోక్తి అనిపించవచ్చు గానీ ఒక్కరోజులోనే ప్రతులన్నీ అమ్ముడయ్యాయి. మరికొన్ని కావాలని ఏజెంట్లు అడిగినా అందివ్వలేకపోయాం. ఆధ్యాత్మిక పత్రికారంగంలో దైవమ్ నవ సంచలనం. శ్రమ, ఒత్తిడి దూదిపింజలా ఎగిరిపోయాయి. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దివ్యానుగ్రహంతో ‘దైవమ్’ మాసపత్రిక విజయపథంలో ముందుకు సాగింది. కష్టాలు ఒకటొకటిగా కనుమరుగయ్యాయి. ఆనాటి నుండి వృత్తి, వ్యక్తిగతం శుభప్రదంగా కొనసాగుతున్నాయి. నా ఇష్టదైవం శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి నిత్య ప్రణామాలు.

భగవన్నామ స్మరణ
వేదన- మనసును కుంగదీస్తుంది. కష్టం- బతుకు తీపిని చిదిమేస్తుంది. ఈ సమయంలో ముందుకెళ్లే దారి కనిపించదు. ఇక్కడే భగవంతుడు గుర్తుకొస్తాడు. నమ్మని వాళ్లను కూడా తన దారిలోకి తీసుకెళతాడు. ఆ దుఃఖంలో అచేతనంగా అనుసరిస్తాం. శరణాగతితో స్వామి పాదాలను ఆశ్రయించాలి. దైవ స్మరణ-ప్రార్థన శ్రద్ధతో ఆచరిస్తే- భక్తుడైన బాధితుడు తిరిగి శక్తిమంతుడు అవుతాడు. ఇదే విషయమై ఎవరైనా తమ స్వానుభవాన్ని వివరిస్తే- కష్టాల్లో చిక్కుకొన్న వారి భగవద్భక్తికి ఒక నమ్మకం, ఊతం చిక్కుతాయి. పురాణ కథల అంతరార్థం ఇదే. కొంత సుదీర్ఘమైనా ‘కథ కాని కథ’ను మీ ముందుంచాను. ఉమామహేశ్వరుడు, విష్ణువు, సూర్యుడు, గణేశుడు, అంబికా… మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. దైవ నామ స్మరణ నిత్యం రక్షగా నిలుస్తుంది. ఆవేదనలోనే కాదు, ఆనందంలోనూ భగవన్నామ పఠనం పరమ శ్రేయోదాయకం.

సాధన – పరిష్కారం
‘దైవమ్’ పత్రిక విజయానికి ప్రధాన సూత్రం ఏమిటని మిత్రులు కొందరు అడుగుతుంటారు. పెద్ద రహస్యమేమీ లేదు. సూత్రం సులువైనది. దేవాలయ దర్శనంలో కీలకమైనవి రెండు అంశాలు. ఒకటి- మనశ్శాంతి. రెండు- అభీష్ట సిద్ధి. కోరిక నెరవేరాలని మనసులో అనుకోగానే సరిపోదు- ఆ సంకల్పం సిద్ధించడానికి సాధన తప్పనిసరి. సమస్యను ఎదుర్కొంటున్న వారు భక్తితో సాధన చేస్తే పరమాత్మ పరిష్కారాన్ని ప్రసాదిస్తాడు. ఇదే కనుక జరగకపోతే ఈ విశ్వ చలనం ఏనాడో ఆగిపోయేది. సంసార సాగరంలో తలమునకలవుతోన్న భక్తులు భగవదనుగ్రహంతోనే ముందుకు వెళ్లగలుగుతున్నారు. ఉత్తర భారతదేశంలోని ధార్మిక, వైదిక, జ్యోతిష గ్రంథాల్లో అనేక సాధనలు నిక్షిప్తమయ్యాయి. ఇవన్నీ మానవ సమస్యల తొలగింపుకై మహర్షులు చెప్పినవి. వీటిని ‘దైవమ్’ శోధించి, అందరికీ బోధపడేలా సులభ శైలిలో గత పదిహేనేళ్లుగా చెబుతోంది. ప్రతి మాసం ఒక పూజా ద్రవ్యాన్ని కూడా అందిస్తోంది. పాఠకులు విశేషంగా ఆదరించారు. అందరికీ ధన్యవాదాలు.

దైవమ్ డిజిటల్
పత్రికలు కొని చదివే పాఠకుల సంఖ్య ఇటీవల బాగా తగ్గిపోయింది. ఈనాడు, ఇండియా టుడే వంటి ప్రముఖ సంస్థలు కొన్ని ప్రచురణలు నిలిపివేశాయి. ముఖ్యంగా 45 ఏళ్ల లోపు యువత సోషల్ మీడియాను అనుసరిస్తోంది. మన చేతుల్లోని మొబైల్స్ ప్రపంచంలోని సకల విషయాలూ చూపెడుతున్నాయి. వాటిని చూడటంలోనే రోజంతా గడచిపోతుంది. ఈ పరిస్థితుల్లో పత్రిక ప్రచురణ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. 2019 ఆగస్టు నుండి ‘దైవమ్’ ముద్రణ నిలుపు చేశాం. ‘దైవమ్’ను డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో ఫేస్-బుక్ ద్వారా 2020 జనవరిలో శ్రీకారం చుట్టాం. వరసగా నూరు రోజులు శుభ పంచాంగమ్, సంకల్ప సిద్ధి శీర్షికలు పోస్ట్ చేశాం. పాఠకుల స్పందన బావుంది. చదివేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 30, గురు-పుష్య యోగ శుభ ఘడియల్లో daivammdigital.com పేరుతో వెబ్-సైట్ లాంఛనంగా ప్రారంభించాం. సమగ్ర రూపకల్పన జూన్ 2020 లోపు పూర్తవుతుంది.

‘దైవమ్’ అత్యధిక పాఠకుల చెంతకు చేరాలనే డిజిటల్ ప్రయత్నం విజయవంతం కావాలని సకల దేవతా మూర్తులను ప్రార్థిస్తున్నాం. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ ‘దైవమ్’ పట్ల మీ ఆదరాభిమానాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ…. అందరికీ కృతజ్ఞతాపూర్వక అభివందనాలు.

– ఎ.బాలరెడ్డి
ఎడిటర్, 3 మే 2020, హైదరాబాద్.

సమర్పణ :  దైవమ్ డిజిటల్