అక్షర వాచస్పతి

డా. దాశరథి రంగాచార్య

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి

శ్రీ.
భగవదనుగ్రహ ప్రాప్తి.

యాత్రలు యాంత్రికం కావు. భక్తి జ్ఞానాలతో జీవితానుభవాన్ని రంగరించి, అంతర్నేత్రంతో అఖిలాండ నాయకుని దర్శించగలిగినప్పుడు యాత్రానుభూతి సిద్ధిస్తుంది. ఆర్ష విజ్ఞానాన్ని మథించి తేట తెలుగులో అందించిన బహు గ్రంథకర్త, సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ దాశరథి రంగాచార్య అనుభవం నుంచి పరవశించి పలవరించిన ఈ యాత్రాస్మృతి తీర్థక్షేత్ర వైభవాన్ని లోచూపుతో దర్శింపజేస్తుంది.

ధారావాహిక – 70వ భాగం
(జూన్ 2020 సంచిక తరువాయి)

ఆంజనేయస్వామి ఆదేశం

యాదర్షికి స్వప్నంలో ఆంజనేయుడు దర్శనం ఇచ్చారు.
‘నాయనా యాదర్షీ! నీ నారసింహ తపన ఎరిగినవాడను. నీ వెంటనే ఉన్నవాడను. నీవు సరైన స్థలానికి చేరావు. తపమాచరించు. ఇది సిద్ధి క్షేత్రం. నీ తపస్సు ఫలిస్తుంది’ అన్నాడు.

యాదర్షి కళ్లు తెరిచాడు. వచ్చింది కల మాత్రం కాదు – ప్రత్యక్షం అనిపించింది. ఇంకా ఆంజనేయుడు తనకు ఉపదేశిస్తున్నట్లే ఉంది!
యాదర్షి ఆంజయనేయులది ఆదేశంగా భావించాడు. ప్రాణం మాత్రం మిగిలిన దేహంతో తపస్సు ప్రారంభించాడు.

దేహబలం కన్న సంకల్పబలం మిన్న!
యాదర్షి ఎండకు ఎండినాడు. వానకు తడిసినాడు. చలికి వణికినాడు. చలించలేదు! 
అడవి మృగములు చకితలైనవి! యాదర్షికి కాపుగా నిలిచినవి! 

స్వామి చలించినాడు! కరుణించినాడు!! ప్రత్యక్షం అయినాడు!! 
‘బిడ్డా!’
యాదర్షికి ఆలాపనలా అనిపించింది. కనులు తెరిచాడు.

శాంత సుందర లక్ష్మీనరసింహస్వామి

ఎదుట స్వామి! సూర్యుడే దిగివచ్చినంత తేజము!
‘స్వామీ! నేను సామాన్యుడను – మానవుడను!! నీ తేజస్సు భరించగలనా? దర్శించగలనా?’

‘వత్సా! నీకు దివ్య చక్షువులు ప్రసాదింతును’.
‘వలదు స్వామీ! సామాన్యునికి వలె శాంత రూపమున దర్శనం ప్రసాదించు’. 

‘అట్లే అగుగాక – దర్శించు’. 
యాదర్షి ముందు శాంతసుందర లక్ష్మీనృసింహస్వామి నిలిచినాడు!
యాదర్షి దర్శించినాడు. ఆనంద పరవశుడు అయినాడు. గద్గద స్వరమున స్తుతించినాడు. స్వామి ప్రసన్నులు అయినారు. 

‘వత్సా! ఏమి నీ కోరిక?’
‘స్వామీ! నీవు దర్శనం ప్రసాదించినావు. నా జీవితం ధన్యమైనది! ఆ జన్మల కోరికలు తీరినవి. కాని, స్వామీ! నీ దర్శనానికి ఇంతటి తపస్సు సామాన్యులకు సాధ్యమా? నీవు లోక కళ్యాణార్థ బహుజన దర్శనార్థం ఈ రూపాన ఇక్కడే నిలిచి పొమ్ము’.

‘బిడ్డా! నీ లోకకళ్యాణ కాంక్షను మెచ్చినాం. మేము అర్చారూపమున నిలుచుచున్నాం. కోనేటిలో నిరంతరం నీరు వచ్చుచుండును. సాక్షిగా ఆంజనేయుడు నిలిచి ఉండును. కొన్ని యుగాలు ఇక్కడ దేవతలే అర్చింతురు. రానున్న కలియుగాన మానవులు నన్ను దర్శించి తరింతురు’ అట్లని స్వామి అదృశ్యులు అయినారు. 

కొండ శిలమీద స్వామి ఆవిర్భవించినారు!
యాదర్షికి పూర్వ దేహబలం, శక్తి వచ్చాయి. దేవతలతో కూడి స్వామిని అర్చిస్తూ కాలం గడుపుతున్నాడు.

పవిత్ర క్షేత్రం యాదగిరి

యాదర్షికి అనంతర కాలంలో మరొక తపన ప్రారంభం అయింది. అంతటి స్వామిని ఒక రూపంలో దర్శించుకున్నాడు. భిన్నరూపాలు దర్శించుటకు బయలుదేరాడు.

యాదర్షి ప్రస్తుతపు యాదగిరి గుట్టకు చేరుకున్నాడు. మహారణ్యపు గుండంలో స్నానం చేశాడు. నిద్రాహారాలు మానాడు. తపశ్చర్య ప్రారంభించాడు.
కాలం గిరగిరా తిరిగింది. యాదర్షి దేహంలో ఎముకలు, ప్రాణం మాత్రం మిగిలాయి! అప్పుడు స్వామి ప్రత్యక్షం అయినారు.

‘వత్సా’
యాదర్షి కనులు తెరిచినాడు. ఎదుట శాంత సుందర లక్ష్మీనరసింహమూర్తి – మరింత ప్రసన్నంగా. 

యాదర్షి హృదయం పొంగింది, ఆనందం వరదలై పారింది! 
‘తండ్రీ’ అని పాదాల మీద పడినాడు. నోరు నొచ్చేంత స్వామిని స్తుతించాడు.
‘తల్లీ! తండ్రీ! నరుడను. అజ్ఞుడను. ఒకే రూప దర్శనం కోరినాను. బహు రూపాల దర్శనం ప్రసాదించుమని ప్రార్ధన’.

‘బిడ్డా! వెర్రివాడవు. మావి అనంత రూపాలు! ఎంతటివాడును దర్శింపజాలడు. నరసింహపు ఒక రూపమును దర్శించినావు – దర్శించుచున్నావు. మరొక మూడు రూపాల దర్శనాలు ప్రసాదింతును, తృప్తి చెందు’.

1. ఇది జ్వాలా నరసింహ రూపం. అన్యులు భరింపజాలరు. సర్పాకారాన ఆవిర్భవింతును.
2. ఇది యోగానంద నరసింహ రూపం. అర్చావిగ్రహ రూపాన ఇక్కడ నిలుతును. 
3. ఇది గండభేరుండ నారసింహం. ఇక్కడనే భూ బిలమున వసింతును. 
4. అక్కడి వలెనే ఇక్కడ లక్ష్మీసహితుడనై నిలుతును.
5. నీవు స్నానం చేసిన – దేవతలు స్నానం చేయనున్న తీర్థం ‘పాప వినాశిని’ అగును.
6. ఈ ప్రాంతాలు నీ పేరనే వెలుగును.
7. ఇక్కడ నన్ను సేవించువారి కోరికలు తీరును. వారి వ్యాధులు బాధలు నివారింతును.
వత్సా! ఇక చాలును. నీకు పూర్వపు దేహశక్తి, బలమును ప్రసాదించు…’

‘వలదు స్వామీ! వలదు. నీ దివ్యరూపం దర్శించిన నేత్రాలతో మళ్లీ ఈ లోకాన్ని చూడజాలను! నాకు మోక్షం ప్రసాదించు. నీలో లీనం చేసుకో’.

యాదర్షి దేహం రాలిపోయింది. 
యాదర్షి ఆత్మ నక్షత్ర రూపాన స్వామిలో లీనమైంది. అంతటి పవిత్ర క్షేత్రం యాదగిరి (యాదాద్రి). 
యాదగిరి భక్తుల కామధేనువు – కల్పవృక్షం.

పునర్దర్శనం-1

సమస్తానికి అధిపతి కాలమే. బ్రహ్మ యుగాలు గడిచాయి. యాదగిరి స్వామి మహారణ్యంలో మూతపడినాడు.

కలియుగాన ఒకనాటి రాత్రి గ్రామాధికారికి స్వామి స్వప్నంలో దర్శనం ఇచ్చారు. తాము ఈ ప్రాంతంలోనే ఉన్నామని చెప్పారు. గుర్తులు చెప్పి ఆరాధనాదులు ఏర్పాటు చేయవలసిందని ఆదేశించారు.
గ్రామాధికారి తెల్లవారి గ్రామస్థులతో కలసి, వెదకి రేఖామాత్రంగా ఉన్న స్వామిని గుట్టపై కోనేరు – ఆంజనేయస్వామిని కనుగొన్నారు. ఆరాధనాదులు ఏర్పాటు చేశారు.

శిలలో స్వామి దర్శనం స్పష్టంగా కాదు. అందువల్ల లక్ష్మీదేవి, నరసింహస్వామి తామ్ర విగ్రహ ద్వయాన్ని ప్రతిష్ఠించారు. 
భక్తులు విశేషంగా రావడం – దర్శించుకోవటం జరుగుతున్నది.

ఈ మధ్య కిందిస్వామి ఆలయాన్ని సుందరంగా విశాలంగా తీర్చిదిద్దారు. మూలస్వామికి రజత కవచం అమర్చారు.
స్వామి దివ్యంగా దర్శనం ప్రసాదిస్తున్నారు.
ఈ స్వామి ఆదిస్వామి. ముందు ఈ స్వామి దర్శనం. తరువాత పైకి!

పునర్దర్శనం – 2

కొంతకాలం గడిచింది. 
స్వామి ఒక రాత్రి గ్రామాధికారికి స్వప్నంలో దర్శనం ఇచ్చారు. ‘తాము నాలుగు రూపాలతో ఉన్నాం’ అన్నారు. లోక కళ్యాణార్థం ప్రజలకు దర్శన ప్రాప్తి కలిగించాలని ఆదేశించారు.

తెల్లవారింది. అధికారి గ్రామస్థులతో గుట్ట ఎక్కాడు. గాలించాడు. గుహ, స్వామి రేఖామూర్తులు దర్శనం ఇచ్చారు.
గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకున్నవి. అపుడే పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు.
నాటి నుండి నిరంతరం అభివృద్ధి చెందుతూ నేటి రూపం దాల్చింది. మరింత వికాసం పొందగలదు!
ఇది సత్యం! ఇది తథ్యం!!

స్వామి భిన్నరూప దర్శనాలు

1. జ్వాలా నరసింహస్వామి
మనం గర్భగుడిలో ప్రవేశిస్తాం. ఎదురుగా స్వామి పటం కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో సర్పాకారంగా ఉంటారు.

2. యోగానందస్వామి
మరికాస్త ఆవల యోగముద్రలో ఉన్న స్వామి విగ్రహం ఉంటుంది.

3. లక్ష్మీనరసింహస్వామి
ఆ తరువాత శిలలో ఆవిర్భవించి ఉన్నాడు. కవచాదుల వల్ల స్వామి దివ్యంగా దర్శనం ప్రసాదిస్తారు.
స్పష్ట దర్శనం కోసం – అనంతర కాలంలో – లక్ష్మీదేవి – నరసింహస్వామి రజత విగ్రహలు ప్రతిష్ఠించారు. వారే ప్రధానస్వామి.

గర్భాలయం నుంచి బయటికి వస్తాం. పక్కనే గోదాదేవి కోవెల – గరుత్మంతుడు, పన్నెండుగురు ఆళ్వారులు, రామానుజుల కోవెల దర్శించుకొంటాం.
తిరిగి బయటికి పోవడానికి మెట్లు ఎక్కుతాం. మెట్లకు ఎడమ పక్కన క్షేత్రపాలక హనుమదాలయం ఉంది.

4. గండ భేరుండ నరసింహస్వామి
హనుమంతుని విగ్రహానికి దిగువ సుమారు 60 అడుగులు చదరపు రాతి చీలిక ఉంది. అక్కడ గండభేరుండ స్వయంభువ రూపం ఉంది.

హిరణ్యకశిపుడు శివభక్తుడు. ‘నరసింహుడు తనను సంహరిస్తున్నాడు రక్షించు’మని శివుని ప్రార్థించాడు. శివుడు శరభావతారం ఎత్తి వచ్చాడు. నరసింహుడు గండభేరుండై శరభమును వధించాడు.

ఈ చోటనే యాదర్షికి నరసింహుడు ప్రత్యక్షమైనారు. మోక్షం ప్రసాదించారు.
ఆంజనేయస్వామిని దర్శించుకుంటాం. బయట ఎడమవైపు మెట్లు దిగితే విష్ణు పుష్కరిణి- కుడివైపు కొన్నిమెట్లు దిగితే శివాలయం.
(మిగతా భాగం ఆగస్టు 2020 సంచికలో)

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *