
ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ‘వ్యాసపూర్ణిమ’ అని పేరు. ఈ పండుగ యతులకు అతి ముఖ్యమైనది. వారు ఈరోజున ‘మహాభారతం’ మొదలైన సంహితా గ్రంథాల రచయిత వ్యాసుని పూజిస్తారు. వ్యాసపూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు. ఈ పూజా విధానం గమనింపతగింది.
బియ్యం – నిమ్మకాయలు
కొత్త అంగవస్త్రాన్ని భూమి మీద పరుస్తారు. దాని మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మకాయలు ఉంచుతారు. ఇది శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకొంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తలా ఒక పిడికెడు తీసుకువెళ్లి తమ తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుకొంటారు.
లక్ష్మీ కటాక్షం
బియ్యం, నూతన వస్త్రం లక్ష్మీ చిహ్నం. శుభ సందర్భాల్లో యథాశక్తితో బియ్యం రాసి పోసి, లక్ష్మిని ఆహ్వానించడం హిందూ గృహల్లో పరిపాటి. నిమ్మపండ్లను కానుకగా ఇస్తారు. అవి కార్యసిద్ధిని సూచిస్తాయి. బియ్యం, నిమ్మపండ్లను ఉంచడం లక్ష్మీ కటాక్షం కోసం.
శృంగేరిలో వ్యాసపూర్ణిమ
దక్షిణ భారతదేశంలోని కుంభకోణం, శృంగేరి ప్రాంతాల్లో శంకర పీఠాలు ఉన్నాయి. వ్యాసపూర్ణిమను అక్కడ వైభవోపేతంగా జరుపుతారు. దీనిని తిలకించడానికి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
– ఆండ్ర శేషగిరిరావు
సమర్పణ : దైవమ్ డిజిటల్