తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

వృషభ రాశి
వార్షిక ఫలితాలు

వృషభ రాశి జన్మనక్షత్రాలు

కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు.
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ ఏడాదిలో వృషభ రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 14; వ్యయం – 11;  గౌరవం – 6; అగౌరవం – 1.

గ్రహ సంచారం

వృషభ రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 9ట సువర్ణమూర్తి (సర్వ సౌఖ్యాలు) గా, జూన్ 29 నుండి 8ట సువర్ణమూర్తిగా, నవంబరు 20 నుండి 9ట రజతమూర్తి (సౌభాగ్యము)గానూ, ఆ తరవాత ఏప్రిల్ 5, 2021 నుండి 10ట రజతమూర్తిగా సంచరిస్తాడు. శని ఈ సంవత్సర కాలమంతా 9ట రజతమూర్తిగా కొనసాగుతాడు. రాహు కేతువులు శ్రీ శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు ద్వితీయ, అష్టమ స్థానాల్లో తామ్రమూర్తులుగా; తదుపరి జన్మ, సప్తమ స్థానాల్లో తామ్రమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

వృషభ రాశి జాతకులకు- ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమాలుగా ఉంటుంది. గురుని భాగ్యరాశి సంచార కాలం సర్వశుభాలను కలగజేస్తుంది. అష్టమరాశి సంచార కాలంలో ఆపదలు, అనారోగ్యం, స్థానచలనాలను ఎదుర్కోవలసి వస్తుంది. శనైశ్చరుని భాగ్యరాశి సంచార కాలం కొంత అసౌఖ్యానికి కారణం అవుతుంది. రాహువు ధనస్థాన సంచారకాలంలో కుటుంబ కలహాలు, ధననష్టం, వాగ్వివాదాలు ఏర్పడతాయి. జన్మరాశి సంచార కాలంలో- అనారోగ్యాలు, స్థానచలనాలు, మానసిక ఆందోళనలు కలుగుతాయి. కేతువు అష్టమ రాశి సంచార కాలంలో- దేహపీడలు, స్థానచలనాలను ఎదుర్కోవాలి. సప్తమరాశి సంచార కాలంలో కళత్రపీడలు, మానసిక ఆందోళనలు బాధిస్తాయి.

సామాన్య ఫలితాలు

గ్రహ సంచార స్థితిని పరిశీలించగా- వృషభ రాశి వారికి ఈ సంవత్సరం (2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు) పరీక్షాకాలం. ఏ స్థాయిలోనూ గురుబలం లేదు. రాహు కేతువులు, శనైశ్చరుడు అనుకూలురు కాదు. ఈ జాతకులు ఏ రంగంలో ఉన్నవారైనా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు సామాన్య ఫలితాలతో ఉత్తీర్ణులవుతారు. ఉపాధ్యాయులకు స్థానచలన సూచనలు. వ్యాపారస్తులకు సంవత్సర ప్రథమార్థం కంటే ఉత్తరార్థంలో సామాన్య లాభాలు. రైతులకు రెండో పంట శ్రమచే విశేషంగా ఉంటుంది. కళాకారులకు సామాన్యం. వైద్యులు న్యాయవాదులు తమ వృత్తిలో తగిన నైపుణ్యం ప్రదర్శించలేరు. వృత్తిపని, పాడిపరిశ్రమ, క్రీడలు, పౌల్ట్రీ రంగాల్లో ఉన్నవారికి సామాన్య ఫలితాలు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. రాజకీయ నాయకులు మౌనంగా ఉండటం మంచిది.

ఉపాయాలు

గురు గ్రహ అష్టమరాశి సంచార దోష నివృత్తికి ఈశ్వరాభిషేకాలు చేయించాలి. గురు, శని గ్రహాల దోష నివారణకు శివాభిషేకాలు ఉత్తమం. శనివార నియమాలు, వార నియమాలు పాటించడం మంచిది. రాహు దోష నివారణకు దుర్గా, సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు పారాయణ చేయాలి. సుబ్రహ్మణ్యాభిషేకాలు జరిపించడం మంచిది.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  కృత్తిక నక్షత్ర 2, 3, 4 పాదాల జాతకులకు- గోచార రీత్యా అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నా నక్షత్ర స్థాన రీత్యా గురువు శుభఫలాలను ఇస్తాడు. ఆరోగ్యం బావుంటుంది. 
✶  రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి న్యాయ సంబంధమైన అడ్డంకులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. 
✶  మృగశిర నక్షత్రం 1, 2 పాదాల జాతకులు- గత మూడేళ్లుగా అనుభవించిన దుస్థితి తొలగుతుంది. అన్నిరకాల వ్యవహార ప్రతిబంధకాల నుండి బయటపడతారు. అయితే కార్యజయం పొందడానికి మరికొంత సమయం పడుతుంది.

అంకెల్లో అదృష్టం

వృషభ రాశి వారికి ‘6’ అదృష్ట సంఖ్య. 3, 4, 5, 8 తేదీల అంకెలు- బుధ, శుక్ర, శనివారాలు కలిస్తే యోగప్రదం.

జూలై 2020 : మాస ఫలితం

మాట తొందర వల్ల శత్రుత్వం, తదుపరి ధైర్యం, కార్యసిద్ధి, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్రుల సమాగమం, సంతాన వృద్ధి, పుత్ర సౌఖ్యం, ధన లాభాలు. బంగారు భరణాలు, గృహోపయోగ వస్తువులు కొంటారు.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *