తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

వృశ్చిక రాశి
వార్షిక ఫలితాలు

వృశ్చిక రాశి జన్మనక్షత్రాలు

విశాఖ నక్షత్రం 4వ పాదం.
అనూరాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 5; వ్యయం – 5;  గౌరవం – 3; అగౌరవం – 3.

గ్రహ సంచారం

వృశ్చిక రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 3ట తామ్రమూర్తి (సామాన్యం)గా, జూన్ 29 నుండి 2ట లోహమూర్తి (ధనహాని)గా, నవంబరు 20 నుండి 3ట తామ్రమూర్తిగా, తదుపరి ఏప్రిల్ 5 నుండి 4ట తామ్రమూర్తిగానూ సంచరిస్తాడు. శ్రీ శార్వరి నామ సంవత్సరమంతా శని 3ట తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు అష్టమ, ధనస్థానాల్లో లోహమూర్తులుగా, తదుపరి సప్తమ, జన్మస్థానాల్లో సువర్ణమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

ఏ రంగంలో వారికైనా తొట్రుబాటు లేక మనోధైర్యంతో, సదా క్రియాశీలంగా కార్యాభిలాషులై, ఆనందంగా ఉండటం, స్వప్రయత్నాలతో తలచిన కార్యాలు నెరవేరడం, హృదయాన సౌఖ్యం, శరీరసుఖం, స్వస్థానప్రాప్తి పొందుతారు. ఆశించిన ఫలితాలు సత్వరమే నెరవేరతాయి. ఇష్టులైన వ్యక్తుల అభినందనలు పొందుతారు. ఈ రాశి వారికి గురుని ద్వితీయ రాశి సంచార కాలం- ధనలాభం, కుటుంబ సౌఖ్యం, తృతీయరాశి సంచారం- సంపదలను కలగజేస్తుంది. రాహువు అష్టమరాశి సంచార కాలంలో- మనోవ్యాకులత, దుఃఖాలు, స్థాన చలనం, అనారోగ్యం బాధిస్తాయి. రాహువు సప్తమరాశి సంచార కాలం- కళత్ర మూలక భయం, పీడకలలను కలగజేస్తుంది.

శుభ ఫలితాలు

ఈ రాశి విద్యార్థులు వార్షిక, పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు- పై అధికారుల మన్ననలు పొందుతారు. రైతులకు తొలకరి పంటతో బాటు రెండో పంట కూడా అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు ఆశించిన ధన ఫలితాలు. వస్తువులు ఎగుమతులు చేసేవారు చాకచక్యంతో వ్యవహరిస్తే ధన లాభాలు పొందుతారు. కళాకారులకు, క్రీడాకారులకు సమాజంలో గుర్తింపు, గౌరవం. వ్యవసాయం, పాడి, పౌల్ట్రీ, మత్స్య శాఖల్లోని వారు లాభాలను ఆర్జిస్తారు. వైద్యులు, న్యాయవాదులు ఆధునిక విజ్ఞాన సముపార్జనతో బాటు పరిశోధన వ్యాసంగాల్లో వృద్ధిని సాధిస్తారు. వృత్తిపని వారికి ధన లాభం. ఈ రాశిలో ఎవరికైననూ శార్వరి సంవత్సర పూర్వార్థంలో అత్యంత సౌఖ్యాలు, లాభాలు కలుగుతాయి. ఉత్తరార్థంలో రాహు-కేతువుల ప్రభావంతో కార్యవిలంబనం కలుగుతుంది. లాభార్జన ఉంటుంది.

ఉపాయాలు

వృశ్చిక రాశి వారు- గురువు తృతీయ రాశి సంచార దోషానికి శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి. కేజింపావు (1250 గ్రాములు) శనగలు దానమివ్వాలి. శివ, సాయి, దత్తాత్రేయ స్తోత్రాలను పఠించాలి. రాహు-కేతువుల దోష నివారణకు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రదక్షిణలు, అభిషేకాలు చేయాలి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనంతో దోష నివారణ జరిగి, శీఘ్రఫలాలు పొందుతారు.

అంకెల్లో అదృష్టం

వృశ్చిక రాశి వారికి ‘9’ అదృష్ట సంఖ్య.1, 2, 3, 4 తేదీల సంఖ్యలు- ఆది, సోమ, మంగళ, గురువారాలు కలిస్తే మరింత మేలు జరుగుతుంది.

జూలై 2020 : మాస ఫలితం

దూర ప్రాంతాల్లో సంచరిస్తారు. అధికార పనుల్లో నిమగ్నమవుతారు. వేళను అతిక్రమించి భుజిస్తారు. ఆవేశం, క్రోధం తగ్గించుకొంటే మంచిది. మిత్రులతో వాగ్వివాదాలకు అవకాశం. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కలసివస్తాయి.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *