తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

తుల రాశి
వార్షిక ఫలితాలు

తుల రాశి జన్మనక్షత్రాలు

చిత్త నక్షత్రం 3, 4 పాదాలు.
స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో తుల రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 14; వ్యయం – 11;  గౌరవం – 7; అగౌరవం – 7.

గ్రహ సంచారం

తుల రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 4ట లోహమూర్తి (ధనహాని)గా, జూన్ 29 నుండి 3ట సువర్ణమూర్తి (సర్వ సౌఖ్యాలు)గా, నవంబరు 20 నుండి 4ట గానూ, తదుపరి ఏప్రిల్ 5, 2021 నుండి 5ట లోహమూర్తిగా సంచరిస్తాడు. శ్రీ శార్వరి నామ సంవత్సరమంతా శని సంచారం 4ట లోహమూర్తిగా కొనసాగుతుంది. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23 వరకు భాగ్య, తృతీయ స్థానాల్లో రజతమూర్తులుగా, తర్వాత అష్టమ, ధనస్థానాల్లో రజతమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

తృతీయ గురుని సంచారం వల్ల కార్యభంగం, కార్యవిలంబన మొదలైన ఫలితాలు సూచించ దగిననూ, మూర్తిమంతం చేత గురువు శుభఫలితాలిస్తాడు. దీనివల్ల జూలై ప్రారంభం నుండి సుమారు ఐదు మాసాలు ధైర్యంతో వ్యవహరించి, సోదరుల సహాయంతో సకల కార్య సిద్ధి పొందుతారు. పట్టినదంతా బంగారమై పురోగమనం, శుభకార్య నిర్వహణ తదితర ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి గురుని తృతీయ రాశి సంచార కాలం ఆపదలను కలిగిస్తుంది. అర్ధాష్టమ స్థాన సంచార కాలం ధన వ్యయం, సుఖలోపం, మాతృవంశం వారితో విరోధాలను కలిగిస్తుంది. కాని 2020 జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు- ఈ ఐదు మాసాల్లోనూ గురుని మూర్తిమంతం చేత ధనవృద్ధి, భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు. శని అర్ధాష్టమ సంచార కాలం బంధువులతో విరోధ సూచన. ఉదర సంబంధమైన అనారోగ్య సూచన. వైద్య సహాయం కోరవలసి వస్తుంది. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి.

సామాన్య ఫలితాలు

రాహు-కేతువుల్లో కేతు సంచారం బహు సౌభాగ్యకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు బాగా శ్రమిస్తే గాని ఉత్తీర్ణులు కాలేరు. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు కలుగుతాయి. పై అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు అంతంత మాత్రమే. రైతులకు రెండు పంటలూ సామాన్య ఫలితాలే. కళాకారులకు, క్రీడాకారులకు గుర్తింపు తక్కువ. పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు నత్తనడక నడుస్తాయి. వైద్యులకు, న్యాయవాదులకు సామాన్యకాలం. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నయి. కనుక ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అంకెల్లో అదృష్టం

తుల రాశివారికి ‘6’ అదృష్ట సంఖ్య. 5, 7, 9 తేదీల సంఖ్యలు- బుధ, శుక్ర, శనివారాలతో కలిస్తే మంచి యోగం.

జూలై 2020 : మాస ఫలితం

శరీరంలో సోమరితనం. పాపపు పనుల మూలంగా కీర్తి నశిస్తుంది. చేసిన చెడు పనుల వల్ల ఇతరులపై ప్రభావం పడుతుంది. విష పదార్థాలను భక్షిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణాలు గోచరిస్తాయి. నష్టం ఉండదు.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

2 Responses

    1. శ్రీ ఎన్. రమేష్ గారికి నమస్కారం.
      దైవమ్ పత్రిక్ ప్రచురణ నిలుపు చేశాం. ఈ శ్రావణమాసం నుండి దైవమ్ సమగ్ర పత్రికను daivammdigital.com ఈ వెబ్ సైట్లో చూడవచ్చు.
      ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *