తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

సింహ రాశి
వార్షిక ఫలితాలు

సింహ రాశి జన్మనక్షత్రాలు

మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
ఉత్తర నక్షత్రం 1వ పాదం.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో సింహ రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 14; వ్యయం – 2;  గౌరవం – 1; అగౌరవం – 7.

గ్రహ సంచారం

సింహ రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 6ట తామ్రమూర్తి (సామాన్యం)గా, జూన్ 29 నుండి 5ట తామ్రమూర్తిగా, నవంబరు 20 నుండి 6ట సువర్ణమూర్తి (సర్వ సౌఖ్యాలు)గా, తదుపరి ఏప్రిల్ 5, 2021 నుండి 7ట సువర్ణమూర్తిగానూ సంచరిస్తాడు. శని శ్రీ శార్వరి సంవత్సరమంతా 6ట సువర్ణమూర్తిగా సంచారం. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు లాభ, పంచమ స్థానాల్లో తామ్రమూర్తులుగా, తదుపరి దశమ, చతుర్థ స్థానాల్లో లోహమూర్తులుగానూ సంచరిస్తారు. సింహరాశి వారికి 5ట గురువు సంపద, 6ట శని లక్ష్మీ ప్రవర్తనం, 11ట రాహువు సర్వ శుభాలు, ఆకస్మిక ధనలాభాలు, 5ట కేతువు వ్యయం.

అనుకూల – ప్రతికూలతలు

సింహ రాశి వారికి- శార్వరి సంవత్సరంలో శనైశ్చరుని బలం తగినంతగా ఉండటం వల్ల సర్వ కార్య సిద్ధి, ధనధాన్యాభి వృద్ధి, పుత్రపౌత్ర ప్రవర్థనం. మీ ఇంట శుభకార్య నిర్వహణ, ఉద్యోగస్తులకు అధికారుల అండ, పదోన్నతి, సభాగౌరవం కార్యసిద్ధి కలుగుతాయి. రాజకీయ నాయకులకు, వ్యాపారులకు వరసగా ఆశించిన పదవులు, ధనలాభం కలసి వస్తాయి. శుభవార్తా శ్రవణం, కుటుంబ వృద్ధి, శుభకార్య నిర్వహణ, మొదలైన శుభయోగ సూచనలు కలవు. ఈ రాశి వారికి గురుని పంచమ రాశి సంచార కాలంలో ధన లాభం, పుత్ర మూలక సంతోషాలు. గురుని షష్ఠ రాశి సంచార కాలంలో ఋణ బాధలు, అనారోగ్యాలు, శత్రుబాధలు కలుగుతాయి. శని షష్ఠస్థాన ధైర్యం, సంచార కాలంలో ధన ధాన్య లాభాలు, భూవృద్ధి, బంధు మిత్రులతో సంతోష సౌఖ్యాలు, సంఘంలో గుర్తింపు. రాహువు లాభస్థానంలో సంచరించడం వల్ల ఆకస్మిక ధనలాభాలు, ధైర్యం, కార్యజయం కలుగుతాయి. కేతువు పంచమ స్థాన సంచారం మాత్రం అనవసర ఖర్చును, వాగ్వివాదాలను కల్పిస్తుంది. చతుర్థస్థాన సంచారం మాతృవంశం వారితో విరోధాలను సృష్టిస్తుంది.

శుభ ఫలితాలు

ఈ రాశి వారికి గురుబలం సామాన్యం. శనిబలం పరిపూర్ణంగా ఉంది. రాహుబలం కొంతవరకు కలదు. కనుక రాజకీయంగా పలుకుబడిని సంపాదిస్తారు. వివాహం జరగాల్సిన ఈ రాశి స్త్రీ పురుషులకు శార్వరి సంవత్సర పూర్వార్థంలో అనుకూల సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కృషికి తగిన ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉపాధ్యాయులకు శార్వరి ఉత్తరార్థంలో స్థాన చలన సూచనలు, అధికారుల ఆగ్రహానికి గురి కాగలరు. రైతులకు పంటలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలం, ధన లాభాలు. పాడి, పౌల్ట్రీ లు, మత్స్య శాఖల వారికి సంవతర పూర్వార్థంలో అధిక లాభాలు. తదుపరి ఉత్తరార్థంలో ఒక మోస్తరు లాభాలు. నటులు, గాయకులు, కళాకారులకు శార్వరి సంవత్సర పూర్వార్థమే అనుకూలం. సమాజంలో గుర్తింపు. క్రీడాకారులకు సన్మానాలు, వృత్తిపరులకు సంవత్సరమంతా లాభదాయకమే.

ఉపాయాలు

ఈ రాశి వారు- గురుని షష్ఠరాశి సంచారకాలంలో దోష నివారణకు- ఈశ్వరాభిషేకాలు చేయించుకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగవుతుంది. రాహువు దశమస్థాన దోష నివారణకు- దుర్గా ధ్యానం, మంగళవార నియమాలు చేయడం మంచిది. కేతువు పంచమ, అర్ధాష్టమ స్థాన సంచార దోష నివారణకు- గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధనలు, అభిషేకాలు చేయించడం శుభకరం.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  మఖ నక్షత్రం జాతకులకు- వాగ్ధాటి, సభా మర్యాదలు, గౌరవం, దేవతోపాసన, కార్యసిద్ధి కలుగుతాయి. 
✶  పుబ్బ నక్షత్రం వారికి- కుటుంబ విషయమై చింతలు తొలగుతాయి. శరీర ఆరోగ్యాలు స్వస్థత పొందుతాయి. నూతన గృహ నిర్మాణ యోగ్యత లభిస్తుంది. 
✶  ఉత్తర నక్షత్రం జాతకులకు- ధనధాన్య వివర్ధనం కలుగుతుంది. పుత్రపౌత్రాది వృద్ధి.

అంకెల్లో అదృష్టం

సింహ రాశి వారికి ‘7’ అదృష్ట సంఖ్య. 3, 4, 5, 9 సంఖ్యలు గల తేదీలు- ఆది, మంగళ, బుధవారాలతో కలిస్తే మరింత శుభప్రదం.

జూలై 2020 : మాస ఫలితం

వృత్తి, వ్యాపారాల్లో కలసి వచ్చినప్పటికీ దూర ప్రాంతాల్లో సంచరించడం వల్ల అలసట, వేళను అతిక్రమించి భుజించే కారణంగా స్వల్ప అనారోగ్యం, వాహనాలు మరమ్మతు, మార్గావరోధాలు ఎదురవుతాయి. ఆనందమయమైన జీవనాన్ని అనుభవిస్తారు.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *