మహాకవి తులసీదాసు మధుర సృజన

సత్యం శివం సుందరం
శ్రీ గణేశాయ నమః
శ్రీ జానకీ వల్లభో విజయతే

ధారావాహిక – 126 
అరణ్యకాండం
హిందీ టీకా :
హనుమాన్ ప్రసాద్ పోద్దార్
సౌజన్యంః గీతా ప్రెస్
(జూన్ 2020 సంచిక తరువాయి)

సీతాదేవి అభీష్టం

రావణుడు దండకారణ్యం సమీపించగానే మారీచుడు తన మాయా ప్రభావంతో కపట మృగమయ్యాడు. ఆ జింక అతి విచిత్రంగా ఉంది. దానిని వర్ణించడానికి సాధ్యం కాదు. దాని బంగారు రంగు గల దేహం మణిఖచితమై ఉంది.

ప్రత్యంగం మనోహరంగా ఉన్న ఆ సుందర మృగాన్ని సీతాదేవి చూసి పలికింది- ‘ప్రభూ! కృపాళూ! ఈ జింకచర్మం అతి సుందరంగా ఉంది. ఓ సత్యధురంధరా! దీనిని చంపి, దీని చర్మాన్ని తీసుకొని రండి’.

శ్రీరామునికి విషయమంతా తెలిసినప్పటికీ సంతోషంతో లేచాడు. అతడు మృగాన్ని చూసి నడుము చుట్టూ వస్త్రాన్ని కట్టుకొని, ధనువును చేతబట్టి, బాణాన్ని ఎక్కుపెట్టాడు.
శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ఇలా హెచ్చరించాడు- ‘సోదరా! వనంలో నిశాచరులు అనేకమంది తిరుగుతున్నారు. నీ బుద్ధి వివేకాలతో నీ బలాన్ని, సమయస్ఫూర్తిని ఉపయోగించి సీతను రక్షించు’.

అనుగ్రహం

ప్రభువును చూసి జింక పారిపోతుంది. శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి దానిని వెంబడిస్తున్నాడు. వేదాల్లో ‘నేతి, నేతి’ అని వర్ణించబడినవాడు, శివునిచే నిరంతరం ధ్యానింపబడే వాడైన శ్రీరాముడు మాయా మృగం వెంట పరుగెడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఆ జింక సమీపాన ఉన్నట్లే ఉండి దూరమవుతుంది. ఒకసారి కనిపిస్తుంది, ఇంతలోనే మాయమవుతుంది. ఇలా కనిపిస్తూ మాయమవుతూ అనేక పన్నాగాలతో ఆ కాంచనమృగం ప్రభువును దూరంగా తీసుకొని పోయింది. 

అప్పుడు శ్రీరాముడు గురి చూసి ఒక తీవ్రమైన బాణాన్ని సంధించాడు. అది తగలగానే ఆ మృగం గావుకేకలు పెడుతూ నేలకు ఒరిగింది. అది మొదట ‘హా లక్ష్మణా!’ అని అరిచింది. తర్వాత శ్రీరాముని స్మరించింది. ప్రాణత్యాగ సమయంలో మారీచుడు తన నిజరూపాన్ని పొంది అనన్య భక్తితో శ్రీరామ స్మరణ చేశాడు. సర్వజ్ఞుడైన ప్రభువు అతని మనసులోని భక్తి భావాన్ని గ్రహించి, మునీశ్వరులకు కూడా దుర్లభమయ్యే పరమగతిని అతనికి ప్రసాదించాడు. (చౌపాయి 1-4)

దేవతలు పుష్పవర్షం కురిపించారు. ప్రభువు గుణాలను కొనియాడారు. ‘దీన బాంధవుడైన రఘునాథుడు అసురునికి పరమపదం ప్రసాదించాడు’ అని పొగిడారు. (దోహా 27)
ఆ మాయావి అయిన మారీచుని వధించి రఘువీరుడు వెంటనే తిరిగి వస్తున్నాడు. ఆయన చేతుల్లో ధనుర్బాణాలు, నడుమున తూణీరం శోభిల్లుతున్నాయి.

విపత్కరం

ఇక్కడ సీతాదేవి- మారీచుడు పలికిన ‘హా లక్ష్మణా!’ అనే విలాప వచనం విని, అమిత భయంతో లక్ష్మణునితో ఇలా అన్నది- ‘నీవు వెంటనే బయలుదేరి వెళ్లు. మీ అన్నగారు విపత్కర పరిస్థితికి లోనైనట్లు ఉన్నారు’. 

లక్ష్మణుడు నవ్వి పలికాడు- ‘మాతా! విను. శ్రీరాముని బొమముడి సంకేతంతోనే సృష్టి లయమవుతుంది. అటువంటి స్వామి కలలో కూడా సంకటాలకు లోను కాడు’. 
అప్పుడు సీతాదేవి హృదయ విదారకమైన మాటలను పలకగానే లక్ష్మణుడు శ్రీహరి ప్రేరణ వల్ల చలించిపోయాడు. లక్ష్మణుడు సీతాదేవి రక్షణ భారాన్ని వనదేవతలకు, దిక్పాలకులకు అప్పగించి, శ్రీరాముడున్న చోటుకి వెళ్లాడు.

దశకంఠుని నటన

ఇక్కడ అదను కోసం పొంచి ఉన్న రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి ఆశ్రమాన్ని సమీపించాడు. దేవ దానవులు సైతం రావణుని పేరు వినగానే భయకంపితులై నిద్రాహారాలు మానేస్తారు. అటువంటి భయంకరుడైన దశకంఠుడు కుక్కలా దొంగతనంగా ఇటు అటు చూస్తూ వచ్చాడు.

కాకభుశుండి పలుకుతున్నాడు- గరుడుడా! చెడు తోవలు తొక్కే మానవుల్లో తేజస్సు, బుద్ధిబలం లేశ మాత్రం కూడా ఉండవు. రావణుడు రకరకాల కథలు అల్లి, సీతాదేవికి రాజనీతిని బోధించడమే కాక, ఆమెకు భయం కలిగిస్తూ, ఆమె పట్ల తన ప్రేమను ప్రకటించాడు.
సీతాదేవి- ‘సన్యాసీ! నీవు ఒక దుష్టునిలా మాట్లాడుతున్నావు’ అని పలికింది.

సీతాపహరణ

అప్పుడు రావణుడు తన నిజ స్వరూపాన్ని చూపి, తన పేరును ప్రకటించగానే సీతాదేవి భయకంపితురాలైంది. కాని, ధైర్యాన్ని కూడగట్టుకొని పలికింది- ‘దుష్టుడా! ఆగు. నా పతిదేవుడు వస్తున్నాడు. ఒక కుందేలు ఆడసింహాన్ని ఆశించినట్లు రాక్షసి రాజా! నీవు (నన్ను కోరి) కాలునికి వశమవుతున్నావు’.

సీతాదేవి మాటలను విని రావణుడు క్రుద్ధుడయ్యాడు. కాని, మనసులో మాత్రం ఆమె పాదాలకు వందనం చేసి సంతోషించాడు. (చౌపాయి 1-8)

క్రోధోన్మత్తుడైన దుష్ట రావణుడు సీతాదేవిని బలవంతంగా తన రథంలో కూర్చోబెట్టుకొని, ఆకాశ మార్గాన సాగిపోయాడు. కాని, భయవిహ్వలుడై అతడు రథాన్ని నడపలేకపోయాడు. (దోహా 28)

సీతాదేవి శోకం

సీతాదేవి విలపిస్తోంది- ‘ఓ జగద్విఖ్యాత – అద్వితీయ వీరుడా! రఘునాథా! ఆర్తిహరణా! శరణాగత వత్సలా! రమువంశాంబుజ భాస్కరుడా! నీవు నా పై దయ చూపకపోవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి? ఓ లక్ష్మణా! ఇందులో నీ దోషమేమీ లేదు. నా క్రోధ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను’.

ఇలా సీతాదేవి పరిపరి విధాల శోకిస్తోంది- ‘అయ్యో! నా పై అపార ప్రేమ గల నా నాథుడు చాలా దూరాన ఉన్నాడు. నా ఈ ఆపదను నా ప్రభువుకు వినిపించే వారెవ్వరు? యజ్ఞహవిస్సు (పురోడాశం)ను ఒక గాడిద (కుక్క) తినదలచింది’. 

సీతాదేవి దుర్భర విలాపాన్ని విని, స్థావరజంగమ ప్రాణులన్నీ దుఃఖిస్తున్నాయి. మార్గంలో గృధ్రరాజైన జటాయువు శోకార్త అయిన సీతాదేవి వాణిని విని, ‘ఈమె నిజంగా రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని పత్నియే’ అని గుర్తించింది. కపిలగోవు ఒక కసాయివాని చేతికి చిక్కినట్లు ఆమె ఆ నీచ నిశాచరునిచే అపహరింపబడటం ఆ గృధ్రరాజు చూశాడు. 

అంతట గృధ్రరాజు పలికాడు- ‘బిడ్డా! సీతా! భయపడకు. నేను ఈ రాక్షస అధముడిని నాశనం చేస్తాను’- అని ఆ పక్షి, పర్వతం మీదికి వజ్రాయుధంలా తీవ్ర కోపంతో పరుగు పరుగున వచ్చింది.

రావణ జటాయువుల యుద్ధం

ఆ పక్షి రావణునితో పలికింది- ‘ఓరీ! దుష్టుడా! నిలువు. నన్ను గుర్తించనట్లు ఎంత నిర్భయంగా సాగిపోతున్నావు?’

యుమునిలా తన మీదకు వస్తోన్న జటాయువును చూసి, రావణుడు ఆలోచిస్తున్నాడు. ‘ఇది మైనాక పర్వతమా? లేక గరుత్మంతుడా? గరుడునికి, ఆయన స్వామి విష్ణువుకు నా బలం తెలుసు’.

కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అతడు జటాయువును గుర్తించాడు. ‘ఇది వృద్ధ జటాయువు. నా చేతులనే తీర్థంలో ప్రాణాలను అర్పించడానికి వచ్చింది’ అన్నాడు.

ఈ మాట వినగానే జటాయువు క్రోధావేశంతో వేగంగా ముందుకు దూకి పలికింది- ‘రావణా! నా హెచ్చరిక విను. జానకీదేవిని వీడి, క్షేమంగా ఇంటికి పో. లేకుంటే శ్రీరాముని భయానక క్రోధాగ్నిలో నీ వంశం వారందరూ శలభాల్లా భస్మమమవుతారు’.

రావణుడేమీ పలకలేదు. అప్పుడు జటాయువు క్రోధంతో ముందుకు పరుగెత్తుకొని వచ్చి, రావణుని జుట్టు పట్టుకొని, అతనిని రథం నుండి కిందకు లాగింది. రావణుడు నేలపై పడ్డాడు. 
సీతాదేవిని ఒక పక్కన కూర్చోబెట్టి, గృధ్రరాజు తిరిగి వచ్చి ముక్కుతో పొడిచి, పొడిచి, రావణుని శరీరాన్ని విశీర్ణం చేసింది. దానివల్ల రావణుడు ఒక గడియ సేపు మూర్ఛపోయాడు. సిగ్గుపడిన రావణుడు క్రుద్ధుడై లేచి, తన కరవాలంతో జటాయువు రెక్కలను నరికాడు.

ఇలా అతి సాహసంతో, తన అత్యద్భుత పరాక్రమంతో రావణుని ఎదుర్కొని, జటాయువు శ్రీరాముని స్మరిస్తూ నేలకు ఒరిగింది. 

అనంతరం సీతాదేవిని రథంపై కూర్చోబెట్టుకొని, రావణుడు భయాందోళనలతో సాగిపోయాడు. వలలో చిక్కిన లేడిలా సీతాదేవి విలపిస్తూ ఆకాశ మార్గాన పోతోంది. మార్గమధ్యంలో ఒక పర్వతంపై కూర్చొని ఉన్న వానరులను చూసి, హరి నామ స్మరణ చేస్తూ, తన వస్త్రాన్ని (ఆభరణాల మూటను) కిందకు పడవేసింది.

రావణుడు సీతాదేవిని తీసుకెళ్లి, అశోకవనంలో ఉంచాడు.
(మిగతా భాగం ఆగస్టు 2020 సంచికలో)

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *