బాబా అనుమతి – అభినందనతో 
రూపొందిన గ్రంథం

శ్రీ.
భగవదనుగ్రహ ప్రాప్తి.

మరాఠీ మూలం :
కీ.శే. గోవిందరావు రఘునాథ 
దాభోల్కరు (హేమాడ్ పంత్)
అనువాదం : యం.మణి

ధారావాహిక – 94
(జూన్ 2020 సంచిక తరువాయి)

ప్రారబ్ధం

121. ఇప్పుడు మీకు ఇవి మేకలుగా కనిపిస్తున్నాయి కదా! పూర్వజన్మలో ఈ మేకలు సోదరులు. పరస్పరం కొట్టుకుని పరిణామంగా ఈ రూపాన్ని పొందారు. 122. మొదట్లో అన్నదమ్ముల్లో ప్రేమ ఉండేది. ఒక కంచంలో తిని ఒక మంచంపై , పడుకోనేవారు. రోజూ ఒకరి యోగ క్షేమాలను ఒకరు ఆలోచించేవారు. ఆ ఉభయుల్లో ఐక్యత బాగా ఉండేది. 123. ఆ ఇద్దరూ సహోదరులే అయినా దుర్భరమైన కర్మధర్మ సంయోగం వల్ల, భయంకరమైన ద్రవ్యలోభం కారణంగా వారిలో శత్రుత్వం ప్రబలింది.124. పెద్దవాడు మహా సోమరి. చిన్నవాడు అహర్నిశలూ శ్రమించి ధనాన్ని, కూడబెట్టుకొన్నాడు. అందువల్ల పెద్దవానికి అసూయ కలిగింది. 125. కంటకంలా ఉన్న తమ్ముని తొలగించితే తనకు ద్రవ్యానికి లోటుండదని పెద్దవాడు ధనలోభంతో చెడుగా ఆలోచించసాగాడు.

126. ధనం మీది మోహం దృష్టికి ప్రతిబంధకమైంది. కళ్లు ఉండీ అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని, సోదర ప్రేమను మరచిపోయి, తమ్ముని హతమార్చటానికి సన్నద్ధుడయ్యాడు. 127. ప్రారబ్ధ కర్మభోగం పరమ కఠినమైనది. నిష్కారణంగా శత్రుత్వం ఉత్పన్నమైంది. రహస్యంగా ఉన్న కపటం బయటపడింది. లోభం నిగ్రహించుకోలేనంతగా పెరిగింది. 128. వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మరచిపోయారు. దురభిమానం ఎంతో పెరిగి పోయింది. శత్రువుల్లా ఒకరితో ఒకరు పోట్లాడుకొన్నారు. 129. ఒకడు సోదరుడిని కర్రతో తలపైన కొట్టి కింద పడవేశాడు. రెండోవాడు గొడ్డలితో కొట్టి తన సోదరుని చంపేశాడు. 130. ఆ ఇద్దరూ రక్తం కారుస్తూ ఛిన్నాభిన్నంగా మూర్ఛపడిపోయారు. కాసేపటికంతా ప్రాణాలను కోల్పోయి ఇద్దరూ చనిపోయారు.

131. జీవితాలు అలా అంతం కాగా వారు ఈ యోనిలో ప్రవేశించారు. వారిని చూడగానే వారి ఈ వృత్తాంతమంతా నాకు గుర్తుకు వచ్చింది. 132. చేసిన కర్మను అనుభవించటానికి మేకల జన్మకు వచ్చారు. అకస్మాత్తుగా వారిని మందలో చూసి నాకు వారిపై ప్రేమ కలిగింది. 133. అందువల్ల సొంత డబ్బు ఖర్చుపెట్టి దానికి విశ్రమాన్ని కలిగించాలని అనిపించింది. కాని, మీ కారణంగా వాని కర్మ వానికి అడ్డు తగిలింది.134. మేకల మీద దయ ఉన్నా మీ బలవంతం వల్ల చివరకు నేను వాటిని గొల్లవానికి తిరిగి ఇచ్చి వేయడానికి ఒప్పుకొన్నాను’ అని చెప్పారు. 135. ఇక్కడితో కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. తరువాతి అధ్యాయాన్ని వింటే మనసుకు సంతోషం కలుగుతుంది.

భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీసాయి సమర్థ సచ్చరితంలో కాశీ గయా గమనం అజా జన్మ కథనమనే 46వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.

గమనిక :

మూల గ్రంథంలోని పేజీలు 683 నుండి 731 వరకు కనిపించడం లేదు. 47 నుండి 49 అధ్యాయాలు ఆ పేజీల్లో ఉన్నాయి. అవి లభ్యమైన తర్వాత ఆయా భాగాలను ప్రచురిస్తాం. 50వ అధ్యాయం నుండి ఆరంభిస్తున్నాం. పాఠకులు సహృదయంతో అర్థం చేసుకోవలసిందిగా మనవి.

శిరిడి సాయి సచ్చరిత 
50 వ అధ్యాయం

శ్రీ గణేశాయ నమః I శ్రీ సరస్వత్యై నమః I శ్రీ గురుభ్యో నమః I శ్రీ కులదేవతాయై నమః I 
శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః I శ్రీ సద్గురు సాయినాథాయ నమః I

అలౌకిక తండ్రి

నాకు ఈ మానవజన్మనిచ్చిన తల్లిదండ్రుల ఉపకారానికి అంతులేదు. వారు నాకు , ఈ మానవదేహాన్నిచ్చారు. నేను వారికి క్రిమిలా జన్మించలేదు.1. గుడ్డివాని గానో మూగవాని గానో, చెవిటివాని గానో, కుంటివాని గానో పుట్టలేదు. తల్లి గర్భాన్ని బాధించలేదు. మంచి శరీరంతో సవ్యంగా పుట్టాను. 2. దైవవశాత్తు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల పాదాభివందనం చేయించుకొనే ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి నేను భాగ్యశాలినయ్యాను. 3. జన్మ జన్మలకూ కోటానుకోట్ల తల్లిదండ్రులు లభిస్తారు. కాని, ఈ జనన మరణాలను తప్పించే వారు లభించరు. 4. జన్మనిచ్చిన వారు తండ్రి. రెండో తండ్రి ఉపనయనం చేసేవారు. మూడోవారు అన్నప్రదానంతో పోషించేవారు. నాలుగోవారు భవభయాన్ని తొలగించేవారు. 5. ప్రపంచంలో వీరంతా సమానం. కాని కరుణాళువైన సద్గురువు వంటి నిజమైన తండ్రి వేరే ఎవరూ ఉండరు. విశేషమైన వారి చాతుర్యాన్ని వినండి .

6. తల్లిగర్భంలో వీర్యాన్ని నిక్షేపించి యోని ద్వారా జన్మను ప్రసాదించిన వారు కేవలం లౌకిక తండ్రి. సద్గురువు అలౌకికమైన తండ్రి. 7. వారు వీర్యాన్ని ఒక్క కణమైనా వెచ్చించకుండా నీచమైన యోని లేకుండా పుత్రునికి జన్మనిచ్చి పూర్తి అనుగ్రహాన్ని కలగజేస్తారు. 8. జనన మరణాలను తొలగించేవారు కరుణాఘనులు, జ్ఞాన ప్రకాశకులు, వేదాల్లో గుహ్యంగా ఉన్న సత్యాన్ని జ్ఞానాన్ని ప్రతిపాదించేవారు, సర్వవ్యాపకులైన గురువర్యులకు నమస్కారం! 9. ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే భాస్కరా! ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించే సత్పురుషశేఖరా! భక్త చిత్తచకోరచంద్రా! కల్పతరువరా! గురువరా! మీకు నమస్కారం! 10. గురు మహరాజు మహిమ అగాధం. వారిని వర్ణిస్తే వాక్కు అహంభావం కరిగిపోతుంది. వారి చరణాల యందు శిరస్సు ఉంచి, మూగవానిలా ఊరికే ఉండటం మంచిది.

సత్సంగ మహిమ

11. పూర్వజన్మలో అఖండ తపస్సు చేసి ఉండకపోతే, తాపత్రయాలను నశింపజేసే సత్పురుషుని దర్శనం ఎవరికీ సంభవం కాదు. 12. తమ శ్రేయస్సు కోసం పరమార్థాన్ని మోక్షాన్ని సాధించాలని తలచేవారు సత్పురుషులకు అంకితమైపోతే వారికి ఎటువంటి లోటూ ఉండదు. 13. సత్సంగం ధన్యం. దాని మహిమను నేనెంతని వర్ణించను? అది సద్భక్తులకు వివేకాన్ని, విరక్తిని, పరమశాంతిని కలిగిస్తుంది.14. సాయి కేవలం చైతన్యమూర్తి. వారు అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చారు. వారి విషయాతీత స్థితిని ఎవరు నిశ్చయంగా వర్ణించగలరు? 15. భావార్థులైన భక్తులకు, ప్రేమికులైన శ్రోతలకు- కరుణామయులైన వారు, ప్రేమతో తమ చరితాన్ని తామే స్వయంగా రసవత్తరంగా తెలియజేశారు. ఇది భక్తులకు మందిరం. 

16. వారి హస్తం శిరస్సుపై పడగానే అహంభావం తునాతునకలైపోయి సోహం భావం మొదలైన దృశ్య జగత్తు అంతా ఆనందభరితంగా భాసిస్తుంది.17. అటువంటి వారి కీర్తిని వర్ణించడానికి పామరుణ్ణి నాకు శక్తి ఎక్కడిది? కరుణాళువైన వారే భక్తులపైని ప్రేమతో తమ చరితాన్ని తామే ప్రకటం చేశారు.18. ఆ సాయి సమర్థుల చరణాలకు సాష్టాంగ వందనం. సాధు సత్పురుషులకు పాదాభివందనం. శ్రోతలకు అభివందనం. అందరికీ ప్రేమాలింగనం. 19. సాయిబాబా సహజంగా మాట్లాడుతూ ముచ్చట్లను చెప్పేవారు. వాటిలో నీతి నిండి ఉండేది. నిత్యశాంతిని అలంకార భూషణంగా కలిగి ఉన్నవారిని మహానుభావులు ధ్యానిస్తారు. 20. సాయిని సూర్యునితో పోల్చటం తగదు. కారణం- సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రునితో పోల్చాలంటే- చంద్రుడు రోజురోజుకూ క్షీణిస్తూ ఉంటాడు. సాయి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటారు.

ఏకాత్మత

21. హేమాడు వారి చరణాలకు నమస్కరించి, ఈ కథను శ్రద్ధగా ప్రేమగా సావధాన చిత్తంతో వినండి అని శ్రోతలకు వినయంగా విన్నవిస్తున్నాడు. 22. నేలను చక్కగా దున్ని విత్తనాలు నాటినా మేఘాలు కరుణించి వర్షించకపోతే పంట పండుతుందా? 23. సత్పురుషుల చరితం చెవుల్లో పడగానే పాతకాలు నశించిపోతాయి. పైగా కథా శ్రవణంతో పుణ్యం అంకురిస్తుంది. అందువల్ల ఈ పండుగ లాభాన్ని పొందండి. 24. సాలోక్య సామీప్యాది నాలుగు ముక్తుల పట్ల ఆసక్తి మనకు అనవసరం.సాయిబాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరితే చాలు. అదే మనకు పరమప్రాప్తి. 25. మనం అసలు బద్ధులమే కాము. మనకు ముక్తితో ఏం సంబంధం? సత్పురుషుల యందు మనకు భక్తి జాగృతమైతే చాలు. దాని వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. 

26. నీ, నా అన్న భేదబుద్ధి లేని ఆత్మ సహజ స్థితిని, అభేద భక్తిని మనం సాయి దగ్గర నుండి కోరుకుందాం. 27. ఇప్పుడు శ్రోతలకు ఇదే నా మనవి. ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడు- వాచ్యం, వాచనం, వాచక వ్యక్తి- ఈ మూడూ ఏకాత్మ స్థితిలో ఉండేలా చూడండి. 28. ఈ హేమాడుపంతును వదిలిపెట్టండి. ఇతడు ఈ సచ్చరితకు కర్త కాడు. కేవలం భక్తుల శ్రేయస్సు కోసం కారణభూతుడైన ఒక నిమిత్తమాత్రుడు. 29. దైవవశాత్తు లభించిన ముత్యపుచిప్పను వదిలేస్తే దానిలోని ముత్యాలు చేజారిపోతాయి. అశ్వత్థవృక్షం ఉత్పత్తి విషయం మనకెందుకు? తమ శ్రేయస్సును కోరుకొనే వారికి ఉదాసీనత పనికిరాదు.30. ఈ కథలను తెలియజేసేవారు సాయిబాబా తప్ప వేరే ఎవరూ కారు. వారే- శ్రావ్యం, శ్రవణం, శ్రోత. ఈ ఏకాత్మతను మరచిపోరాదు.

అద్వైత భావం

31. లేకపోతే అది పఠన కాదు. శ్రవణంలో చెవులు శ్రద్ధగా లేకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అక్కడ శబ్దాల అర్థాలను ఎవరు గమనిస్తారు. 32. నిరభిమానంగా శ్రవణం చేయాలి. శ్రోతలను కూడా సాయిగానే భావించాలి. అప్పుడే ఆ శ్రవణానికి సార్థకత. అలా ఎప్పుడూ అద్వైత భావంతో ఉండాలి. 33. అప్పుడే సకల ఇంద్రియ ప్రవృత్తి నిశ్చయంగా సాయిరూపం అవుతుంది. ఈ విధంగా నీరులోని నీటి తరంగాల్లా మనోవృత్తి సాయిలో విలీనమవుతుంది. 34. అప్పుడే గ్రంథంలో జ్ఞానులకు పరమార్థ బోధ. వినోద ప్రియులకు వినోదం. కవితా కోవిదులకు రసాస్వాదం. అంతటా ఆనందం లభిస్తుంది. 35. ఇంతకుముందు ఈ సచ్చరితలోని 39వ అధ్యాయంలో ఉత్తముడైన ఒక భక్తునికి సాయి సమర్థులు ఉపదేశం చేశారు. 

36. ఆ భక్తుడు సాయిబాబా వద్ద ఉన్న సమయాన భగవద్గీతలోని నాలుగో అధ్యాయాన్ని మొదటి నుండి వల్లిస్తూ ఉన్నాడు. 37. ఒక వైపు బాబా చరణసేవ చేస్తూ మరో వైపు మెల్లగా గీతా శ్లోకాలను చెప్పుకొంటున్నాడు. 33వ శ్లోకం ముగించి 34వ శ్లోకాన్ని మొదలు పెట్టాడు. 38. ఏకాగ్ర మనసులో తన్మయత్వంతో తనలో తాను చెప్పుకొంటున్నాడు. కాని, జనులకు అది అర్థం కాకపోతే ఏమౌతుంది? 39. అతడు అలా 34వ శ్లోకాన్ని చెబుతుండగా ఉత్తముడైన ఆ భక్తుని అనుగ్రహించి, అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాలని సాయినాథునికి అనిపించింది. 40. ఆ భక్తుని పేరు నానా. బాబా అతనితో- ‘నానా! ఏమిటి రా, మనసులో ఏదో గొణుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకు చెప్పవు?

అవగ్రహ గుర్తు

41. నేను ఎప్పటి నుండో చూస్తున్నాను. నోటితో ఏదో వల్లిస్తున్నావు కాని మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. ఏమిటి అంతటి రహస్యం? ‘ అని అడిగారు. 42. ‘గీతను చదువుతున్నాను. ఇతరులకు ఇబ్బంది కాకూడదని మెల్లగా చెప్పుకొంటున్నా’నని నానా స్పష్టంగా చెప్పాడు. 43. ‘సరే, అది ఇతరుల విషయం. నా కోసం స్పష్టంగా చెప్పు. అసలు నీకైనా అది అర్థమైందా’ అని శ్రీవారు అన్నారు. 44. అప్పుడు నానా ప్రణామం చేసి ‘ తద్విద్ది ప్రణిపాతేన’ అన్న శ్లోకాన్ని గట్టిగా వినిపించాడు. దానిని విని బాబా సంతుష్టులయ్యారు. 45. తర్వాత ఆ శ్లోకానికి అర్థం చెప్పమని అడగగా, పూర్వం ఆచార్యులు వ్యాఖ్యానించిన అర్థాన్ని నానా చక్కగా చెప్పాడు. బాబా తల ఊపారు. 

46. మళ్లీ నానాను, ‘’ఉపదేక్ష్యంతి తే జ్ఞానం’ అన్న తృతీయ చరణాన్ని బాగా మననం చేసి చూడు. 47. అందులోని ‘తే’ అక్షరం తర్వాత ‘అ’కారం అర్థాన్ని తెలిపే అవగ్రహ గుర్తును ఉంచడం వల్ల అజ్ఞాన పదంతో విరుద్ధ అర్థం వస్తుందా, చూడు. 48. శంకరానందులు, జ్ఞానేశ్వర్, ఆనందగిరి, శ్రీధరస్వామి, మధుసూదనాది భాష్యకారులు, జ్ఞానపరంగా చెప్పిన అర్థం. 49. అందరూ గౌరవించినది నాక్కూడా తెలుసు. కాని, అవగ్రహాన్ని ఉంచడం వల్ల వచ్చే విశేషార్థాన్ని తెలిసి కూడా వ్యర్థంగా కోల్పోవటం ఎందుకు?’ 50. అని చెప్పి సాయి కరుణామయులు చాతక పక్షుల వంటి భక్తుల కోసం కురిపించిన శ్రీ బోధామృతాన్ని ఇదివరకే వర్ణించడమైంది.
(మిగతా భాగం ఆగస్టు 2020 సంచికలో)

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020

4 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *