శ్రీ.
భగవదనుగ్రహ ప్రాప్తి.

జూలై 18న ‘శని త్రయోదశి’

శనివారం- ఆషాఢ మాస బహుళ త్రయోదశి తిథి- జూలై 18న శాంతి పూజా పర్వం ‘శని త్రయోదశి’. ఈ రోజున చేసే ‘శనైశ్చర శాంతి’ వల్ల జాతకుని నిత్య ప్రయత్నాలు, కార్య నిర్వహణ విజయపథంలో సాగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కష్టాలు కాలక్రమేణా ఒకటొకటిగా విడిపోతాయి. అయితే ప్రయోగాల ఆచరణలో ఎలాంటి సందేహాలను మనసులోకి రానివ్వకండి. శ్రద్ధ, పరిపూర్ణ విశ్వాసం సత్ఫలితాల ప్రాప్తికి పునాది.

నూనె! రొట్టెలు!!

‘హనుమాన్! ఈ రోజు నుండి నీకు ఎవరు రొట్టెను సమర్పిస్తారో- వారికి నీ శీఘ్ర ప్రసన్నం ప్రసాదించు. శనైశ్చరా! నీకు తైలాభిషేకం చేసే భక్తులను తక్షణమే అనుగ్రహించు’ – ఈ మాటల వెనుక ఒక పురాణకథ ఉంది.

ఒక అహం‘భావన’

హిమవంతుడు, తన కుమార్తె పార్వతీదేవి వివాహ సమయంలో కించిత్తు గర్వానికి లోనయ్యాడు. ‘సాధువులు, మునులు, బ్రాహ్మణుల నుండి స్వర్గలోకంలోని వారి వరకూ అందరికీ భోజనం పెట్టగల సమర్థుడిని, ప్రతిష్ఠ కలిగినవాడిని. నా దగ్గర ఎన్ని రోజులకైనా సరిపడే ఆహార, ధన భాండాగారం ఉంది. అతిథులు ఎన్ని రోజులున్నా తరగని ధన సంపద, అన్నభాండాగారం ఉన్నవాడిని. వారు ఇంతకు ముందు ఎన్నడూ రుచిచూడని, అమృతప్రాయమైన భోజనం తయారు చేయిస్తాను. ‘అమృత సమానమైన భోజనం మొదటిసారి చేశాం’ అని అతిథులు అనుకొంటారు. సిరిసంపదల్లో నాకు సమానులు ఎవరూ లేరు’ అని హిమవంతుడు గొప్పగా భావించాడు.

శివునితో పోలిక

తనకు కాబోయే అల్లుడు పరమశివుడితో పోల్చుకొన్నాడు హిమవంతుడు. ‘కైలాసవాసి శివుడు సిరిసంపదలు లేనివాడు. అందమైన భవంతులు, అంతులేని వైభవం నాది. ప్రమథగణాల శక్తితో కైలాసపతి శ్రేష్ఠుడైనాడు. నా ఆజ్ఞను పాలించేవారు లెక్కకు మించి నా దగ్గరున్నారు’- ఇలా సాగుతున్నాయి హిమవంతుని ఆలోచనలు. మామగారి మనసును త్రినేత్రుడు గమనించాడు. హిమవంతుని ఇంటికి పెళ్లి బృందం వెళ్లే లోపే తన అనుచరుల శక్తిని తెలియజెప్పి, మామ గర్వాన్ని పోగొట్టాలన్నది పరమశివుని అంతరంగం.

అతిథుల ఏర్పాట్లు

56 రకాల రుచికరమైన పదార్థాలను హిమవంతుడు తయారు చేయించాడు. పెళ్లి వారికి స్వాగత సత్కారాలతో బాటు భోజన ఏర్పాట్లు జరిగాయి. వివాహ వేడుక కనుల పండువగా ఉంది. అన్ని ఏర్పాట్లూ చకచకా సాగుతున్నాయి. ఆహార పదార్థాల పాత్రలు నిండి ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాల్లో పెళ్లి వారికి, దేవతలకు, అతిథులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పదార్థాలను వాటిలో నింపి ఉంచారు.

శివాజ్ఞ

ఈశ్వరుడు- తన ముఖ్య అనుచరులైన హనుమంతుడిని, శనైశ్చరుడినీ పిలిచాడు. ‘మీరిద్దరూ ఎలుకల రూపంలో హిమవంతుని ఇంటికి వెళ్లండి. అక్కడున్న ఆహారాన్ని భుజించండి’ పరమేశ్వరుడు చెప్పాడు. శివాజ్ఞ పాటిస్తూ హనుమాన్, శని ఒకరి తరవాత ఒకరు హిమవంతుని ఇంట ప్రవేశించి, అక్కడ సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను తినడం మొదలెట్టారు. చూస్తుండగానే పదార్థాల పాత్రలన్నీ ఖాళీ అయ్యాయి.

సంకట స్థితి

సేవకులు, హిమవంతుని దగ్గరకు వెళ్లి ‘అపారమైన శక్తిగల రెండు ఎలుకలు ఆహార భాండాగారంలోకి ప్రవేశించాయి. పాత్రల్లోని పదార్థాలను ఖాళీ చేస్తున్నాయి’ అని చెప్పారు.
‘ఒకవైపు పెళ్లివారు తరలి వస్తున్నారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేయాలి. ధర్మసంకట స్థితి ఏర్పడింది. ఏదోవిధంగా ఈ సమస్యని పరిష్కర్కించమ’ని సేవకులు- తమ రాజు హిమవంతుడిని కోరారు. ఆ రెండు ఎలుకలను బంధించడానికి హిమవంతుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాజు పరివారం ఆందోళనగా ఉంది. తానే సర్వశ్రేష్ఠమైన అన్నదాతనని భావించిన హిమవంతుడు, తన ప్రతిష్ఠను ఎలా కాపాడుకోవాలో తెలియక సందిగ్ధానికి లోనయ్యాడు.

ఎలుకల గుట్టు పార్వతికి ఎరుక

‘ఎలుకలను ఏవిధంగా పట్టుకోవాలి? అతిథుల ముందు తన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి? భోజనాలు సకాలంలో తిరిగి ఏర్పాటు చేయడం సాధ్యమేనా? ఒకవేళ అసాధ్యమైతే తనకు చెడ్డ పేరు రావడం ఖాయం!’- ఇలా ఆలోచిస్తూ హిమవంతుడు మనసులోని బాధను కూతురు పార్వతితో చెప్పుకొన్నాడు. ‘అమ్మా! నీ తపోబలంతో ఇప్పుడేం చేయాలో తెలుసుకో’ అని కోరాడు. ఈ ఎలుకలు ఎవరు? వారు కోరుకొంటున్నది ఏమిటి? పార్వతి దివ్యదృష్టితో గ్రహించింది. వారిని పంపింది ఎవరో తెలుసుకొని, ఆమె ఆశ్చర్యపోయింది. తండ్రి హిమవంతుని గర్వం అణచడానికి శివుడే ఈ పథకం వేశాడని పార్వతి అర్థం చేసుకొన్నది.

హనుమ, శనైశ్చరుల క్షుద్బాధ

‘స్వామీ! ఇక ఈ ఆట చాలించండి. మీ అనుచర గణాన్ని వెనక్కి తీసుకోండి’ అని పార్వతి ప్రార్థించింది. భోజనశాలలో ఎలుకల రూపంలో ఉన్న హనుమ, శనైశ్చరులు- ఈశ్వరాజ్ఞ మేరకు పార్వతి ముందు ప్రత్యక్షమయ్యారు. ‘అమ్మా! మేము, ఈ ఆట చాలించాం. ఇక భోజనాన్ని నష్టపరచం. కాని, ప్రభువు ఇచ్చిన వరం ఏ విధంగా పూర్తవుతుంది? మా ఆకలి ఎలా తీరుతుంది?’ అని ఆంజనేయుడు, శనైశ్చరుడు అడిగారు. ‘మాకు చాలా ఆకలిగా ఉంది. ఈ క్షుద్బాధ తీర్చు స్వామీ!’ అని శివుడిని వేడుకొన్నారు. 
‘గౌరీ! వారికి ఇష్టమైన పదార్థాలు వడ్డించి, తృప్తిపరచమ’ని శివుడు చెప్పాడు.

ఆకలి తీర్చిన రొట్టె, నూనె

పార్వతీదేవి, మణుగుంబావు పిండిలో బెల్లం కలిపి, మంచి నేతితో రొట్టె తయారుచేసింది. ఆ నేతిరొట్టెను శ్రద్ధతో హనుమంతునికి సమర్పించింది. రొట్టెలోని కొంత భాగం తినగానే హనుమాన్ సంతృప్తి చెందాడు. 
శనైశ్చరుడు తృప్తి చెందేలా- మణుగుంబావు ఆవనూనెతో స్నానం (అభిషేకం) చేయించింది పార్వతి. పాత్రలోని నూనె నిండక మునుపే శని సంతుష్టుడయ్యాడు. ‘అమ్మా! నేను తృప్తి చెందాను. నా ఆకలి తీరింది’ అంటూ శని సంతోషాన్ని ప్రకటించాడు. 
హనుమ, శనైశ్చరుల క్షుద్బాధను ఒక రొట్టె, నూనె తీర్చడం చూసిన పెళ్లివారు ఆశ్చర్యపోయారు. 
‘హనుమా! ఇకనుండి- నీకు రొట్టెలు సమర్పించే భక్తులకు వెంటనే ప్రసన్నుడివి అవుతావు. శనైశ్చరా! నీకు తైలాభిషేకం చేసే భక్తులను దయతో అనుగ్రహిస్తావు” అని పార్వతీదేవి చెప్పింది.

శని శాంతి మార్గాలు

శని దశ, అంతర్దశ, ఏలినాటి శని, మొదలైన వాటివల్ల వ్యక్తులు తమ జీవితంలో అనేక బాధలు, వైఫల్యాలు, అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. జీవితం నరకప్రాయంగా మారుతుంది. కష్టపడి సంపాదించిన ధనం, గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠ శని ప్రతికూలత కారణంగా కోల్పోతారు. శని బాధను తగ్గించడానికై శాస్త్రాలు, పురాణాల్లో అనేక సులభ ఉపాయాలున్నాయి. ఈ చిన్ని చిన్ని ఉపాయాలు పాటించి, శుభఫలితాలు పొందవచ్చు.

హనుమాన్ చాలీసా

శనివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానాదులు పూర్తి చేసుకొని, నిత్యపూజలు నిర్వహించి, సూర్యోదయమైన ఒక గంటలోపు హనుమంతుని పటం ఎదురుగా కూర్చొని ‘హనుమాన్ చాలీసా’ 108సార్లు చదవాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. చాలీసా పఠనం తర్వాత- శనిదోషం వల్ల కలిగే చెడు ఫలితాల నుండి విముక్తిని ప్రసాదించమని ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ఈ అనుష్ఠానం శనివారం రోజు మాత్రమే చేయాలి. హనుమంతునికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.

గోపూజ

నల్లటి ఆవును పూజించడం వల్ల శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు. నల్ల ఆవుకు బొట్టు పెట్టి, కొమ్ములకు నూలుదారం కట్టి, ధూప దీపాలతో హారతి ఇవ్వాలి. ఆవుకు ప్రదక్షిణం చేసి, నాలుగు లడ్డూలు తినిపించాలి.

కాటుక పరిహారం

అనిష్ట శని- లగ్నంలో ఉంటే, జాతకుని ఇంటి ప్రవేశద్వారం పడమర దిక్కును చూస్తుంది. ఈ జాతకులు 36, 42, 45, 48 సంవత్సరాల్లో కష్టాలపాలవుతారు. చదువు పూర్తికాదు. అజీర్తి వ్యాధికి లోనవుతారు. ఈ వ్యక్తులు కాటుకను తెచ్చి భూమి లోపల పెట్టాలి. కాటుక, మర్రివేరును పాలతో ఉడికించి, దానిని బొట్టుగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల శారీరక, ఆర్థిక బాధలు, ఇతర శని ప్రతికూల సమస్యలు దూరమవుతాయి.

ఉపవాస – ఉపాయాలు

శని సప్తమ స్థానంలో ఉన్న వ్యక్తులు, మద్యపాన ప్రియులైతే వెంటనే ఆ అలవాటును దూరం చేసుకోవాలి. లేకపోతే వారి నాశనాన్ని ఎవరూ ఆపలేరు. ప్రతి శనివారం ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. ఆ రోజు సూర్యాస్తమయం తరవాత ఆంజనేయస్వామిని పూజించాలి. ఈ పూజలో సిందూరం, నల్ల నువ్వులనూనె, నువ్వులనూనె దీపం, ఎర్రటి పూలు ముఖ్యం. 5 లేదా 7 శనివారాలు ఈ పూజ చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ప్రతి శనివారం మర్రి, రావిచెట్ల దగ్గర సూర్యోదయానికి ముందే నూనెతో దీపాలు వెలిగించి, పాలు, ధూపదీపాలు సమర్పించాలి. శనివారం నాడు కోతులకు, నల్ల కుక్కలకు లడ్డూలు తినిపించడం వల్ల శనివల్ల కలిగే చెడు ప్రభావం తగ్గుతుంది. శనివారంనాడు 29 మూరల నల్లదారాన్ని తెచ్చి, మాలలా మెడలో ధరించాలి.

52 శనివారాల ప్రయోగం

శుక్రవారం రాత్రి నల్లశనగలు నీటిలో నానబెట్టాలి. శనివారం నాడు వీటిని, బొగ్గుల్ని, తేలికపాటి ఇనుపరేకుని, నలుపు వస్త్రంలో కట్టి- నీటిలోని చేపల మధ్య వదలాలి. ఇలా 52 శనివారాలు (ఒక ఏడాది) చేయాలి. దీనివల్ల శనికి శాంతి కలుగుతుంది. చేపలు తినే అలవాటున్నవారు ఈ ప్రయోగం చేసినంత కాలం పొరపాటున కూడా ఆహారంలో చేపమాంసం తీసుకోకూడదు.

శని స్తోత్రం

రొట్టెలను నలుచదరంగా చేసి ఒక రొట్టెకు నూనెను, రెండో రొట్టెకు నెయ్యి రాయాలి. నూనెరొట్టెపై కొద్దిగా తియ్యటి అన్నం ఉంచి, నల్ల ఆవుకు తినిపించాలి. అది తిన్నాక నేతిరొట్టెను కూడా ఆ గోవుకు అందివ్వాలి. తరవాత శనిదేవుణ్ని ఇలా ప్రార్థించాలి-
నమో దీర్ఘాయ శుక్రాయ కాలదృష్టే నమో నమః | 
నమోస్తు కీటరక్షాయ దుర్భిక్షాయ చ వై నమః | 
నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కపాలినే | 
నమో మందగతే తుభ్యం భాస్కరే భయదాయినే || 
అథోదృష్టే నమస్తేస్తు సవంత్రకమయాయ చ | 
తపసా దగ్ధదేహాయ నిత్యం యోగరతాయ చ || 
జ్ఞానచక్షుర్ నమస్తేస్తు కశ్యపాత్మజసూనవే | 
తుష్ఠో దదాసి వై రాజ్యం రూష్ఠో హరసి త్తక్షణాత్ || 
నమః కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ | 
నమః సురూపగాయత్ర స్థూలరోమ్ణే నమో నమః || 
నమో నిత్యం క్షుధాత్రాయ హాతృప్తాయ చ వై నమః | 
నమః కాలాగ్నిరూపాయ కృష్ణాంగాయ చ వై నమః |

జమ్మిచెట్టు వేరు

ప్రతి శనివారం కోతులకు అరటిపండ్లు, బెల్లం, నల్లశనగలు తినిపించడం వల్ల జాతకునిపై శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. క్రమేపీ సానుకూలుడవుతాడు. జమ్మిచెట్టు వేరును, శ్రవణా నక్షత్రంతో కలసిన శనివారం నాడు తెచ్చి, నల్లదారంతో కుడిచేతికి కట్టుకోవడం వల్ల శని ప్రకోపం తగ్గుతుంది.

ఆవనూనె – తోలుముక్క

శని సంబంధిత వస్తువులతో (ఇనుము, నూనె, తోలు) వ్యాపారం చేయాలి. శనివారం నాడు వీటిని విశేషంగా ఉపయోగించాలి. ఇనుప పాత్రలో 7 మిరియాలు, 7 నల్లశనగలు, 7 బొగ్గులు, 7 మినుములు, తోలుముక్కను నీలపు రంగు వస్త్రంలో ఉంచి, ఇంటి ఆవరణలో భూమి లోపల పెట్టాలి. శనివారం నాడు ఆచరించాల్సిన మరికొన్ని ఉపాయాలు- ఆవనూనెతో బొట్టు పెట్టుకోవాలి. భోజనంలో కూడా ఈ నూనెను ఉపయోగించాలి. శనైశ్చర గుడిలో ఆవనూనెతో దీపాలు వెలిగించాలి. గేదెలకు పచ్చగడ్డి తినిపించాలి. మినప పదార్థాలతో భోజనం చేయాలి.

రచన : 
పండిత కమల్ శ్రీమాలి
జ్యోతిషవేత్త

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *