ధారావాహిక

శ్రీ.
భగవదనుగ్రహ ప్రాప్తి.

నిషిద్ధకర్మలు

స్త్రీ కాని, పురుషుడు కాని- సూర్యుడు, చంద్రుడు, గురువు, ఆశ్రమం, అగ్నికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేస్తే వారు వంధ్యత్వం లేక నపుంసకత్వం పొందుతారు. నిష్కారణంగా పువ్వులు, పండ్లు కోయడం కూడా సంతాన క్షతికి కారణమౌతుంది.

ఆటంకాలు

బృహత్పరాశర హెూరా శాస్త్రంలో పూర్వజన్మ శాపద్యోతనాధ్యాయంలో సంతానోత్పత్తికి ఆటంకం కలిగించే అనేక విధాలైన శాపాల ప్రసక్తి ఉంది. పరాశరుడు మైత్రేయునికి ఉపదేశం చేసే సమయంలో ఈ విషయం తెలిపాడు. పరమేశ్వరుడు, పార్వతీదేవికి సమస్త శాపాల గురించి వివరించాడు. తదనుసారం- బృహస్పతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి బలహీనంగా ఉంటే సంతానరాహిత్య యోగం కలుగుతుంది. సూర్యుడు, కుజుడు, రాహువు, శని బలంగా ఉండి, పుత్రభావంలో ఉండి, బృహస్పతి బలహీనంగా ఉండటం- సంతాన రాహిత్య యోగం. పంచమంలో కుజుడు, రాహువు ఉండి, లగ్నం నుండి రాహువు, గుళిక సంబంధం ఉంటే సంతానం కలగదు.

నాగపూజా ఫలం

రాహుజనిత యోగంలో సువర్ణ నాగ ప్రతిమ చేయించి విధ్యుక్తంగా పూజించి గోదానం, భూదానం, తిలదానం, సువర్ణదానం చేయడం వల్ల నాగేంద్రుని కృప కలిగి, పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వంశవృద్ధి జరుగుతుంది.

పితృశాప ప్రభావం

పితృశాపం వల్ల 11 యోగాలు సంతానరాహిత్య స్థితిని కలిగిస్తాయి. సూర్యుడు కుజుని చేత దూషితుడు కావడం, శని – రాహువుల ప్రభావం సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. ఇవి మొత్తం 11 యోగాలు. పితృశాప విముక్తికి శ్రాద్ధం చెప్పబడింది. బ్రాహ్మణ భోజనం, గోదానం వల్ల ఈ దోషం పోతుంది. కన్యాదానం వల్ల కూడా పితృశాప విముక్తి కలుగుతుంది.

రావిచెట్టు ప్రదక్షిణలు

మాతృశాపం వల్ల మొత్తం 13 యోగాలు సంతాన రాహిత్యాన్ని కలిగిస్తాయి. వీటిలో చంద్రుడు దూషితుడు కావడం అన్నిటికన్నా ముఖ్యమైంది. లగ్నం పంచమం, చతుర్థ భావాలలో పాప ప్రభావం ఉంటే, ఈ భావాధిపతులు పాప అంశలలో ఉంటే 6, 8, 12వ భావాలలో కుజుడు, రాహువు, సూర్యుడు, శని వల్ల దూషితులైతే ఈ 13 యోగాల్లో సంతాన రాహిత్యం చెప్పబడింది. ఈ శాప విముక్తికి సేతుబంధ సముద్రంలో స్నానం, లక్షగాయత్రీ జపం, బ్రాహ్మణ భోజనం, రావిచెట్టుకు 1,008 ప్రదక్షిణాలు ఉపాయాలుగా సూచించారు.

చాంద్రాయణ వ్రతం

భ్రాతృశాపం వల్ల 13 యోగాలు సంతానరాహిత్యం కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది తృతీయ భావం, నీచలో బృహస్పతి, లగ్నాధిపతి. పంచమాధిపతుల్లో దోషం, ఈ అన్నిటిపై పాపగ్రహ ప్రభావం, కారణాలుగా చెప్పబడ్డాయి. కుజుడు భ్రాతృ కారకుడు. అందుచేత తృతీయ భావంతో సంబంధం చెప్పబడింది. భ్రాతృశాపం వల్ల సంతానం కలగకుంటే హరివంశ పురాణ శ్రవణం చేసి చాంద్రాయణ వ్రతం ఆచరించాలి. తరవాత గంగ, కృష్ణ, గోదావరి వంటి మహానదీ తీరంలో సాలగ్రామ సమక్షంలో రావిచెట్టు మొక్కను నాటి పూజించాలి. భార్య చేత 10 గోదానాలు చేయించాలి. మామిడి మొదలైన వృక్షాలున్న భూమిని దానం చేయాలి. తప్పక పుత్రప్రాప్తి కలుగుతుంది.

మేనమామ శాపం

మేనమామ శాపం వల్ల కూడా పుత్ర రాహిత్యం ఏర్పడుతుంది. ఈ యోగాల్లో పంచమ భావంలో బుధుడు, గురువు, కుజుడు, రాహువు ఉండి, లగ్నంలో శని ఉంటే- అది మేనమామ శాపం వల్ల ఏర్పడే యోగం. లగ్నాధిపతి, పంచమాధిపతి శని, కుజులతో పంచమంలో ఉంటే- మేనమామ శాపం వల్ల సంతానరాహిత్యం ఏర్పడుతుంది. అలాగే పంచమాధిపతి అస్తలో లగ్నంలో ఉండి, సప్తమంలో శని, లగ్నాధిపతి బుధునితో కలసి ఉంటే కూడా సంతానం కలగదు. ద్వాదశాధిపతితో చతుర్థాధిపతి లగ్నంలో ఉండటం, చంద్రుడు, బుధుడు, కుజుడు పంచమంలో ఉండటం వల్ల కూడా ఈ యోగం ఏర్పడుతుంది. ఈ దోషం శమించడానికి విష్ణుమూర్తిని స్థాపించడం , బావి, చెరువు వంటివి తవ్వించడం, వంతెనలు నిర్మించడం మొదలైనవి చేస్తే పుత్రప్రాప్తి కలుగుతుంది.

బ్రహ్మ శాపం

ధనం లేదా బలగర్వంతో బ్రాహ్మణులను అవమానించడం వల్ల ఏర్పడే ఏడు యోగాలు ‘బ్రహ్మశాపం’ పేరుతో సంతాన రాహిత్యం కలిగిస్తాయి. ఇది గతజన్మ పాపఫలం. ఈ అన్ని యోగాల్లోను బృహస్పతి పీడితుడై ఉంటాడు. ఉదాహరణకు- బృహస్పతి రాశిలో రాహువు ఉండటం. పంచమభావంలో బృహస్పతి ఉండి, నవమంలో పంచమాధిపతి ఉండటం, అష్టమంలో గురువు, రాహు-కుజ సహితుడై ఉండటం వంటి యోగాలు. ఈ అన్ని యోగాల్లో గురువు- రాహువు, శని లేదా కుజునితో పీడితుడై ఉంటాడు. గురువు పీడితుడు కావడమే కాక పంచమభావంపై రాహువు లేదా కుజుని పాప ప్రభావం ఉంటుంది.

దక్షిణతో గోదానం

ఈ శాపవిముక్తికి చాంద్రాయణ వ్రతం, మూడు సంతాపన ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. దక్షిణతో బాటు గోదానం, సువర్ణ సహిత పంచరత్నదానం, బ్రాహ్మణ భోజనం కూడా ఉపశమన మార్గాలు.

భార్యా శాపం

ఇవి 11 యోగాలు. గతజన్మలో ఏ కారణం చేతనైనా భార్యను కష్టపెట్టిన పాపం ఉంటే- మరుజన్మలో ఈ యోగాలు సంభవించి సంతాన రాహిత్యం కలుగుతుంది. ఈ యోగాల్లో సప్తమాధిపతి, శుక్రుడు, బృహస్పతి, పంచమభావం దూషితాలై పాపయుక్తం అవుతాయి. పరాశర మహర్షి ఈ శాప విముక్తికి- కన్య ఉంటే, ‘కన్యాదానం’ ఉపాయంగా చెప్పారు. కన్య లేకపోతే బంగారంతో చేసిన లక్ష్మీనారాయణుల ప్రతిమ, 10 సవత్స ధేనువులు, ఆభరణం, వస్త్రం బ్రాహ్మణ దంపతులకు దానం చేయడం వల్ల పుత్ర సంతతి కలుగుతుంది. భాగ్యవృద్ధి లభిస్తుంది.

ప్రేతశాపం

ప్రేతశాపం వల్ల కలిగే సంతాన రాహిత్యానికి తొమ్మిది యోగాలు చెప్పారు. శ్రాద్ధాధికారం కలిగి ఉండి కూడా పితరులకు శ్రాద్ధకర్మ చేయని వ్యక్తికి మృతులైన వారి శాపం తగులుతుంది. మరుజన్మలో అలా శపించబడిన వ్యక్తికి సంతాన రాహిత్యం వల్ల కష్టం కలుగుతుంది. ఈ యోగాల్లో పంచమభావంలో శని, సూర్య, సప్తమ భావంలో క్షీణచంద్రుడు, లగ్నభావంలో రాహువు, గురువు ఉండటం లేదా పంచమాధిపతిగా శని మృత్యుభాగంలో ఉండటం లేదా లగ్నంలో కుజుడు, అష్టమంలో పుత్రకారక గ్రహం ఉండటం సంభవిస్తుంది. ఇలాగే తక్కిన యోగాలు కూడా ఉంటాయి.

వంశవృద్ధి

ఈ దోషశాంతికి గయలో పిండ ప్రదానం, రుద్రాభి షేకం, గోదానం, వెండి లేక నీలమణి దానం చేయాల్సి ఉంటుందని పరాశర మహర్షి నిర్దేశిం చారు. బ్రాహ్మణ భోజనం చేయించడం వల్ల వంశవృద్ధి కలుగుతుంది.

కొన్ని సూత్రాలు

1. సవత్సా గోదానం లేదా సువర్ణ గోదానం బ్రాహ్మణునికి ఇవ్వాలి. యజుర్వేదం- ‘సోమో ధేను అర్వంత’ అన్న మంత్రాన్ని చెబుతుంది. ఆ మంత్రంతో హోమం చేయించి, చాంద్రాయణ వ్రతం ఆచరించడం వల్ల శుభఫలితం ఉంటుంది.
2. గోవును కామధేనువుగా భావించి, మూడేళ్లు ఆ గోవు పాలు, నెయ్యి, పెరుగు సేవిస్తూ, గోవును రోజూ పూజించి ప్రసాదం స్వీకరించడం వల్ల సంతాన సాఫల్యం లభిస్తుంది.
3. మహారుద్ర జపం చేయించాలి.
4. వరుణ మంత్రంతో ఆహుతి సమర్పించాలి.
5. ఆచార్యునికి సువర్ణ దానం చేయాలి.

రచన :
పండిత కమల్ శ్రీమాలి

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *