ధారావాహిక

సంతాన ప్రణాళిక

భారతీయ సంస్కృతిలో వివాహ సంస్కారం సర్వోన్నత ప్రాముఖ్యత- ‘సంతాన ప్రాప్తి’. మానవ జీవితంలో సంతానసుఖం సర్వోత్కృష్టమైంది. స్త్రీ పురుషులు సంతాన ప్రాప్తి పొంది, పితృఋణం తీర్చుకోవాలని వాంఛిస్తారు. సంతాన ప్రాప్తి వల్ల తండ్రికి ఇహ-పరలోక సుఖాలు లభిస్తాయి. ప్రపంచంలో సంతానం తల్లిదండ్రుల పేరు నిలబెడుతుంది. పరలోకంలో పితృరుణ విముక్తి కలుగుతుంది. కన్యాదానం కూడా మహాదానంగా పరిగణిస్తారు. అది అక్షయపుణ్యం కలిగిస్తుంది. అందుచేత పుత్రుడైనా, పుత్రికైనా సంతానం అన్నది జన్మ జన్మాంతరాల పుణ్యవిశేషం వల్లనే పొందగలుగుతారు.

గర్భధారణ శక్తి

సంతాన సంబంధిత అనేక ప్రశ్నలకు జ్యోతిషంలో సమాధానం చిక్కుతుంది. సంతానం కలుగుతుందా? లేదా? పుత్ర సంతానమా? లేక పుత్రికా? సంతానం ఎలా ఉంటుంది? ఇటువంటి అనేక అంశాలు జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుస్తాయి. సంతానోత్పత్తి స్త్రీ పురుషుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలకు గర్భధారణ శక్తి చంద్రగ్రహం వల్ల లభిస్తుంది. కుజుడు రక్త కారకుడు. గురువు సంతాన ప్రదాత. స్త్రీ జాతకంలో చంద్ర – కుజ – గురు గ్రహాలు, రాశి అంశాల యోగం స్పష్టంగా తెలిసినప్పుడు లభించే రాశి అంశాలు- సమరాశి, సమ నవాంశల్లో ఉంటే- స్త్రీలోని ప్రజనన సామర్థ్యం బాగా ఉంటుంది (రాశుల మొత్తం 12 కన్నా అధికమైతే 12 తీసేయాల్సి ఉంటుంది).

పురుష శుక్రాణువులు

పురుషునికి సూర్యుడు శక్తి కారకుడు. శుక్రుడు వీర్య-శుక్రాణు కారకుడు. గురువు సంతాన ప్రదాత. పురుషుని జాతకంలో ఈ మూడు గ్రహాల స్పష్టమైన రాశి, అంశాలను కలిపినప్పుడు సమరాశి, సమ నవాంశలు రావడం-  పురుషుని శుక్రాణువుల సామర్థ్యానికి సూచన. ఒకటి సమం, మరొకటి విషమమైతే మధ్యమం; రెండూ విషమమైతే ప్రజనన సామర్థ్యం తక్కువగా గణింపబడుతుంది. సంతాన సుఖాన్ని నిర్ణయించడానికి భార్యాభర్తలిద్దరి జాతకాలను పరిశీలించాలి. సంతానోత్పత్తికి పంచమ భావం – పంచమాధిపతి; నవమ భావం – నవమాధిపతి; సప్తమభావం – సప్తమాధిపతి; అష్టమ భావం – అష్టమాధిపతి; చంద్ర, కుజ, గురువుల స్థితిని విచారించాల్సి ఉంటుంది.

సంతానప్రాప్తికి తగిన సమయం

సంతాన ప్రాప్తికి తగిన సమయాన్ని వింశోత్తర మహాదశ, గోచార విధి ద్వారా తెలుసుకోవచ్చు. 1) ‘ఫలదీపిక’ గ్రంథాన్ని అనుసరించి జాతకంలో కింది గ్రహాల్లో ఏ గ్రహం యొక్క మహాదశలో లేదా అంతర్దశలో సంతానం కలగవచ్చు. 
(అ) లగ్నాధిపతి (బ) పంచమాధిపతి (స) సప్తమాధిపతి (ద) పంచమ భావంపై దృష్టి ఉంచిన గ్రహాలు (య) పంచమ భావంలో ఉన్న గ్రహాలు – వీటి మహాదశ లేదా అంతర్దశల్లో సంతానం కలగవచ్చు. 

2) ఫలదీపిక సూచించిన మరొక అంశం- ఈ కింది గ్రహాల్లో ఏది అన్నిటికన్నా ఎక్కువ బలం కలిగి ఉన్న గ్రహమో, ఆ గ్రహం మహర్దశ లేదా అంతర్దశల్లో- 
(అ) పంచమాధిపతి (బ) పంచమాధిపతికి అధిష్ఠిత రాశికి అధిపతి (స) పంచమాధిపతికి అధిష్ఠిత నవాంశ రాశికి అధిపతి (ద) గురు అధిష్ఠిత రాశి అధిపతి – ఈ గ్రహాల మహర్దశ లేదా అంతర్దశల్లో సంతానం కలిగే అవకాశం.

3) లగ్నాధిపతి , పంచమాధిపతి సప్తమాధిపతి రాశి – అంశలను కూడి, లభించిన అంశల నక్షత్రాలు తెలుసుకొని, నక్షత్రానికి అధిపతి మహర్దశలో సంతానయోగం కలిగే అవకాశం ఉంటుంది (కూడిన మొత్తం 12 కన్నా ఎక్కువైతే అందులోంచి 12ను తీసివేయాలి).

4) లగ్నాధిపతి గోచారవశంగా పంచమాధిపతితో యుతి కలిగి ఉండడం లేదా పంచమాధిపతి రాశిలోకి రావడం జరిగినప్పుడు సంతాన యోగం ఏర్పడుతుంది.

5) గురువు నుండి పంచమ భావాధిపతి ఏ రాశి లేదా ఏ నవాంశలో ఉంటే, ఆ రాశి లేదా నవాంశ నుండి త్రికోణం(5, 9)లో గురువు గోచారవశంగా ప్రవేశిస్తే ఆ సమయంలో సంతాన యోగం ఏర్పడుతుంది.

సంతాన రాహిత్యం

సంతానం లేకపోవడం ఒక దుఃఖకర పరిస్థితి. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు- 1) వంధ్యత్వం. 2) కాక వంధ్యత్వం. 3) పితృశాపం. 4) మాతృశాపం. 5) భ్రాతృశాపం. 6) మాతుల శాపం. 7) సర్పశాపం. 8) ప్రేతశాపం. 9) గర్భపాతం (తరచు). ఈ దోషాలకు తగిన పరిహారం పాటించి ఆటంకాలను తొలగించుకోవచ్చు. 

సంతాన ప్రాప్తి ప్రణాళిక 

జీవితంలో ప్రతి కార్యసాధనకు ప్రణాళిక ఉంటుంది. అలాగే సంతాన ప్రాప్తి ప్రణాళికకు, జ్యోతిష విజ్ఞానంతో సర్వగుణ సంపన్న సంతానప్రాప్తి కలగడానికి విశేషమైన విధానాలు విస్తృతంగా చెప్పబడ్డాయి. శిశువు జన్మించడానికి ముందుగానే మనోవాంఛిత సంతానం కలగడానికి అవసరమైన విధానాలను ఇందులో వివరించడమైంది. 

స్త్రీకి రజోదర్శనం కలిగిన మొదటి దినాన్ని మాసికధర్మ మొదటి రోజుగా లెక్కిస్తారు. ఈ రోజు నుండి 16వ దినం వరకు ఋతుకాలంగా భావిస్తారు. ఈ సమయంలోనే గర్భాదానం జరుగుతుంది. ఋతుకాలంలోని మొదటి నాలుగు రాత్రులు, 11వ, 13వ రాత్రులను తప్పించి, మిగిలిన 10 రాత్రుల్లో గర్భాదానం చేయవచ్చు.

ఋషుల నిర్దేశాలు

మన మహర్షులు ప్రాచీనకాలంలోనే ఉత్తమ సంతానం కలగడానికి అవసరమైన నిర్దేశాలను సూచించారు. ఋతుక్రమం ఆరంభమైన తరవాత ఏ రోజు గర్భధారణ వల్ల ఎటువంటి సంతానం కలుగుతుందనే అంశం కూడా వివరించారు. ఇది దైవికమైన విజ్ఞానం. నేటికీ ఆధునిక వైజ్ఞానికులు ఈ అంశాన్ని వివరించలేరు. మన మహర్షులు సూచించిన నిర్దేశాలు ఇలా ఉన్నాయి. 
✻  ఋతుక్రమం ప్రారంభమైన నాలుగో రోజు నిలిచే గర్భం వల్ల అల్పాయుష్కుడైన పుత్రుడు జన్మిస్తాడు. 
✻  ఐదో దినం గర్భధారణ వల్ల అల్పాయువు పుత్రిక జన్మిస్తుంది. 
✻  ఆరో రోజు గర్భధారణ వల్ల కలిగే పుత్రుని ఆయుర్దాయం మధ్యమంగా ఉంటుంది.
✻  ఏడో రోజు నిలిచే గర్భం వల్ల కన్య జన్మిస్తుంది. కాని, ఆమెకు వంధ్యత్వం ఉంటుంది. అంటే, సంతానోత్పత్తి చేయడానికి యోగ్యత ఉండదు.
✻  ఎనిమిదో దినం గర్భం నిలిస్తే పుత్రుడు జన్మిస్తాడు. అతడు ఉత్తముడై మహారాజులా జీవిస్తాడు. 
✻  తొమ్మిదో రోజు గర్భాదానం జరిగితే మహారాణిలా జీవించే పుత్రిక పుడుతుంది.
✻  పదో దినం నిలిచే గర్భం వల్ల బుద్ధిమంతుడు, నేర్పరి అయిన కుమారుడు కలుగుతాడు. 
✻  పదకొండో రోజు గర్భం నిలిస్తే పుత్రిక జన్మిస్తుంది. ఆమె స్వేచ్ఛాపరురాలు, దుష్ప్రవర్తన కలది అవుతుంది. 
✻  పన్నెండో దినం నిలిచే గర్భం వల్ల వివేకవంతుడు, సంఘంలో కలుపుగోలుతనం గల కుమారుడు జన్మిస్తాడు. 
✻  పదమూడో రోజు గర్భాదానం వల్ల పుత్రిక జన్మిస్తుంది. ఆమె సంకర ప్రకృతి గల గర్భాశయం కలిగి ఉంటుంది. 
✻  పద్నాలుగో దినం గర్భం నిలిస్తే అరవైనాలుగు కళల్లో నిష్ణాతుడు, జ్ఞాని అయిన కుమారుడు జన్మిస్తాడు.
✻  పదిహేనో దినం నిలిచే గర్భం వల్ల భాగ్యవంతురాలై, తన తెలివితేటలతో సంఘంలో ఉన్నత స్థానం సంపాదించే పుత్రిక కలుగుతుంది.
✻  పదహారో రోజు గర్భాదానం వల్ల కళలన్నీ నేర్చే బుద్ధిమంతుడైన కుమారుడు జన్మిస్తాడు.

ఉత్తమ సంతానం

దంపతుల జాతకచక్రాల్లో సంతాన యోగం ఉన్న దశా సమయాలను పరిశీలించి, శుభ ముహూర్తానికి ప్రణాళిక ఏర్పరచి, గర్భదాన సంస్కారం చేయించడం వల్ల శ్రేష్ఠమైన సంతానం కలుగుతుంది. అటువంటి సంతానం దేశపురోగతికి సహకరిస్తుంది. సంతాన ప్రాప్తి క్రమంలో పురుషుడు కూడా తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

రచన :
రాజేష్ తామ్రకార్, జ్యోతిషవేత్త

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *