ధారావాహిక

శ్రీ.
భగవదనుగ్రహ ప్రాప్తి.

భాగ్యవంతమైన
సంతానం కావాలంటే…

ప్రపంచంలో తక్కిన ఆశ్రమ ధర్మాలన్నీ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయంగా చేసుకొనే స్థితి కలిగి ఉంటాయి. అది జీవుడికి ప్రాణవాయువులా సంఘానికి ప్రాణం ఇస్తుంది. 
వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వ జంతవః | 
తథా గృహస్థాశ్రమాశ్రిత్య వర్తంతే 
సర్వ ఆశ్రమాః || 
(మనుస్మృతి)

ఋణ విముక్తి

వ్యాసులు వారు ఇలా అంటారు-
యావన్న విద్యతే జాయా 
తావదర్ధో భవేత్పుమాన్ 
నార్థం ప్రజాయతే సర్వం 
ప్రజాయేతేత్యపి శ్రుతిః ||
స్త్రీని పరిగ్రహించనంత వరకు పురుషుడు సగమై ఉంటాడు. సగభాగంతో సంతానం కలగదు. వేదం సంతానాన్ని సృజించమని ఆదేశిస్తుంది. మన దేశంలో వివాహ ప్రయోజనం కేవలం శారీరక సుఖం కాదు. గృహస్థ జీవితం సరిగా నడపడానికి, వంశవృద్ధికి సంతానోత్పత్తి కావాలి. పుత్ర సంతానాన్ని పొందిన వానికి పితృఋణం నుండి విముక్తి లభిస్తుంది.

సుఖం – నరకం

హిందూ ధర్మంలో మరణానంతరం దహన సంస్కారం, పిండ ప్రదానం తరవాత ప్రతి సంవత్సరం శ్రాద్ధకర్మ పుత్రుని వల్లనే చేయబడుతుంది. ఇవి సక్రమంగా జరగని పక్షంలో మృతవ్యక్తి పితృయోనిలో భ్రమిస్తూ ఉంటాడు. ఆరోగ్యం, సౌందర్యం, దీర్ఘాయువు, పరాక్రమం, సచ్ఛీలం, విద్య, సద్గుణాలు, కర్మనిష్ఠ కలిగి ఆజ్ఞాపాలన చేసే సంతానం- వ్యక్తి జీవితాన్ని సంతోషభరితం చేస్తుంది. అదే సంతానం మూర్ఖత, ఆలస్యం, అనారోగ్యం, దుశ్శీలం, నిష్ఠురత కలిగి ఉంటే- వ్యక్తి జీవితం నరకతుల్యమౌతుంది.

కులగురువులు

మనకు సంతోషం కలిగించే సంతానప్రాప్తికి అవసరమైన యోగాలను, గర్భాదాన ముహూర్తాలను జ్యోతిషం సూచించింది. కాని, ఈ స్థితికి ముందు దంపతులిద్దరూ శారీరకంగా, మానసికంగా గర్భాదానానికి తగిన యోగ్యత, ఆరోగ్యం కలిగి ఉండి, వారి సమాగమ లక్ష్యం సంతానప్రాప్తి అయి ఉండాలి. పూర్వం రాజుల కాలంలో రాజులకు కులగురువులు జ్యోతిష్కులు. పరాక్రమం కలిగి, సత్ప్రవర్తన, విద్వత్తు, ఆజ్ఞాపాలన మొదలైన గుణాలు గల సంతానం కలగడానికి రాజులకు మార్గదర్శనం చేసేవారు.

తగని రోజులు

వివాహం తరవాత స్త్రీకి ప్రథమ రజో దర్శనమయ్యాక ఆమె గర్భాదానానికి తగిన యోగ్యత కలిగి ఉంటుందని చెప్పబడింది.
జ్యోతిర్నిబంధంలో నారద మహర్షి ఇలా వివరించారు-
రజోదర్శనే తో స్పృశ్యానార్యో
దిన చతుష్టయమ్ | 
తతః శుద్ధా క్రియాస్వేతాః
సర్వవర్ణేష్వయం విధి || 
రజస్వల అయిన స్త్రీ నాలుగు రోజుల వరకు అస్పృశ్య. ఐదో రోజు నుండి అన్ని కార్యాలకు తగి ఉంటుంది. అన్ని వర్ణాలకూ ఇదే విధానం. గర్భాదాన సంస్కారానికి పక్షంలో ఆరవ దినం ఆదివారం, మంగళవారం, శనివారం, రజోదర్శనం మొదలు నాలుగు దినాలు, భద్ర, అష్టమి, చతుర్దశి, అమావాస్య, మాతాపితరుల శ్రాద్ధ దినాలు, సంధ్యాకాలం, రిక్త తిథి, గ్రహణ సమయం వర్జించదగినవి.

గర్భాదాన ఫలితాలు

రజో దర్శనమైన నాలుగో రోజు గర్భాదానమైతే క్లేశం కలిగించే పుత్రుడు పుడతాడు. ఐదో దినం పుత్రిక, ఆరో రోజు అల్పాయుష్కుడైన పుత్రుడు, ఏడో దినం పుత్రిక, ఎనిమిదో రోజు శ్రేష్ఠుడైన పుత్రుడు, తొమ్మిదో దినం సత్పుత్రిక, పదో రోజు దీర్ఘాయుష్మంతుడైన కుమారుడు, పదకొండో దినం సౌందర్యవతి అయిన కన్య, పన్నెండో రోజు ధర్మాత్ముడైన పుత్రుడు, పదమూడవ దినం కన్య, పద్నాలుగో రోజు శుద్ధ సాత్విక స్వభావం గల ధనవంతుడయ్యే పుత్రుడు, పదిహేనో దినం లక్ష్మీసౌభాగ్యం గల కన్య, పదహారో రోజు పరాక్రమం, దీర్ఘాయువు గల తనయుడు జన్మిస్తారు. ఈ లెక్క- రజో దర్శనమైన మొదటి రోజు నుండి ప్రారంభించాలి. మొదటి మూడు దినాలు గర్భాదానానికి పనికిరావు.

నక్షత్రాల గణన

బృహస్పతి చెప్పిన ప్రకారం-
హరిహస్తనురాధాశయ 
స్వాతీ వరుణవాసవమ్ |
త్రీణ్యుత్తరాణి మూలం చ 
రోహిణీ చోత్తమాస్మృతా || 
చిత్రాదైత్యేంద్రవాతిష్య 
తురంగా చాతిమధ్యమా | 
శేష మాన్య ధమాన్యాహుర్వర్షనీయా 
నిషేకకే || 
(ముహూర్త చింతామణి) 
పైన చెప్పిన విధానంలో గర్భాదానానికి నక్షత్రాలను కూడా విచారించాల్సి ఉంటుంది. అంటే- సంభోగానికి శ్రవణ, హస్త, అనూరాధ, స్వాతి, శతభిష, ధనిష్ఠ, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మూల, రోహిణి నక్షత్రాలు ఉత్తమం. చిత్త, పుష్యమి, అశ్విని నక్షత్రాలు మధ్యమం. భరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పూర్వఫల్గుణి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి నక్షత్రాలు అధమం. అంతేగాక తమ జన్మనక్షత్రం, వైధృతి యోగం, పగలు, అర్ధరాత్రి, యమదంష్ట్ర – యమఘంటా యోగాలు, జ్వాలాముఖి యోగం, మృత్యుయోగం. ఇవి పంచాంగంలో ఇవ్వబడతాయి. తమ జన్మ నక్షత్రాల నుండి గర్భదాన నక్షత్రం 7వది కావటం, లేదా జన్మ నక్షత్రాల నుండి గర్భదాన దిన నక్షత్రం లెక్కించి 9తో భాగిస్తే శేషసంఖ్య 7 కావడం కూడా గర్భాదానానికి పనికిరావు.

గ్రహాల ప్రభావం

ఆచార్య వరాహుని అనుసారం- గర్భాదాన సమయంలో సూర్యుడు, గురువు, చంద్రుడు బలంగా ఉండి విషమరాశిలో కాని, విషమరాశి నవాంశలో కాని ఉంటే పుత్ర జననం జరుగుతుంది. లగ్నం, గురువు, చంద్రుడు సరాశిలో ఉంటే పుత్రికా జననం జరుగుతుంది. గురువు, సూర్యుడు విషమరాశిలో ఉంటే పుత్రుడు; చంద్రుడు, శుక్రుడు, కుజుడు సమరాశిలో ఉంటే పుత్రిక జన్మిస్తారు. చంద్రుడు, శుక్రుడు, కుజుడు ద్విస్వభావ రాశిలో ఉంటే – వారిపై మిథుని దృష్టి ఉంటే కవలలు జన్మిస్తారు. నాలుగు రాశులు ద్విస్వభావ రాశులు ఉంటాయి. వీటిలో మిథున, ధనుర్లగ్నాల్లో గర్భాదానం జరిగితే పుత్రుడు; కన్య లేక మీన లగ్నాల్లో గర్భాదానమైతే పుత్రిక జన్మిస్తారు.

మనసు-తనువు భర్తతోనే!

రజోదర్శనం తరవాత స్త్రీ తన భర్త పట్ల అనురాగం కలిగి, అతని గురించే ఆలోచించాలి. కారణం- గర్భాదానంపై మానసిక ప్రభావం చాలా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీ భర్తను గాక వేరే పురుషుని గురించి ఆలోచిస్తే లేదా ఆసక్తి కలిగి ఉంటే- గర్భాదానం తరవాత జన్మించే శిశువుపై ఆ వ్యక్తి గుణగణాల ప్రభావం ఉంటుంది. వాస్తవానికి శారీరక సంబంధం భర్తతో కలిగి గర్భాదానం జరిగినా ఈ ఫలం కలుగుతుంది. అందుచేతనే పూర్వం నవదంపతుల చిత్రాలే తగిలించేవారు కాని, క్రూర జంతువుల, భయంకర దృశ్యాలను ఉంచేవారు కాదు.

చెడు యోగాలు

ప్రసవ చింతామణిలో కొన్ని కుయోగాలు చెప్పబడ్డాయి. గర్భాదానం సూర్యుని నవమరాశిలో జరగడం; ఆ సమయం పై సూర్యుని లేక కుజుని దృష్టి ఉండటం; సూర్యునికి సప్తమ స్థానంలో శని, కుజుడు ఉండటం; సూర్యుడు, శని చరరాశిలో ఉండటం; కుజునితో కలిసి కాని, కుజుని దృష్టిలో కాని ఉండటం; నాలుగవ నవమ భావాలలో రెండు పాపగ్రహాలు ఉండటం; లగ్నాధిపతి బలహీనుడు కావడం- ఈ కుయోగాల్లో గర్భాదానం జరిగితే తల్లిదండ్రులకు కష్టకారణం అవుతుంది.

తల్లీ బిడ్డకూ ప్రమాదం

గర్భాదాన సమయంలో సూర్యుడు, చంద్రుడు పాపగ్రహాల మధ్య ఉండటం; శుభగ్రహాల దృష్టి ఉండటం; అతనిపై కుజుని దృష్టి ఉండటం; ద్వాదశ భావంలో సూర్యుడు, క్షీణచంద్రుడు పాపగ్రహాల దృష్టిలో ఉండటం; నాలుగవ భావంలో కుజుడు, శుక్రుడు పాపగ్రహాల మధ్య ఉండటం; లగ్నాల నుండి సప్తమంలో కుజుడు ఉండటం వంటి స్థితులు- ప్రసవ సమయంలో తల్లికి శిశువుకు కూడా మృత్యుసమాన కష్టం కలిగిస్తుంది. కాని, సాధారణంగా ఇటువంటి కుయోగాలు చాలా తక్కువగా ఏర్పడతాయి.

మృత్యుసమానం

గర్భకాల లగ్నం నుండి ద్వాదశ భావంలో పాపగ్రహం ఉంటే, దానిపై ఏ శుభగ్రహ దృష్టి లేకపోతే, సూర్యుని నుండి ద్వితీయ, ద్వాదశ స్థానాల్లో శని, కుజుడు ఉంటే, లేదా సూర్యుడు శని-కుజుల మధ్య ఉంటే లేదా చంద్రుడు శని-కుజుల మధ్య ఉంటే, ద్వాదశ స్థానంలో చంద్రుడు, అష్టమంలో సూర్యుడు, చతుర్థంలో కుజుడు లేదా శని ఉంటే- తల్లికి, తండ్రికి కూడా మృత్యుసమాన కష్టం కలుగుతుంది.

శుభరాత్రులు

గర్భాదాన సమయంలో లగ్నశుద్ధిని గమనించే ‘ముహూర్త గణపతి’ గ్రంథంలో ఇలా పేర్కొన్నారు-
కేంద్ర, త్రికోణ స్థితే సామ్యే పాపే చ త్రిషడాయగే | 
పుంలగ్న పున్నవాంశే చ తథా పుంగ్రహ వీక్షితే ||
-అంటే, గర్భాదాన లగ్నం నుండి 1, 4, 5, 7, 9, 10 భావాలలో శుభగ్రహాలు; 3, 6, 11 భావాలలో పాపగ్రహాలు ఉంటే, చంద్రుడు విషమరాశిలో, విషమరాశి నవాంశలో ఉండటం సమరాత్రి 6, 8 లేదా 10వ రాత్రి అయితే గర్భాదానం శుభంగా ఉంటుంది.

సంతాన ప్రాప్తికి కొన్ని సూత్రాలు

1. తులసీ కళ్యాణం వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరిపించాలి.
2. ప్రతి అమావాస్యకు బ్రాహ్మణ భోజనం చేయించాలి.
3. తొమ్మిది దినాలు దుర్గాపాఠం విధ్యుక్తంగా పఠించాలి.
4. కులదేవతా దోషం తొలగించుకోవాలి. జాతకంలో షష్ఠమంలో శని ఉండి,  ఆ గ్రహంపై చంద్రుని లేదా బుధుని దృష్టి ఉన్నా లేక లగ్నంపై పాపగ్రహ దృష్టి ఉన్నా ‘కులదేవతా దోషం’ అంటారు. శని రాశిలో సూర్యుడు స్థితుడై పాపగ్రహ దృష్టితో ఉండటం. పంచమ స్థానంలో శని రాశిలో సూర్యుడు, లగ్నంలో పాపగ్రహం ఉండటం. ఇటువంటి స్థితిలో- కులదేవతకు (దేవికి) విధ్యుక్తంగా పూజ, యజ్ఞసాధన, ప్రాయశ్చిత్తం, శాప విమోచనాది యజ్ఞం చేసి, దేవతా పూజ చేయడం శ్రేయస్కరం. కులదేవత పూజ కుల పరంపరాగతంగా చేయబడుతుంది. తమ పూర్వీకులు చేసిన విధానంలో చేయడం శుభంగా భావించబడుతుంది.
5. ఒక బ్రాహ్మణ కన్యకు వివాహం చేయించడం శుభకరం. ఈ కళ్యాణం ఆర్థికంగా నిరుపేదలైన దంపతుల కుమార్తెకు జరిపించాలి.

రచన :
ఆచార్య డా. లక్ష్మీనారాయణ శర్మ

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020.

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *