ధారావాహిక

శ్రీ.
భగవదనుగ్రహ ప్రాప్తి.

పుత్రుడు దుష్టుడైతే ధనం ఎందుకు దాచాలి? పుత్రుడు సత్ర్పుత్రుడైతే ధన సంచయం ఎందుకు? -అని ఆర్యోక్తి.

పుత్రుని అధికారం

సంతానం గురించి ప్రాచీన భారతీయ వాజ్ఞ్మయం సంవేదనాత్మకంగా స్పందిస్తుంది. కొన్ని స్మృతి గ్రంథాలు- వివాహం ప్రధాన ఉద్దేశం సంతానోత్పత్తి అని నిర్దేశిస్తాయి. పుత్ర జననం వ్యక్తిని పితృ ఋణం నుండి విముక్తిని చేస్తుంది. తండ్రికి ఉత్తరక్రియలు చేయడానికి, పిండదానం చేయడానికి పుత్రునికే అధికారం ఉంటుంది. ఈ కార్యంలో కన్యా సంతతికి ప్రాముఖ్యత లేదు.

కర్తృత్వ గౌరవం

భారతదేశ ప్రాచీన విధానంలో- మనుస్మృతి లేదా మితాక్షర, దాయభాగ పద్ధతిలో (ఇది ప్రాచీన రాజ్యాంగం వంటిది) సంపద, పైతృ సంపదల గురించి యజమాని మరణానంతరం జ్యేష్ఠ పుత్రునికి కర్తృత్వాధికారం ఉంటుందని, సమస్త కుటుంబ సంపద, బాధ్యతలను అతడే నిర్వహిస్తాడని స్పష్టంగా చెప్పబడింది. ఈ సకల కారణాల వల్ల పుత్ర సంతానానికి ప్రాముఖ్యత పెరిగింది. కర్తగా ప్రకటించబడిన వానికే కర్తృత్వ గౌరవం ఇవ్వబడుతుంది.

మారిన చట్టం

1955లో భారతదేశ రాజ్యాంగంలో వారసత్వ అధికారాల చట్టంతో పరిస్థితి మారింది. కన్యా సంతతికి కూడా పుత్ర సంతానంతో బాటు సమాన అధికారాలు ప్రకటించారు. జ్యేష్ఠ పుత్రాధికారం పేరుకు మాత్రమే నిలిచింది. రాజ్యాంగంలో వారసత్వ చట్టం ప్రకారం కర్తృత్వం వంటి నియమాలు సమాప్తమయ్యాయి. అవిభాజ్య హిందూ కుటుంబంగా అది కేవలం ఆదాయపు పన్ను ఫైళ్లకు పరిమితమైంది. వాస్తవానికి లేనట్టే గణించబడుతుంది.
ఈ కారణం చేతనే ప్రాచీన కాలంలో పుత్రసంతానం కోసం అనేక ప్రయత్నాలు చేసేవారు. జ్యోతిష్కులు, వైద్యుల సలహాలు తీసుకొనేవారు. విధిలేని పరిస్థితిలో దత్తత తీసుకోడానికి సిద్ధమయ్యేవారు.

జాతకం ‘పంచమ’ స్థానం

బృహస్పతి (గురువు) సంతానోత్పత్తికి స్థిరకారక గ్రహం. కాని, జైమిని జ్యోతిషం ప్రకారం- ఏ గ్రహమైనా పుత్ర కారకమైనప్పుడు తన దశలో పుత్రుని ప్రసాదించే స్థితిలో ఉంటుంది. జైమిని జ్యోతిషంలో- ఏ గ్రహమైనా పుత్రకారక గ్రహం కావచ్చన్నది విచిత్రమైన సిద్ధాంతం. ఆత్మకారక, అమాత్యకారక, భ్రాతృకారక, మాతృ కారకాల తరవాత పుత్రకారక స్థానం వస్తుంది. అంటే- చర కారకాల్లో ఇది ఐదవది. బహుశా జాతకంలో పంచమస్థానం సంతాన భావమని చెప్పడానికి ఇది కారణం కావచ్చు.

కారకుడు బృహస్పతే

పరాశర జ్యోతిషంలో- పంచమ భావాధిపతి ఏ గ్రహమైనా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తుంది. వేరు వేరు లగ్నాల్లో వేరు వేరు గ్రహాలు పంచమ భావాధిపతులు అవుతారని దీని భావం. అందుచేత ఏ గ్రహమైనా సంతాన కారకం కావచ్చు. చర కారకాల్లో పుత్రకారక, వింశోత్తరి పద్ధతిలో పంచమాధిపతి – ఈ రెండు పద్ధతుల్లోను ఏ గ్రహమైనా సంతాన కారకం కావచ్చు. జన్మలగ్నం దృష్ట్యా ప్రభావానికి కారకం ఉంటుంది. వీటిలో పంచమ భావానికి కారకునిగా ఎప్పుడూ బృహస్పతినే చెబుతారు. బ్రాహ్మణుడు, ఇల్లు, ధనం, పసుపురంగు వస్త్రాలు, పసుపురంగు ధాన్యాలు, బంగారం, పసుపురంగు పుష్పాలు, పసుపురంగు ఫలాలు, పుష్యరాగం, మిత్రుడు, తేనె, పసుపు, చక్కెర, భూమి, గొడుగు, యజ్ఞం, అధ్యయనం, లావణ్యం, సత్కర్మ- వీటికి కారకగ్రహం బృహస్పతి.

వామనావతారం

సంస్కృత వాజ్మయంలో బృహస్పతిని గురువు అని సంబోధిస్తారు. తైత్తరీయ ఉపనిషత్తులో- బృహస్పతిని వర్ణిస్తూ ‘విరాట్పురుషుని ప్రతిభ, వాక్కు’గా పేర్కొన్నారు. బృహత్పరాశర హెూరా శాస్త్రంలో- బృహస్పతిని విష్ణువు ‘వామనావతారం’గా తెలిపారు. విష్ణుపురాణం- ఇతనిని బ్రహ్మగానే వర్ణిస్తుంది. కొన్నిచోట్ల బృహస్పతిని గణపతిగా, ఆంగిరసునిగా కూడా పేర్కొన్నారు. దేవతలకు పురోహితుడు, గురువు బృహస్పతి.

శివానుగ్రహం

ఒక పురాణ కథను అనుసరించి- ఆంగిరస మహర్షి బృహస్పతికి జన్మనిచ్చాడు. బృహస్పతి మానసిక శక్తులకు అధిపతి, దేవతలకు ఆచార్యుడు. విజ్ఞానానికి కూడా ఆధిపత్యం అతనిదే. ఋగ్వేదంలోని ఒక కథనం ప్రకారం- బృహస్పతి ఆకాశం నుండి ఉద్భవించాడు. ఇతనికి సప్తముఖాలు, సప్తకిరణాలు ఉన్నట్టు చెప్పబడింది. ఋగ్వేదంలోని ఒక ‘ఋక్’కు ఇతడే రచయిత. అతడు ఆ మంత్రానికి ద్రష్ట కూడా. స్కంద పురాణంలోని ఒక కథనం ప్రకారం- బృహస్పతి వెయ్యేళ్లు శివుని గురించి ఆరాధన చేయగా, శివుడు అతనికి గ్రహపదం అనుగ్రహించాడు.

గురువు కీలకం

స్త్రీల జాతకంలో బృహస్పతి పతి, పుత్రకారక గ్రహం. వివాహ కారకుడు కూడా గురువే. ధార్మిక, దైవ కార్యాలు, కర్మకాండ, చట్ట సంబంధ కార్యాలు బృహస్పతి పరిధిలోకి వస్తాయి. శరీరంలో వసపై అతని అధికారం ఉంటుంది. కర్మకాండలో బలి, హవిస్సులు అతనికి సంబంధించినవి.

ప్రథమ సంతానం

జ్యోతిషంలో సంతానోత్పత్తికి సంబంధించిన యోగాల గురించి విస్తారంగా చర్చించారు. సంతానాన్ని ప్రసాదించే గ్రహాలు ఎన్నో ఉన్నా వాటిలో ప్రథమస్థానం బృహస్పతికే దక్కుతుంది. అతని తరవాత ఏదైనా పురుష గ్రహానికి ఆ గౌరవం లభిస్తుంది. పంచమాధిపతి ఏదైనా పురుష గ్రహంతో కలసి ఉంటే- ప్రథమ సంతానం పుత్రుడు జన్మిస్తాడని శాస్త్ర వచనం.

‘మయూరపంఖ’ భస్మం

జ్యోతిషం, ఆయుర్వేద శాస్త్రాల్లో పుత్రప్రాప్తికి అనేక ఉపాయాలు వివరించారు. ఈ దిశగా ఆధునిక విజ్ఞానంలోనూ చాలా కృషి జరిగింది. స్త్రీల వ్యాధులకు సంబంధించి ప్రపంచఖ్యాతి పొందిన డా. లైండరమ్ బి. సైటల్స్- వేలాది అమెరికన్ దంపతులను పరీక్షించారు. స్త్రీలో అండోత్పత్తి జరిగే సమయానికి ఎంత సమీపంలో గర్భధారణ జరిగితే అంత ఎక్కువగా పుత్రులు కలిగే అవకాశం ఉంటుందని నిర్ధారించాడు. అంతేగాక ఆయన పరిశోధన ద్వారా గర్భధారణ సమయంలో- స్త్రీ యోని మార్గం క్షారీయ మాధ్యమం కలిగి ఉంటే పుత్రుడు, ఆమ్ల మాధ్యమం కలిగి ఉంటే పుత్రిక జన్మిస్తారని కూడా కనుగొన్నారు. ఈ సిద్ధాంతం వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదవేత్తలు తెలుసుకొన్నారు. అందుచేతనే వారు ‘మయూరపంఖ’ భస్మాన్ని ఉపయోగిస్తూ వచ్చారు.

సంతాన వ్రతాలు

‘అహెూయీ అష్టమి’ వ్రతం- పుత్రప్రాప్తి కోసం, పుత్రుల రక్షణ కోసం చేస్తారు. ‘శీతలాష్టమి’ వ్రతం, పూజ- సంతానరక్షణ కోసం చేస్తారు. అంతేగాక ‘వత్స ద్వాదశి’ వ్రతం కూడా పుత్రప్రాప్తి, రక్షణ ఉద్దేశంతోనే ఆచరిస్తారు. స్త్రీలు ‘వత్స ద్వాదశి’ నాడు- అప్పుడే ఈనిన ఆవునుంచి తీసిన పాలు (జున్ను) తాగుతారు.

గణపతి – పుత్రప్రాప్తి

పుత్రప్రాప్తి కోసం భగవంతుని ప్రార్థించే వారు నిత్యం చదవాల్సిన ‘సంతాన గణపతి’ స్తోత్రం- 

నమోస్తు గణనాథాయ 
సిద్ధి బుద్ధి యుతాయ చ | 
సర్వప్రదాయ దేవాయ 
పుత్ర వృద్ధి ప్రదాయ చ || 
గురుదరాయ గురవే గోప్త్రే 
గుహ్యాసితాయ తే | 
గోప్యాయ గోపితా
శేషభువనా చిదాత్మనే || 
విభవమూలాయ భవ్యాయ 
విభవ సృష్టికరాయ తే | 
నమో నమస్తే సత్యాయ 
సత్యపూర్ణాయ శుండినే || 
ఏకదంతాయ శుద్ధాయ 
సుముఖాయ నమో నమః | 
ప్రపన్నజనపాలాయ 
ప్రణతార్తి వినాశినే || 
శరణం భవ దేవేశ 
సంతతి సుదృఢాం కురు | 
భవిష్యతి చ యే పుత్రా 
మత్కులే గణనాయక || 
తే సర్వే తవ పూజార్థే 
నిరతాః స్యుర్వరో మతః | 
వ్రతప్రదమిదం స్తోత్రం 
సర్వసిద్ధిప్రదాయకమ్ ||

సామాజిక జీవితంలో కుటుంబ సంతోషం, పితృఋణ విముక్తి కోసం దంపతులకు సంతాన ప్రాప్తి శుభకరమని ఆర్ష గ్రంథాలు చెబుతున్నాయి.

కొన్ని సూత్రాలు

1. సంతానకాంక్ష ఫలించని ఇల్లాలు- జాతకం లేదా సాముద్రికం (హస్తరేఖా శాస్త్రం), జ్యోతిష త్రిస్కంధ విధానం- దేని ద్వారానైనా దోషాలను తెలుసుకొని, నివారణ జరిపించాలి. యోనిదోషం, పితృదోషం, గ్రహ అనోదయ వక్రత్వం, దృష్టిదోషం వంటి వాటిని తొలగించుకోవాలి. 
2. ‘సంతాన గోపాల’ మంత్రం నియమపూర్వకంగా జపించాలి.
3. బ్రాహ్మణ బాలుని ఉపనయన సంస్కారం ఖర్చు భరించాలి.
4. దంపతులిద్దరూ నాగపంచమి వ్రతం ఆచరించాలి.
5. హరివంశ పురాణం పఠనం చేయించాలి.

రచన : 
సతీష్ శర్మ, జ్యోతిషవేత్త

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *