రచన :
ధనకుధరం వరదాచార్యులు

బాలభారతి : ధారావాహిక – 3
(జూన్ 2020 సంచిక తరువాయి)

విరుద్ధంగా ఏమీ మాట్లాడకు!

అక్కడ గురువులు ప్రహ్లాదుణ్ణి ఏకాంతంగా కూర్చోబెట్టి, ధర్మార్థ కామాల గురించి మరికొంత కాలం ఉపదేశించారు. సామ దాన భేద దండోపాయాలతో విషయాలన్నిటినీ సమగ్రంగా బోధించి, నీతికోవిదుడయ్యాడనే విశ్వాసం ఏర్పడిన తర్వాత, ఆ బాలుణ్ణి తల్లి దగ్గరకు తీసికొని వచ్చి, ఆమెతో ఇలా అన్నారు- “అమ్మా! మా శక్తి సామర్థ్యాలన్నిటినీ వెచ్చించి, ఈ ప్రహ్లాద కుమారునికి సకల విద్యలను బోధించి, నేడు ప్రభువుల సన్నిధికి తీసుకెళుతున్నాం. కనుక, ఈ బాలుణ్ణి చక్కగా అలంకరించి పంపండి. 

పురోహితులు చెప్పినట్లు కుమారుణ్ణి లీలావతి చక్కగా అలంకరించి పంపింది. అప్పుడు చండా మార్కులు ప్రహ్లాదునితో ‘నాయనా! మేము చెప్పిన విద్యల్లోని విషయాలకు విరుద్ధంగా ఏమీ చెప్పకు. ధర్మార్థకామాల గురించి మేము బోధించిన విషయాలను ఏ మాత్రం మరువకు. లోగడ నీవు ప్రభువుల దగ్గర పలికిన పలుకులను ఈనాడు కూడా పలికి, మా ప్రాణాలు తీయించకు. మన విరోధిని గురించిన మాటలు మాట్లాడకు’ – ఈ రీతిగా దారి పొడుగునా ఆ ప్రహ్లాదునికి హెచ్చరికలు చేస్తూ, బుజ్జగిస్తూ, రాజసభకు తీసుకెళ్లారు చండామార్కులు. 

సర్వం విష్ణుమయమని విశ్వసించి, సహజంగా  వినయం, దయా స్వభావం కలిగిన ప్రహ్లాద కుమారుణ్ణి, తండ్రి పాదాలకు నమస్కరించవలసినదని ముందుకు నెట్టుతూ- ‘దానవేశ్వరా! నీ కుమారుణ్ణి మేము చక్కగా శిక్షించాం.ఈ బాలుడిప్పుడు – శత్రుపక్షానికి సంబంధించిన విషయాలను పూర్తిగా విస్మరించాడు. కనుక, ఇక వీనిని మీరు పరీక్షించవచ్చు’ అని, వాత్సల్య దృష్టి – చిరునవ్వు ఏకమైన ముఖంతో ఉన్న రాజుతో అన్నారు.

తనకు మొక్కి నిలుచున్న కుమారుణ్ణి, హిరణ్యకశిపుడు దగ్గరకు చేరదీసి తనివితీరా కౌగలించుకొన్నాడు. ఒడిలో కూర్చోబెట్టుకొని, ముంగురులు సవరించాడు. శిరస్సుపై ముద్దులు పెట్టుకొన్నాడు. వాత్సల్యాన్ని ఒలికిస్తూ, ఆనందబాష్పాలతో అతని ముఖాన్ని చూస్తూ, మెల్లగా – తీయని మాటలతో ఇలా అన్నాడు- ‘బాబూ! నిన్ను చూసి చాలా కాలం గడిచింది. నీ గురువులు శ్రమపడి ఏ యే విద్యలు నీకు బోధించారో, నిను ఏ విధంగా చదివించారో, నీ చదువు ఏ రీతిగా ఉన్నదో, ఆ విశేషాలను తెలుసుకోవాలని తహతహలాడుతున్నాను. కనుక,
నీకు తెలిసిన శాస్త్రంలో ఏదైనా ఒక పద్యాన్ని చదివి, అర్థ తాత్పర్యాలు చెప్పు. విని ఆనందిస్తాను’.

జన్మసార్థకం కావాలంటే…

ఇలా అన్న కన్నతండ్రితో ప్రహ్లాదుడు- ‘తండ్రీ! గురువులు నాకు చాలా విద్యలు బోధించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన శాస్త్రాలను ఎన్నింటినో నేను వారి దగ్గర అధ్యయనం చేశాను. చదువుల్లో గల అన్ని రహస్యాలనూ గ్రహించాను. మనస్సులో గాని, మాటల్లోగాని, చేతల్లో గాని – సర్వాంతర్యామియైన హరిని, శ్రవణం – కీర్తనం – స్మరణం – పాద సేవనం – అర్చనం – వందనం – దాస్యం – సఖ్యం – ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాల్లో నమ్మి భజించడమే జీవితానికి తరుణోపాయం.

విష్ణుభక్తి లేని సంసారాలు – నిస్సారాలుగాను, ప్రయోజన రహితాలుగాను కనపడతాయి. కనుక, మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ సార్థకం కావాలంటే మన శరీరంలో ఉన్న ప్రతి అణువును ఆ హరిసేవకే అంకితం చేయాలి. ఆ రీతిగా చేయని జన్మ నిరర్థకమౌతుంది. పండితుడనని విర్రవీగేవాడైనా విష్ణుభక్తి లేకపోతే రెండు పాదాల పశువు అవుతాడు. విష్ణువును గురించి పాఠాలు చెప్పేవాడే నిజమైన గురువు. ‘శ్రీహరి చరణాల చెంత, సేవ చేయరా’ అని కుమారునికి బోధించేవాడే నిజమైన తండ్రి’.
-అని ఏ జంకు గొంకు లేకుండా మాట్లాడుతున్న ప్రహ్లాదుని మాటలు దానవేశ్వరుని చెవుల్లో శూలాలై, పొడుస్తున్నట్లు అనిపించాయి.

మా తప్పేమీ లేదు

అప్పుడు హిరణ్యకశిపుడు అమిత ఆగ్రహంతో గురుపుత్రుల వైపుకు తిరిగి, ‘ఏమండీ! మంచి మంచి నీతి శాస్త్రాలను బోధించి, బాలుణ్ణి గొప్ప పండితుణ్ణి చేస్తామని మాతో చెప్పి, తీసుకెళ్లి, విరోధి శాస్త్రాలు బోధించారేమి? మీరు భృగు వంశంలోని వారనీ, మంచి బ్రాహ్మణులనీ, మిమ్మల్ని విశ్వసించాను. మీరు నిజంగా బ్రాహ్మణులేనా?’ అన్నాడు.

అప్పుడు చండామార్కులు భయపడుతూ, తడబడుతున్న మాటలతో ఇలా అన్నారు-
‘దానవనాథా! ఈ విషయంలో మా తప్పేమీ లేదు. మీ పాదాలపై ఒట్టు పెట్టి, చెబుతున్నాం. విరోధి శాస్త్రాలు మేము బోధించలేదు. ఇతరులు ఎవరు అలా చెప్పరు కూడా. ఇది అంతా మీ కుమారునికి పుట్టుకతో వచ్చిన బుద్ధే గాని, ఒకరు నేర్పినందువల్ల వచ్చింది కాదు. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించండి మహాప్రభూ! మేము మీకు మిత్రులం, పురోహితులం. ఎల్లప్పుడూ మీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తూ ఉండేవాళ్లం. విశేషించి, మేము భృగువంశానికి చెందినవాళ్లం కూడా. మీ కుమారుణ్ణి ఇలా మార్చడానికి మేము శత్రువులమా
చెప్పండి?’

ఆ బ్రాహ్మణుల మాటలు విని, వారి మీద కోపాన్ని విడిచి, ప్రహ్లాదుణ్ణి చూసి, దానవనాథుడు ఇలా అన్నాడు- ‘ఓరీ బాలకా! నీకు గురువులు బోధించని ఈ విద్యాబుద్ధులను నేర్పినవారు ఎవరు? వారి పేరు చెప్పు’.

ఆ మాటలకు, ప్రహ్లాదుడు తండ్రికి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు- ‘తండ్రీ! హరిభక్తి పుట్టుకతో వచ్చేదే కాని, ఒకరు బోధిస్తేనో లేక, తాను శాస్త్రాలన్నిటినీ స్వయంగా వల్లిస్తేనో లభించేది కాదు. కర్మబద్ధులైన కొందరు విష్ణువును చూడలేరు. ఈ ప్రపంచలో ఏ కొందరికో మాత్రమే హరిభక్తి కలుగుతుంది. అది కూడా – పూర్వజన్మ సంస్కారం ఉంటేనే. ఇంతకూ, ఈ భయంకరమైన సంసార సముద్రాన్ని దాటాలంటే, అందరికీ శ్రీహరి పదసేవ తప్పక ఉండాలి’.

రాజుగుండె రాయయింది

ఈ మాటలు వినగానే దానవేశ్వరునికి ఇంతకుముందు గల పుత్ర వాత్సల్యం పూర్తిగా అంతరించింది. అందువల్ల, తొడల మీద కూర్చున్న పుత్రుణ్ణి – వెంటనే కిందికి తోసేశాడు. కోపం మిన్నుముట్టింది. కళ్లు ఎర్రబడ్డాయి.

మంత్రుల వైపుకు తిరిగి, అతడు ఈ రీతిగా అన్నాడు- ‘భూవరాహ రూపంతో వీని పినతండ్రి ప్రాణాలు తీసిన ఆ విష్ణువును విడవకుండా, పై పెచ్చు- సేవకుని వలె అతనినే సేవిస్తూ, అతనికి భక్తుడై, ఆ హరిని మరువకుంటున్నాడు ఈ పరమదుర్మార్గుడు. చివరకు అందు నిమిత్తం, ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధమవుతున్నాడు. తండ్రినైన నాతోనే వైరం పెట్టుకొంటున్నాడు. ఈ పితృద్రోహిని ఎక్కడైనా మీరు చూశారా?’ అని, వెంటనే రాక్షసుల వైపు తిరిగి-

‘రాక్షసులారా! వీనికి నిండా ఐదేళ్లు కూడా లేవు కదా! తండ్రి అన్నభయం ఏ మాత్రం లేకుండా, నన్ను నిందించి, మన శత్రువైన ఆ హరిని పదేపదే స్తుతిస్తున్నాడు. వలదని ఎంతగా చెప్పినా ఆలకించడం లేదు. నా శరీరంలో పుత్రాకారంతో ఈ వ్యాధి పుట్టింది. కనుక, వీనిని మీరు తీసుకెళ్లి చంపి రండి, పొండి. బుద్దిహీనుడూ – కులద్రోహీ – హరి పక్షపాతీ అయిన ఇతనిని చంపి, వంశానికి కళంకం లేకుండా చేసుకోవాలి. కాబట్టి, వీనిని మీరు చంపవలసిందే. రక్షించాలన్న అభిప్రాయానికి ఇక తావు లేదు. వీడు యమలోకానికి తప్పక వెళ్లవలసిన వాడే. క్షమాగుణాన్ని ఏ మాత్రం చూపక, వీనిని వధించి రండి’ అని ఆజ్ఞాపించాడు.

హిరణ్యకశిపుని ఆజ్ఞానుసారం – వాడికోరలు గల కొందరు రాక్షసులు – శూలాలు పట్టుకొని, నోళ్లు తెరచుకొని, పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ప్రహ్లాదుణ్ణి పట్టుకొని, శూలాలతో పొడుస్తూ, బాగా బాదడం ఆరంభించారు. చిన్నవాడని గాని, రాచబిడ్డడని గాని, దయగలవాడని గాని, మంచివాడని గాని, తలచక, ఆ బాలుని శరీరాన్ని రాక్షసులు ఎంతో హింసించారు.

ఆశ్చర్యంగా ఉందే!

అలా తీవ్రమైన హింసకు గురైనప్పటికీ, ఆ బాలుని శరీరం ఎంతమాత్రం బాధపడలేదు. రక్తం పైకి రాలేదు. శరీరం ఏ మాత్రం కందలేదు. అవయవాలు ఏమీ దెబ్బతినలేదు. చూపులో మార్పు ఏమాత్రం రాలేదు. ముఖ కాంతి తగ్గలేదు. 

రాక్షసేశ్వరునికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. తనలో ఇలా అనుకొన్నాడు- ‘ఈ కుర్రకుంక – తనను రాక్షసులు శూలాలతో పొడుస్తున్నా కన్నుల నీరు రానీయడేమి? మాటిమాటికీ – ‘ఓ పన్నగశాయీ! ఓ దనుజభంజనా! ఓ జగదీశా! ఓ మహాపన్నశరణ్యా!’ అంటూ ఏవేవో స్తుతి వాక్యాలు పలుకుతున్నాడే గాని, కనీసం భయపడడేమి?’

ఇక ఏం చేయాలి?

ఇలా అనుకొంటూ ఆ రాక్షసరాజు నిగ్రహించుకోలేక, ఆ పసివాణ్ణి ఒకసారి ఏనుగుల చేత తొక్కించాడు. మరొకసారి విషసర్పాల చేత కరిపించాడు. ఇంకొకసారి మండేమంటల్లో విసిరేయించాడు. సముద్రంలో పడవేయించాడు. విషాన్నం పెట్టించాడు. కొండల మీద నుండి పడదోయించాడు. మారణహోమం చేయించాడు. ఎర్రని ఎండలో నిలబెట్టించాడు. ధారాపాతంగా కురిసే వర్షంలో నిలబెట్టించాడు. ఊపిరి సలపకుండా నవరంధ్రాలు మూయించాడు. 

తన రాక్షస మాయలతో – అనేక విధాలుగా బెదిరించాడు. దట్టంగా పట్టిన మంచులో ఒంటరిగా ఉంచాడు. పెనుగాలికి ఎదురుగా నిలబెట్టించాడు. గోతిలో పాతి పెట్టించాడు. అన్నపానీయాలు లేకుండా చేశాడు. కొరడాలతో – రాళ్లతో – గదలతో – బాణాలతో బాగా కొట్టించాడు. ఇంకా ఎన్నో విధాలా చంపించడానికి ప్రయత్నించాడు. కాని, ప్రహ్లాదుడు చావలేదు.

హిరణ్యకశిపునకు ఏమి చేయాలో తోచలేదు. అనేక విధాలుగా విచారపడుతూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మహా ప్రభావం గలవాడనీ, అతనితో విరోధం పెట్టుకోవడం వల్ల, తనకు మరణమే నిశ్చయమని నిశ్చయించుకొన్నాడు.
(మిగతా భాగం ఆగస్టు 2020 సంచికలో)

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *