తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

మిథున రాశి
వార్షిక ఫలితాలు

మిథున రాశి జన్మనక్షత్రాలు

మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు.
ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో మేషరాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 2; వ్యయం – 11; గౌరవం – 2; అగౌరవం – 4.

గ్రహ సంచారం

మిథునరాశి వారికి- గురువు 2020 మార్చి 29 నుండి 8ట లోహమూర్తి (ధనహాని)గాను, జూన్ 29 నుండి 7ట రజతమూర్తి (సాభాగ్యం)గా, నవంబరు 20 నుండి 8ట లోహమూర్తి (ధనహాని)గా, తదుపరి 2021 ఏప్రిల్ 5 నుండి 9ట లోహమూర్తిగానూ సంచరిస్తాడు. శని శార్వరి నామ సంవత్సరమంతా 8ట లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహు, కేతువులు శార్వరి సంవత్సరాది నుండి 2020 సెప్టెంబరు 23 వరకు జన్మ, సప్తమ స్థానాల్లో రజతమూర్తులుగాను, తర్వాత వ్యయ, షష్ఠ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

ఈ రాశి వారికి గురుని సప్తమ రాశి సంచార కాలంలో కళత్ర మూలక సుఖం, ముఖవర్చస్సు కలుగుతాయి. గురుని అష్టమరాశి సంచారకాలంలో ధన నష్టం, అనారోగ్యం, స్థానచలనాలు ఉంటాయి. శని అష్టమరాశి సంచార కాలంలో అపమృత్యు భయం, స్థానచలనాలు, ధననష్టాలు కలుగుతాయి. రాహువు జన్మరాశి యందు సంచార కాలంలో మానసిక ఆందోళనలు, అనారోగ్యం. వ్యయరాశి సంచార కాలంలో ఆపదలు, స్థానచలనం, ధననష్టం కలుగుతాయి. 2020 సెప్టెంబరు 23 నుండి కేతువు షష్ఠరాశి సంచారకాలంలో సంతోషం పొందుతారు.

సామాన్య ఫలితాలు

మిథున రాశి వారికి- గురుబలం సామాన్యం. శని, రాహు-కేతువుల బలం అంతంత మాత్రమే. విద్యార్థులకు సామాన్య విజయాలు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. ఉపాధ్యాయులకు స్థానచలన సూచనలు. పై అధికారుల ఒత్తిడి వల్ల వ్యాపారస్తులకు నష్టం లేకపోయినా లాభాల బాట పట్టలేరు. రైతులకు పంటలు కలసి వస్తాయి. వైద్యులు, న్యాయవాదులు, వృత్తిదారులు, పాడిపరిశ్రమ వారు, పౌల్ట్రీ యజమానులు జాగ్రత్తగా వ్యవహరిస్తే గాని మనుగడ సాగించలేరు. రాజకీయ నాయకులకు సామాన్యం.

ఉపాయాలు

మిథున రాశివారు- గురుదోష నివారణకు గురువార నియమాలు, ఈశ్వరాభిషేకాలు జరిపించాలి. సాయి, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి. శనిదోష నివారణకు శనైశ్చరునికి తైలాభి షేకాలు, ఆంజనేయస్వామి ధ్యాన శ్లోకాలు, శివాష్టోత్తరాలు పారాయణ చేయాలి. రాహు దోష నివారణకు దుర్గా, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలు చేయాలి. శ్రీకాళహస్తిలో కాలసర్ప దోష నివారణ పూజలు, పరిహారాలు జరిపించాలి.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  మృగశిర నక్షత్ర 3, 4 పాదాల జాతకులకు- నక్షత్ర పరంగా, శనైశ్చరుని స్థితి రీత్యా, అష్టమస్థాన స్థితి శనైశ్చరుని రీత్యానూ కొన్ని ప్రతిబంధకాలు ఇంకా తప్పవు. తొలగడానికి ఈశ్వరారాధన ముఖ్యం. 
✶  ఆరుద్ర నక్షత్రం వారు- పని ఒత్తిడి, ఉదర సంబంధమైన అస్థిమితంతో ఇబ్బందిపడతారు. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. రచనా వ్యాసంగాలకు గుర్తింపు లభిస్తుంది. 
✶  పునర్వసు నక్షత్రం జాతకులకు- 2020 మే నుండి 2021 జనవరి వరకు శని సంచారం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ గురుబలంతో అన్నిటినీ అధిగమిస్తారు. కుటుంబంలో మంగళకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అన్నింటా జయం కలుగుతుంది.

అంకెల్లో అదృష్టం

మిథున రాశి వారికి ‘5’ అదృష్ట సంఖ్య. 1, 3, 6, 8 తేదీల సంఖ్యలు- ఆది, గురు, శుక్ర వారాలు కలిస్తే ఈ జాతకులకు యోగప్రదం.

జూలై 2020 : మాస ఫలితం

అకారణంగా ఇతరులతో విరోధాలు, క్రోధం, నరాల నిస్సత్తువ, నోటిపూత, మెడ-తల నరాల నొప్పులు, శరీర ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటం, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *