తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

మేష రాశి
వార్షిక ఫలితాలు

మేష రాశి జన్మనక్షత్రాలు

అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
భరణి  నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
కృత్తిక  నక్షత్రం 1వ పాదం.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ ఏడాదిలో మేషరాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 5; వ్యయం – 5;  గౌరవం – 3; అగౌరవం – 1.

గ్రహ సంచారం

మేష రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 10ట రజతమూర్తిగా (సౌభాగ్యం), జూన్ 29 నుండి 9ట తామ్రమూర్తిగా, నవంబరు 20 నుండి 10ట తామ్రమూర్తిగానూ, అనంతరం ఏప్రిల్ 5, 2021 నుండి 11ట తామ్రమూర్తిగా సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 11ట తామ్రమూర్తిగానే కొనసాగుతాడు. రాహు కేతువులు శ్రీ శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు తృతీయ భాగ్యస్థానంలో సువర్ణమూర్తులుగా, ఆ తర్వాత ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తులుగా సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

గ్రహాల నడకను పరిశీలించగా- మేషరాశి వారికి గురుని భాగ్యరాశి సంచార కాలంలో ధనధాన్య లాభాలు, దశమరాశి సంచార కాలంలో కార్యసిద్ధి, అధికార వృద్ధి, గౌరవాలు లభిస్తాయి. శని రాజ్యస్థాన సంచార కాలంలో ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాహువు తృతీయరాశి సంచార కాలంలో సౌఖ్యం, ద్వితీయరాశి సంచార కాలంలో కలహాలు, కేతువు నవమ రాశి సంచార కాలంలో శుభాలు, అష్టమరాశి సంచార కాలంలో అనారోగ్యం, స్థానచలనాలు, పీడలను కలగజేస్తాయి. 

శుభ ఫలితాలు

గురుబలంతో- మేషరాశి స్త్రీ పురుష జాతకుల్లో వివాహం జరగవలసిన వారు- కళ్యాణ శుభకార్య సిద్ధి, సకల మర్యాదలు పొందుతారు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యాపారస్తులకు ఆశించిన ధనలాభం కలుగుతుంది. ఉపాధ్యాయులు పై అధికారుల మన్ననలు పొందుతారు. రైతులు ఉన్నత ప్రమాణాలు పాటించి అత్యుత్తమ పురస్కారాలు గెలుచుకొంటారు. పాడి పరిశ్రమ వృద్ధి చెందుతుంది. రాజకీయ నాయకులు అఖండ గౌరవ సన్మానాలు అందుకొంటారు. రైతులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి. పౌల్టీ పరిశ్రమల యజమానులు లాభాలను పొందుతారు. వైద్య, న్యాయవాదులు ఆశించిన ఆర్థిక ఫలితాలను అందుకొంటారు. నటులు, గాయకులు, క్రీడాకారులకు ఇది అనుకూల కాలం. 

ఉపాయాలు

మేషరాశి వారు రాహు, కేతువుల దోష నివారణకు దుర్గా, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణలు ఆచరించాలి. శుక్ర, మంగళవారాల్లో సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకాలు చేయించాలి. మినుములు, ఉలవలు దానమిస్తే- దోషం నివారణ అవుతుంది. శని రాజ్యస్థాన సంచార దోషానికి శివాభిషేకం చేయించి, శనివారం నాడు నువ్వులు దానం ఇవ్వాలి. శివపార్వతుల దర్శనం పుణ్యఫలం.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  అశ్విని నక్షత్ర 4 పాదాల జాతకులు- వైద్యపరమైన నూతన ఆవిష్కరణలు చేస్తారు. అధికారవృద్ధి, పదిమందిలో గుర్తింపు, సంస్థాగత వ్యవహారాల్లో పట్టు సాధిస్తారు. వీరికి గురుబలం ఉంది. 
✶  భరణి నక్షత్రం 4 పాదాల వారు- నూతన వస్తు, వాహనాది సౌఖ్యాలను పొందుతారు. విద్యార్థులకు ఉన్నతశ్రేణి ఉత్తీర్ణత.
✶  కృత్తిక నక్షత్రం 1వ పాదం జాతకులు- ప్రారంభంలో విద్యా ఉద్యోగ విషయాల్లో భంగపడినా, గతం కంటే మంచి స్థితిని సాధిస్తారు. శత్రువులు పెరుగుతారు. ఈశ్వర ఆరాధనలు, మన్యుసూక్త సహితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకాలు చేయించడం మంచిది.

అంకెల్లో అదృష్టం

మేషరాశి వారికి ‘9’ అదృష్ట సంఖ్య. 1, 2, 3, 6 తేదీల అంకెలు- ఆది, బుధ, గురు వారాల్లో కలిస్తే మంచిది.

జూలై 2020 : మాస ఫలితం

మేషరాశి జాతకులకు జూలై మాసంలో- శరీర ఆరోగ్యం, నిరంతర సంతోషం, బంధుమిత్రుల కలయిక, పుత్రసౌఖ్యం, ధనలాభం కలుగుతాయి. విధి నిర్వహణలో ఇతరులపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణాలు కలసి రావు.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *