తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

మీన రాశి
వార్షిక ఫలితాలు

మీన రాశి జన్మనక్షత్రాలు

పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం.
ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో మీన రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 8; వ్యయం – 11;  గౌరవం – 1; అగౌరవం – 2.

గ్రహ సంచారం

కుంభ రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 11ట తామ్రమూర్తి (సామాన్యం)గా, జూన్ 29 నుండి 10ట లోహమూర్తి (ధనహాని)గా, నవంబరు 20 నుండి 11ట సువర్ణమూర్తి (సర్వసౌఖ్యాలు)గా, తదుపరి ఏప్రిల్ 5, 2021 నుండి 12ట సువర్ణమూర్తిగానూ సంచరిస్తాడు. శ్రీ శార్వరి సంవత్సరమంతా శని 11ట సువర్ణమూర్తిగా సంచారం కొనసాగిస్తాడు. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23 వరకు చతుర్థ, దశమ స్థానాల్లో లోహమూర్తులుగా, తర్వాత తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

మీన రాశి వారికి- రాజ్యస్థాన సంచార కాలంలో సర్వకార్య విజయం, గౌరవ సన్మానాదులు, పుత్ర సౌఖ్యం. బంధుజన విరోధం మాత్రం అవకాశం లేకపోలేదు. గురుని లాభస్థాన సంచార కాలంలో- సదా సంతోషం. అందరి ఆదరాభిమాన ప్రశంసలు, ధన లాభాలు. శని లాభస్థాన సంచార కాలంలో శరీరారోగ్యం, ధన ధాన్య కీర్తి, లాభాలు. భూములు కొనుగోలు, పుత్ర పుత్రికా విషయమై విశేష సుఖం, మనోనిర్మలత్వం. అభీష్ట సిద్ధి, ఉద్యోగ ఉన్నతి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. భూ గృహాదులను మార్పు చేయడం వల్ల లాభపడతారు. సంస్థలకు ఆధిపత్యం వహించే వారు సంస్థలను ప్రగతిపథంలో నడుపుతారు. రాహువు అర్ధాష్టమ రాశి సంచార కాలంలో- వ్యాధులకు గురవుతారు. వైద్య సహాయం, ఔషధ సేవనం అవసరం. రాహువు తృతీయ రాశి సంచార కాలంలో- సర్వ సౌఖ్యాలు పొందుతారు. రాహు-కేతువుల ప్రభావం మొత్తం మీద ద్వితీయార్థంలో అనుకూలం.

శుభ ఫలితాలు

గురు, శని బలం ఉత్తమం, అనుకూలం. అన్నిరంగాల వారికి శార్వరి సంవత్సరం అభివృద్ధి పథంలో నడుస్తుంది. విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు లభిస్తాయి. రైతులకు రెండు పంటలు కలిసొస్తాయి. వ్యాపారస్తులకు సంవత్సరమంతా లాభాల బాటలో నడుస్తుంది. గాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ప్రతిభా పురస్కారాలు దక్కుతాయి. న్యాయవాద, వైద్య, రక్షణ రంగాల అధికారులు విశేష ప్రతిభను ప్రదర్శించి, గౌరవ లాభాలను పొందుతారు. వ్యవసాయ, పాడి, పౌల్ట్రీ, మత్స్య శాఖల యజమానులు ఇంతకు ముందెన్నడూ లేని ధన సౌఖ్యాన్ని అనుభవిస్తారు. వృత్తిపని వారికి ప్రోతాహకరమైన కాలం. రాజకీయ నాయకులకు ఎదురులేని కాలం. సమాజంలో అఖండ గౌరవం పొందుతారు.

ఉపాయాలు

రాహువు అర్ధాష్టమ, కేతువు దశమ స్థాన సంచార దోష నివారణకు- దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం జాతకులు- విద్యా విషయమై దూరదేశాల్లో నివాసం. విద్యావృద్ధి. 
✶  ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాల వారు- నవంబరు 2020 నాటికి స్థిరనివాసం ఏర్పాటు చేసుకో గలుగుతారు. గృహ యోగం, ఆస్తి వృద్ధి. 
✶  రేవతీ నక్షత్రం వారికి- సంతాన మూలకంగా శుభవార్తా శ్రవణం. వారి వృద్ధి, గౌరవ మర్యాదలు కలుగుతాయి.

అంకెల్లో అదృష్టం

మీన రాశి వారికి ‘3’ అదృష్ట సంఖ్య. 1, 2, 5, 9 తేదీల సంఖ్యలు- ఆది, సోమ, గురువారాలు కలిస్తే మరింత మేలు కలుగుతుంది.

జూలై 2020 : మాస ఫలితం

నరఘోష. శ్రమకు తగిన ఆదాయం లభించదు. కార్యాచరణలో విఫలమవుతారు. ఉద్యోగులు పై అధికారుల ఒత్తిడికి లోనవుతారు. గృహ విషయాల్లో భార్యాభర్తల మధ్య మాట కలవదు. అశాంతి, మానసిక అస్థిమితం.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *