తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

మకర రాశి
వార్షిక ఫలితాలు

మకర రాశి జన్మనక్షత్రాలు

ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు.
శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో మకర రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 11; వ్యయం – 5;  గౌరవం – 2; అగౌరవం – 6.

గ్రహ సంచారం

మకర రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 1ట రజతమూర్తి (సౌభాగ్యం)గా, జూన్ 29 నుండి 12ట తామ్రమూర్తి (సామాన్యం)గా, నవంబరు 20 నుండి 1ట సువర్ణమూర్తిగా, తదుపరి ఏప్రిల్ 5, 2021 నుండి 2ట సువర్ణమూర్తిగానూ సంచరిస్తాడు. శ్రీ శార్వరి సంవత్సరమంతా శని సంచారం 1ట సువర్ణమూర్తిగా సంచరిస్తుంది. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు షష్ఠ, వ్యయ స్థానాల్లో రజతమూర్తులుగా, తర్వాత పంచమ, లాభ స్థానాల్లో సువర్ణమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

మకర రాశి వారికి- జన్మరాశిలో శనైశ్చరుని సంచారం వల్ల విపత్తు సూచనలు ఉన్నా, మూర్తిమంతం చేత అన్నిటినీ అధిగమించగలరు. రాహు-కేతువులు కూడా గోచార స్థితి కారణంగా దోషప్రదాలైనా మూర్తిమంతంచే దోషాలను తొలగించి, శుభ ఫలితాలను కలగజేస్తారు. కనుక దోషం లేదని, మంచి జరుగుతుందని తెలుస్తోంది. గురుని వ్యయరాశి సంచార కాలంలో- శుభమూలక ధనవ్యయం; జన్మరాశి సంచార కాలంలో- ఆకస్మిక స్థాన చలన సూచనలు; పనుల ఒత్తిడి, నోటిపూత, మెడ, తల నరాల నొప్పులు, అనారోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు. తీర్థయాత్ర, పుణ్యకథా శ్రవణాలు చేస్తారు.

శుభ ఫలితాలు

శని జన్మరాశి సంచార కాలంలో- అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఎముకలు విరుగుట, హాని జరగడానికి అవకాశం ఉన్నా- గురు, శనుల విశేష శుభమూర్తిమంతం వల్ల దోష నివారణ అయి మంచి ఫలితాలే కలుగుతాయి. అవివాహితలకు కళ్యాణం జరుగుతుంది. రైతులకు రెండు పంటలు తగు మాత్రంగా కలసి వస్తాయి. వ్యాపారస్తులు సామాన్య లాభాలు పొందుతారు. కళాకారులకు, న్యాయవాదులకు, వైద్యులకు ఆశించిన ప్రోత్సాహాలు లభించవు. పౌల్ట్రీ, మత్స్య శాఖల వారు మధ్య మధ్య ఇబ్బందులు చవి చూడవలసి వస్తుంది. వృత్తిపని వారికి ధనలాభం కలుగుతుంది. రాజకీయ నాయకులకు పరీక్షా కాలం. క్రీడాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

ఉపాయాలు

మకర రాశి వారు- శివాభిషేకాలు చేయించాలి. విఘ్న స్తోత్రాలు పారాయణ చేయాలి. జన్మరాశిలో శని సంచార దోషానికి శనైశ్చరాభిషేకం చేయించడం మంచిది. బంగారు ఆభరణాలు తయారుచేసే వృత్తి పనివారు తగిన జాగ్రత్తతో మెలగవలసిన సమయం. ఏ రంగములోని వారైనా ప్రత్యర్థుల పూర్వాపరాలను తెలుసుకొని, అమిత జాగ్రత్తగా మెలగడం అవసరం.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  ఉత్తారాషాఢ నక్షత్రం జాతకులు- ఉద్యోగ రీత్యా భార్యాబిడ్డలకు దూరంగా నివసించాల్సి వస్తుంది. ఇది తప్పనిసరి స్థితి.
✶  శ్రవణం నక్షత్రం వారికి- ధనలాభం, కార్యసిద్ధి. వైద్య సహాయం లభిస్తుంది. పుత్ర చింత, వంశోద్ధారకుల కోసం తపన కొనసాగుతుంది.
✶  ధనిష్ఠ నక్షత్రం జాతకులు- శార్వరి సంవత్సర ప్రారంభంలో బంధుజన శ్రేయస్సును చూసుకోవలసి వస్తుంది. శార్వరి సంవత్సరాంతంలో పనుల ఒత్తిడి. శుభకార్యాలకు, విందు వినోదాలకు హాజరవుతారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో రాణిస్తారు.

అంకెల్లో అదృష్టం

మకర రాశి వారికి ‘8’ అదృష్ట సంఖ్య. 3, 5, 6, 7, 8 తేదీల సంఖ్యలకు- సోమ, మంగళ, శుక్ర వారాలు కలిస్తే యోగప్రదం.

జూలై 2020 : మాస ఫలితం

ఈ మాసంలో భూములను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కీర్తి వృద్ధి. తేజస్సు, బలం, ఆర్థిక పరిపుష్ఠి కలుగుతాయి. అన్ని వర్గాల వారు సర్వత్రా జయం పొందుతారు. శుభకార్యాలు నిర్వర్తించడం వల్ల ధన వ్యయం.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

2 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *