తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

కర్కాటక రాశి
వార్షిక ఫలితాలు

కర్కాటక రాశి జన్మనక్షత్రాలు

పునర్వసు నక్షత్రం 4వ పాదం.
పుష్యమి  నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
ఆశ్లేష  నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ ఏడాదిలో కర్కాటక రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 11; వ్యయం – 8;  గౌరవం – 5; అగౌరవం – 4.

గ్రహ సంచారం

కర్కాటక రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి సువర్ణమూర్తి (సర్వ సౌఖ్యాలు)గా, జూన్ 29 నుండి 6ట లోహమూర్తి (ధనహాని)గాను, నవంబరు 20 నుండి 7ట తామ్రమూర్తి (సామాన్యం)గానూ, తర్వాత ఏప్రిల్ 5, 2021 నుండి 8ట తామ్రమూర్తి (సామాన్యం)గా సంచరిస్తాడు. శ్రీ శార్వరి నామ సంవత్సర ప్రారంభంలో మంచి ఆరోగ్యం, ఉత్సాహం, తదుపరి క్లేశాల వల్ల ధనహాని, ధన వ్యయం కలుగజేయును. శని సంవత్సరమంతా 7ట తామ్రమూర్తిగా సంచరిస్తాడు. రాహు-కేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు వ్యయ, షష్ఠ స్థానాల్లో లోహమూర్తులుగా, తదుపరి లాభ, పంచమ స్థానాల్లో రజతమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

గ్రహాల ప్రభావం వల్ల- కర్కాటక రాశి జాతకులు ఆరోగ్య విషయాలపై శ్రద్ద వహించరు. వేళ దాటి నిద్రిస్తారు. ఇతర విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకొంటారు. అధిక ప్రసంగాలు చేస్తారు. సమయానికి తగిన ఆలోచన లోపిస్తుంది. దూరాలోచనను కోల్పోతారు. కృషికి తగిన ప్రతిఫలం పొందలేరు. అధిక ధనవ్యయాలను తగ్గించడం మంచిది. ఈ రాశి విద్యార్థులు శారీరక ఒత్తిడిని అనుభవించినా, చక్కటి క్రమశిక్షణ కారణంగా మంచి మార్కులతో ఉన్నతశ్రేణిలో రాణిస్తారు.

శుభ ఫలితాలు

ఉపాధ్యాయులకు ఉత్తరార్థంలో అధికారుల మన్ననలు, గౌరవ మర్యాదల ప్రాప్తి, పూర్వార్థంలో స్థానచలనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు- ఉత్తరార్థంలో లాభాలు; రైతులు- తొలకరి పంట కన్నా దాళవా పంటల్లో మంచి లాభాలు పొందుతారు. వృత్తిపని వారికి సంవత్సర ఉత్తరార్థంలో సుఖసంతోషాలు, కళాకారులకు, గాయకులకు అఖండ గౌరవ సన్మానాలు. సంవత్సర ప్రారంభంలో క్రీడాకారులకు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. వైద్యులు, న్యాయవాదులు, పౌల్ట్రీ యాజమాన్యం, పాడిపరిశ్రమల వారికి సంవత్సర ఉత్తరార్థం లాభదాయకమైనది. మత్స్య పరిశ్రమల వారికి సంవత్సర ఉత్తరార్థంలో మంచి వృత్తి సౌఖ్యం కలిగి, అధిక లాభాలు లభిస్తాయి. ఈ రాశి జాతకులు ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ గురు, రాహు స్థాన దోషాలు తగినంత బలం లేకపోవడంతో ధనలాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.

ఉపాయాలు

గురు దోష నివారణకు శివాభిషేకాలు చేయించి, గురువారం నాడు శనగలు దానమివ్వాలి. దత్తాత్రేయ, శివ, సాయిబాబా స్తోత్ర పారాయణాలు చేయాలి. రాహు దోష నివారణకు దుర్గా స్తోత్ర పారాయణం, సుబ్రహ్మణ్యస్వామి అభిషేకాలు, ప్రదక్షిణలు ఆచరించాలి. శనైశ్చరునికి అభిషేకం చేయించి, నువ్వులు దానమివ్వాలి. మంగళవార నియమాలు పాటించడం మంచిది. మేలు కలుగుతుంది.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  పునర్వసు నక్షత్ర 4వ పాదం జాతకులకు- జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.
✶  పుష్యమి నక్షత్రం వారికి శార్వరి సంవత్సర ఆరంభంలోను,  అక్టోబరు 2020 నుండి యత్నకార్యసిద్ధి, గౌరవం లభిస్తుంది. ఆర్థిక ఋణాలు ఒక కొలిక్కి వచ్చి నిత్యోత్సాహంతో ముందుకు వెళతారు.
✶  ఆశ్లేషా నక్షత్రం వారు నవంబరు 2020 నుండి మంచి ఫలితాలు పొందుతారు. సంతానాది ప్రాప్తి యోగ్యతలకు, తదితర విషయాలకు అడ్డంకులు మాత్రం తొలగుతాయి.

అంకెల్లో అదృష్టం

కర్కాటక రాశి వారికి ‘2’ అదృష్ట సంఖ్య. 4, 6, 8, 9 సంఖ్యలు గల తేదీలకు- ఆది, సోమ, శుక్ర, శనివారాలు కలిస్తే ఈ రాశి జాతకులకు మరింత యోగదాయకం.

జూలై 2020 : మాస ఫలితం

స్థానభ్రంశం, స్థానచలన సూచనలు, ఉపాధి ప్రాంతాన్ని వీడి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. చేసే పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలంకరణ వస్తువులకు ధనవ్యయం చేయాల్సి వస్తుంది.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *