తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

కన్య రాశి
వార్షిక ఫలితాలు

కన్య రాశి జన్మనక్షత్రాలు

ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు.
హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
చిత్త నక్షత్రం 1, 2 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో కన్య రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 2; వ్యయం – 11;  గౌరవం – 4; అగౌరవం – 7.

గ్రహ సంచారం

కన్య రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి రజతమూర్తి (సౌభాగ్యం)గా, జూన్ 29 నుండి 4ట రజతమూర్తి (సౌభాగ్యం)గా, నవంబరు 20 నుండి 5ట రజతమూర్తిగా, తదుపరి ఏప్రిల్ 5 నుండి 6ట రజతమూర్తిగానూ సంచరిస్తాడు. శ్రీ శార్వరి సంవత్సరమంతా శని సంచారం 5ట రజతమూర్తిగా కొనసాగుతుంది. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23 వరకు దశమ, చతుర్థ స్థానాల్లో సువర్ణమూర్తులుగా, తదుపరి భాగ్య, తృతీయ స్థానాల్లో తామ్రమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

ఈ రాశి వారికి గురువు అర్ధాష్టమ స్థాన సంచారకాలంలో ధన వ్యయాన్ని, మాతృవర్గ మూలక క్లేశాలను కలిగిస్తుంది. బంధుమూలక ధననష్టం ఉంటుంది. అర్ధాష్టమ సంచారకాలం దోషమైనప్పటికీ గురుని మూర్తివంతం చేత శుభ ఫలితాలను ఇస్తుంది. గురుని పంచమ రాశి సంచారకాలం సంపదలను, పుత్రమూలక సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది. ముఖవర్చస్సు, దేవతోపాసనతో పదిమందికి ఆదర్శవంతంగా, ఆకర్షణగా నిలుస్తారు. సంపదలను సృష్టిస్తారు. పుత్ర పౌత్ర ప్రవర్థనం, ధన ధాన్య వివర్తనంగా సాగుతుంది.

శుభ ఫలితాలు

కన్య రాశి వారికి శార్వరి సంవత్సరమంతా శనైశ్చరుడు సౌభాగ్యకరంగా ఉంటాడు. శని, రాహు-కేతువులు గోచార రీత్యా దుస్థానాల్లో సంచరిస్తున్నా మూర్తిమంతంచే అత్యుత్తమ ఫలితాలు ఇస్తారు. వాగ్వివాదాలు సమసి కార్యజయం కలుగుతుంది. సంతానం ఇతర దేశాల్లో రాణించడం, వారి ఉత్తీర్ణతకు సంబంధించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. విద్యార్థులు ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉపాధ్యాయులకు శార్వరి సంవత్సర పూర్వార్థంలో స్థాన చలనాలు, అధికారుల ఆగ్రహానికి గురి కావడం ఉన్నా, ఉత్తరార్థంలో గౌరవాలు పొందుతారు.
రైతులకు రెండో పంట అనుకూలం. వ్యాపారస్తులు నవంబరు 2020 నుండి అధిక లాభాలు పొందుతారు. నటులకు, గాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు, న్యాయవాదులకు, వైద్యులకు, పౌల్ట్రీ-మత్స్య-పాడి శాఖలకు, వృత్తిపరులకు సంవత్సర ఉత్తరార్థం అనుకూలం. ఆయా రంగాల్లోని వారికి గౌరవం గుర్తింపు కలుగుతుంది. ఏ రంగంలోని వారికైనా సంవత్సర పూర్వార్థం కంటే ఉత్తరార్థమే అనుకూలం.

ఉపాయాలు

గత ఏడాది మాదిరిగా శార్వరి సంవత్సర పూర్వార్థంలో ఆపదలు ఎదుర్కోవలసి వస్తుంది. శ్రీకృష్ణాష్టోత్తరం, శివార్చనాభిషేకాదులు చేయడం మంచిది. పార్వతీ పరమేశ్వరుల దర్శనం, అన్నపూర్ణా స్తోత్ర పారాయణం చేస్తే దోషం నివారణ అవుతుంది.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  ఉత్తర నక్షత్రం జాతకులకు- గృహంలో మంగళప్రదమైన వాతావరణం, శుభకార్యాలు కలసి వస్తాయి. ఉద్యోగ ఉన్నతులు కలుగుతాయి. రత్నాభరణాలు, భూమి కొనుగోలు చేస్తారు.
✶  హస్తా నక్షత్రం వారికి ఉన్నత ఉద్యోగం, తలచిన కార్యాలు నెరవేరడం, సంతానమూలక సౌఖ్యాలు కలుగుతాయి.
✶  చిత్తా నక్షత్రం జాతకులకు- సంవత్సర ఉత్తరార్థంలో నూతన ప్రణాళికలు అమలుపరచడం, ఆర్థిక వికాసం కలుగుతుంది.

అంకెల్లో అదృష్టం

కన్య రాశి వారికి ‘5’ అదృష్ట సంఖ్య.1, 3, 6, 8 తేదీల సంఖ్యలు- ఆది, బుధ, గురు, శనివారాలతో కలిస్తే మరింత యోగప్రదం.

జూలై 2020 : మాస ఫలితం

కన్య రాశి వారికి- జూలై మాసమంతా అనుకూలం. తలచిన పనులు సత్వరమే నెరవేరతాయి. ధనలాభం, సంపద పెరగడం, వస్తు వాహన సౌఖ్యం కలుతుంది. ఏ పనినైనా ఏకాగ్రతతో ధైర్యంగా చేయగలరు. అధికారుల అండదండలు లభిస్తాయి. చేపట్టే కార్యం విజయాన్ని సాధిస్తుంది.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *