గురుపౌర్ణమి

జూలై 5, 2020
ఆషాఢ మాస పౌర్ణమి తిథి

విద్యాధనం బలం చైవ
తేషాం భాగ్యం నిరర్థకమ్
యేషాం గురుకృపా
నాస్తి అధోగచ్ఛన్తి పార్వతి ||
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ
దేవాశ్చ పితృకిన్నరాః
సిద్ధా చారణ యక్షాశ్చ
అన్యే చ మునయోః జనాః ||

శివుడు ఒకప్పుడు- ‘పార్వతీ! గురుకృప లేనివారికి చదువు, ధనం, శక్తి, భాగ్యం నిరర్థకాలు అవుతున్నాయి. వారు అధోలోకాలను పొందుతున్నారు. గురుకృప తప్పినవారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో బాటు దేవతలు, పితృదేవతలు, కిన్నరులు, సిద్ధులు, చారణులు, యక్షులు మహర్షులు కూడా దూరమవుతున్నారు’ అని చెప్పాడు. 
గురు కృప మహిమ అంతటిది. కనుకనే ఆషాఢ పూర్ణిమ తిథి- గురువును అర్చించడానికి ఉద్దేశించబడింది.

వ్యాస (జయంతి) పూర్ణిమ

వేదాలను, పంచమ వేదమైన మహాభారతాన్ని, పురాణాలను మనకు అందించి ఆర్ష వాఙ్మయానికి మూలపురుషుడైన వ్యాసమహర్షి జన్మించిన ‘ఆషాఢ పౌర్ణమి’ వ్యాస పూర్ణిమగా చెప్పబడింది. వ్యాసుడు జగద్గురువు కనుకనే ఆయన జయంతిని ‘గురు పూర్ణిమ’గా జరుపుకొంటున్నాం. ‘గురు పౌర్ణమి’ నాడు వ్యాస భగవానుని స్మరించడం, పూజించడం మనందరి విధి. ఈ రోజు వేదవ్యాసుల వారి జన్మదినం.

మన కర్తవ్యం

అపర నారాయణుడైన వేదవ్యాసుని వల్లనే మన భారతీయ సంస్కృతి పరిపుష్ఠమైంది. వేదాలను విభజించి, అష్టాదశ మహాపురాణోప పురాణాలను ఏర్పరచి, మహాభారతేతిహాసాన్ని రచించి, మహాభాగవతాన్ని ప్రసాదించి, బ్రహ్మసూత్రాలను నిర్మించి, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్ఠం చేసిన వ్యాసుడిని ఈ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆయనను విస్మరించడం కృతఘ్నతా దోషం. జ్ఞానమార్గ దర్శకుడైన గురువు స్థానం పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు ఆశ్రయం పొందడం దుర్లభం. గురు శుశ్రూషకు, విద్యార్జనలో శ్రమదమాలకు వెరచినవాడిని విజ్ఞానం వరించదు.

గురు శుశ్రూష

మన ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, గురువును దైవంగానూ, ఒక్కోసారి దైవం కన్నా మిన్నగానూ పరిగణించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘గురు శిష్య’ సంప్రదాయం అతి విశిష్టమైనది. పూర్వం ఉపనయనం తర్వాత తల్లిదండ్రులను వీడి, గురువు వద్దనే ఉండి గురు శుశ్రూష చేస్తూ గురుకులంలో విద్యను నేర్చుకొనేవారు. విద్య అంటే ఆధ్యాత్మిక విద్యే. ఇప్పటి చదువుల్లా కాదు. ఇతరమైనవి అపర విద్యలు. అట్టి ఆధ్యాత్మిక విద్య శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన ఉత్తమ సద్గురువు ద్వారానే లభ్యమవుతుంది.
తద్విజ్ఞానార్థం స గురుమే వాభిగచ్చేత్ |
సమిత్ పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం ||

ఆచార్య దేవోభవ

ఆత్మతత్త్వ జిజ్ఞాస గల విద్యార్థి వైరాగ్య చిహ్నమైన, యజ్ఞ చిహ్నమైన సమిధలను చేతిలో ఉంచుకొని సకల శాస్త్ర జ్ఞానంతో పాటు ఆత్మానుభవం కలిగిన, చక్కగా బోధించే నేర్పుగల గురువు పట్ల గౌరవాన్ని చూపుతూ వినయ విధేయతలతో ఆశ్రయించాలని నొక్కి చెబుతుంది ముండకోపనిషత్తు. అందుకే- ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ’ అని నమస్కరిస్తాం. 
‘గు’ అంటే చీకటి – ‘రు’ అంటే ప్రకాశం. చీకటిని తొలగించి ప్రకాశింపజేసేవాడు గురువు. ఆధ్యాత్మిక విద్యను బోధించి జ్ఞాన ప్రకాశవంతునిగా శిష్యుణ్ణి తీర్చి దిద్దడమే ఆనాటి గురువుల లక్ష్యం. ఆ గురువు అనుగ్రహంతో విద్యను పూర్తి చేసుకొని, ధర్మబద్ధంగా జీవనయాత్రను సాగించేవారు శిష్యులు. అటువంటి గురువర్యులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకొని, వారి దివ్యాశీస్సులను పదే పదే పొందడానికి అవకాశం కల్పిస్తుంది గురుపూర్ణిమ.

గురు వందనం

‘గురుపౌర్ణమి’ నాడు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో-
అజ్ఞాన తిమిరాన్ధస్య
జ్ఞానాంజన శలాకయా |
చక్షురున్మీలితం యేన
తస్మై శ్రీగురవే నమః ||
-అని గురుదేవులకు నమస్కరిస్తూ పండగ జరుపుకోవడం శిష్యులకు అనూచానంగా వస్తోన్న సదాచారం అందరికీ ఆచరణీయమైనదీను. మరింతగా సాధకులను సాధనోన్ముఖులను చేసే సాధనం గురుపౌర్ణమి.
గురోః ప్రసాదాదన్యత్ర
నాస్తి సుఖం మహీతలే |
గురువు అనుగ్రహాన్ని గురు పౌర్ణమి నాడు పొంది తీరాలి. 

గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః | 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా
తస్మై శ్రీ గురవే నమః | 
ప్రసిద్ధమైన ఈ శ్లోకం ‘శుకోపనిషత్’ లోనిది.

– భాగవతుల సుబ్రహ్మణ్యం

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *