జూలై 1 నుండి నవంబరు 25 వరకు

ఇప్పుడు నడుస్తున్నది ‘చాతుర్మాస’ కాలం. జూలై 1న (ఆషాఢ మాస శుక్ల ఏకాదశి) మొదలైంది. నవంబరు 25 వరకు (కార్తిక మాస శుక్ల ఏకాదశి) కొనసాగుతుంది. ఈ నాలుగు నెలల కాలాన్ని ‘చాతుర్మాసం’ అంటారు. ‘శయన ఏకాదశి’ (జూలై 1) మొదలు భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఒక స్వరూపం పాతాళంలోని బలిచక్రవర్తి దగ్గర, మరో రూపం క్షీరసాగరం మీది ఆదిశేషునిపై శయనిస్తుంది. ఈ స్థితి కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఉంటుంది.

నిషిద్ధ కాలం

ఈ నాలుగు నెలల కాలంలో యజ్ఞం, మొదలైన అనుష్టానాలు; ఉపనయన, వివాహాది శుభకార్యాలు నిషిద్ధం. తీర్థయాత్రలు చేసే సాధువులు, సన్యాసులు కూడా చాతుర్మాస సమయంలో ఒకే చోట నివసిస్తారు.

నిత్య నామ స్మరణ

చాతుర్మాస్య వ్రత ప్రాశస్త్యం గురించి శాస్త్రాల్లో విశేషంగా చెప్పారు. ఈ నాలుగు మాసాల్లో చేసే స్నాన, దాన, స్వాధ్యాయ, జప, హోమ, దేవపూజలు అక్షయ ఫలదాయకాలు. నిత్యం స్నానం చేసి, నియమపూర్వకంగా దేవతార్చన, నామ స్మరణ చేయడమే ఈ వ్రత విధానం.

వ్రత స్వీకరణ

సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు స్వామిని శయనింప చేయాలి. మళ్లీ తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు నిద్ర నుండి లేపాలి. ఏకాదశి నాడు ఉపవాసం చేసి వ్రత నియమాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత శంఖ-చక్ర-గద-పీతాంబరాలు గల శ్రీమహావిష్ణువు ప్రతిమను స్థాపించాలి. ప్రతిమకు పంచామృత స్నానం చేయించి, చందనాది సుగంధ ద్రవ్యాదుల లేపనం, పుష్పాదులతో అలంకరించి పూజించాలి. ప్రతి దినం స్వామిని అర్చించి, ‘ఓం నమో నారాయణాయ నమః’ మంత్రం జపించి, పురాణ పఠనం సాగించాలి.

నెయ్యి – నూనె దూరం!

ఈ నాలుగు నెలలూ- బెల్లాన్ని వాడకపోవడం వల్ల మనుష్యునికి మాధుర్యం లభిస్తుంది. నూనె మానివేయడం సంతానానికి దీర్ఘాయువు. సుగంధ తైల వాడకం నిలుపు చేయడం అపార సౌభాగ్యప్రాప్తి. తాంబూలం త్యజించటంతో భోగసామాగ్రి సమృద్ధిగా లభిస్తుంది. కంఠం మధురస్వర యుక్తం అవుతుంది. నెయ్యి మానేయడం వల్ల శరీరానికి లావణ్యం.

‘పలాశ పత్ర’ ప్రభావం

చాతుర్మాస వ్రతంలో- పలాశ (మోదుగ) పత్రంలో భోజనం చేయడానికి విశేష ప్రాధాన్యత ఉంది. మోదుగ ఆకులో ఒకసారి భుజిస్తే, త్రిరాత్రి వ్రతఫలం వంటి పుణ్యం లభించి, ఘోరపాపాల నుంచి విముక్తులవుతారు. ‘పలాశ’ బ్రహ్మదేవుని వృక్షం. ఏకాదశి వ్రతంతో లభించే పుణ్యం- పలాశపత్ర భోజనం ద్వారా ప్రాప్తిస్తుంది. దీనివల్ల సాధకుడు అన్నివిధాలైన దానాలు, తీర్థయాత్రల ఫలాన్ని పొందుతాడు. పలాశపత్రంలో భోజనం చాంద్రాయణంతో సమానం. 
చాతుర్మాసంలో ఒక్క పూట భోజనం వల్ల రాజసూయ యజ్ఞఫలభాగం పొందుతారు. మౌనంగా భుజించడం వల్ల స్వర్గలోకప్రాప్తి. పురాణ కథనం ప్రకారం- భోజనం చేసేటప్పుడు మాట్లాడటం అపవిత్రం.

మనోభీష్ట సిద్ధి

చాతుర్మాస కాలం ధార్మిక కర్మలకు పవిత్రమైంది. ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, తపస్వులు, సన్యాసులు – ఈ నాలుగు నెలలూ ఒకే చోట నివసించి ధార్మిక పూజాదులు, ధ్యానంతో దినచర్య సాగిస్తారు. సామాన్యులు కూడా ఈ సమయంలో కొన్ని నియమ నిష్ఠలు పాటిస్తే, మనోవాంఛలు నెరవేరతాయని శాస్త్ర వచనం. అవేమిటో తెలుసుకొందాం.

ఆర్థిక స్థిరత్వం

జీవితంలో ఆర్థిక సుస్థిరత కోసం ప్రయత్నించేవారు- శ్రీ మహావిష్ణువు ప్రీతికై చాతుర్మాసంలో కాయగూరలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.

ధన – సౌందర్య ప్రాప్తి

చాతుర్మాసంలో రోజూ నక్షత్ర దర్శనం చేశాకే భోజనం చేయడం వల్ల ధనప్రాప్తి, సౌందర్య వృద్ధి.

పాపక్షయం – పుణ్యప్రదం

చాతుర్మాసంలో ఆరు రోజులకు ఒకసారి భోజనం చేసే వారికి రాజసూయ, అశ్వమేధ యాగాలు చేసినంత ఫలం లభిస్తుంది. మూడు రోజులకు ఒకసారి భుజిస్తే మోక్షప్రాప్తి. చాతుర్మాస నియమాలు పాటిస్తూ, రోజుకు ఒక్కసారే భోజనం చేసేవారు అగ్నిష్టోమ యజ్ఞఫలం పొందుతారు.

బంధుప్రేమ

చాతుర్మాసంలో అయాచితంగా (యాచించకుండా) లభించే భోజనం మాత్రమే చేయడం వల్ల ఆ వ్యక్తి కుటుంబంలో పరస్పర సౌహార్థం, బంధు ప్రేమ వృద్ధి చెందుతుంది.

కోరిక ఫలవంతం

చాతుర్మాస దినాల్లో- ఉప్పు లేదా ఉప్పుతో వండిన పదార్థాలను పరిత్యజించి, ఆహారం తీసుకొనే వ్యక్తి అభీష్టం నెరవేరుతుంది.

ఆరోగ్య ప్రాప్తి

చాతుర్మాసంలో రోజూ విష్ణుసూక్త మంత్రాలను స్వాహాకారంతో ఉచ్చరిస్తూ నువ్వులు, బియ్యంతో హోమం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది.

విద్యాప్రాప్తి

బుద్ధి కుశలత వృద్ధికి, విద్యలో సాఫల్యతకు- చాతుర్మాస్యంలో రోజూ మహావిష్ణువు లేదా శ్రీ వేంకటేశ్వరస్వామి పటం ముందు నిల్చొని, గట్టిగా పురుష సూక్తం చదవాలి. విష్ణు సన్నిధిలో వేదాలను స్వాధ్యాయం చేయడం వల్ల పాండిత్య వృద్ధి.

శీఘ్ర వివాహం

చాతుర్మాసంలో రోజూ విష్ణు ధ్యానం చేస్తూ, ఉసిరిక చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం వల్ల శీఘ్ర వివాహ ప్రాప్తి.

దాంపత్యంలో ప్రేమ

చాతుర్మాసంలో రోజూ తీపి పదార్థాలతో బ్రాహ్మణులకు భోజనం సమర్పించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో ఏకాగ్రత కుదురుతుంది.

కళా సాఫల్యత

ఏదైనా కళలో నైపుణ్యం సాధించాలనే కోరిక గలవారు- చాతుర్మాసంలో రోజూ రాత్రివేళ విష్ణు సన్నిధిలో నృత్య, గాన కార్యక్రమాలు నిర్వర్తించాలి.

రుణ విముక్తి

చాతుర్మాసంలో రోజూ పేదవారికి దానం చేయడం, ఏదైనా ధార్మిక కార్యక్రమాలకై కొంత ధనం పక్కన పెట్టడం పాటించాలి. అప్పుల సమస్య పరిష్కారానికి లక్ష్మీనారాయణుల సమక్షంలో కింది మంత్రాన్ని మూడుసార్లు మాలాజపం చేయాలి. 
మంత్రం : ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః ||

నియమాలు

1. చాతుర్మాసంలో రోజూ సూర్యోదయానికి ముందే స్నానాదులు పూర్తి చేయాలి. శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఆ తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజన దానం చేయాలి.
2. చాతుర్మాసంలో ఏ వస్తువులను మీరు వదిలి పెడతారో, వాటిని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. అలా చేయకపోవడం వల్ల ఆ వస్తువులను త్యజించిన ఫలితం లభించదు (ఉప్పు, తీపి, నూనె వంటివి).
3. ఈ నాలుగు నెలలూ సాధ్యమైనంత వరకు సత్యం, బ్రహ్మచర్యం పాటించాలి. భగవద్దర్శనం, దానం, మౌనం, స్వల్ప సంభాషణ, క్రోధరహితంగా ఉండటం, మొదలైనవి ఆచరించాలి.
4. చాతుర్మాసం పూర్తయ్యే రోజున (నవంబరు 25) విధ్యుక్తంగా విష్ణువును పూజించాలి. బ్రాహ్మణులకు ధాన్యం దానమివ్వాలి. కన్యకు, బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి.

సమర్పణ :
దైవమ్ డిజిటల్, జూలై 2020.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *