ఆషాఢ మాసంలో సూర్యభగవానుడు ‘అరుణుడు’ (వరుణుడు) పేరుతో పయనిస్తాడు. అప్పుడు మహర్షి వసిష్ఠుడు, యక్షుడు ‘సహజన్యుడు’, అప్సరస ‘రంభ’, గంధర్యుడు ‘హుహూ’, సర్పం ‘శుక్రుడు’, రాక్షసుడైన ‘చిత్రస్వనుడు’- వరుణాదిత్యునితో ఉంటారు. భగవానుడు రథంపై ఆసీనుడై, కిరణకాంతులతో తేజరిల్లుతాడు. కాలస్వరూపుడు, అత్యంత ప్రతాపశాలి, కామరూపుడైన అరుణ (వరుణ) దేవుని నేను ఉపాసిస్తాను.
ఈ అరుణ (వరుణ) ఆదిత్యుడు ఐదువేల కిరణాలతో ప్రకాశిస్తూ, శ్యామ వర్ణంతో విలసిల్లుతాడు.

ద్రౌపద్యాదిత్యుని కథ

ఒకానొక సమయాన దురాశాపరుడైన దుర్యోధనుడు మోసం చేసి, పాండవుల సమస్త సంపదలను హరించాడు. మహా బలశాలురైన పాండవులు ద్రౌపదితో కూడి వివిధ వనాల్లో తిరుగసాగారు. తన పతులకు వచ్చిన, దారుణమైన ఈ కష్టాలకు ద్రౌపది ఎంతగానో బాధపడింది. ఆకలిదప్పుల బాధల నుండి విముక్తులవడానికి ఆమె కాశీలో మనోయోగ పూర్వకంగా సూర్యభగవానుని ఆరాధించింది.

ద్రౌపది సేవలకు ప్రసన్నుడైన అంశుమాలి ప్రత్యక్షమై, ‘నీకు ఇష్టమైన వరాలను కోరుకో’ అని ఆమెతో పలికాడు.
అంతట ద్రౌపది, ‘స్వామీ! మీరు నాపట్ల ప్రసన్నులైతే ఈ ఆపద సమయాన మాకు భోజన సమస్య లేకుండా చెయ్యండి’ అని ఆయనను అర్థించింది.
 
అప్పుడు సూర్యుడు ఆమెకు మూతతో సహా ఒక పాత్రను ప్రసాదించి, ఇలా చెప్పాడు- ‘పూజ్యురాలా! నీవు భోజనం చేయనంత వరకూ ఎంతమంది భోజనం కోసం వచ్చినా, ఈ అక్షయపాత్ర పుష్కలంగా భోజన పదార్థాలను సమకూర్చి, వారందరినీ సంతృప్తి పరుస్తుంది. నీవు భుజించిన తరవాత ఈ పాత్ర ఖాళీ అవుతుంది. నీ సేవలకు మెచ్చి నేను మరొక వరాన్ని ఇస్తున్నాను. కాశీ విశ్వనాథునికి దక్షిణ భాగాన స్థితుడనై ‘ద్రౌపద్యాదిత్యుడు’ పేరుతో ప్రసిద్ధి చెందుతాను. నన్ను దర్శించే వారికి ఆకలిబాధలు ఉండవు. వారికి జీవితాంతం వరకూ ఎప్పటికీ భోజన సమస్య ఉండదు’.

సూర్యభగవానుని నుండి ద్రౌపదికి అక్షయపాత్ర లభించిన విషయం దుర్యోధనునికి తెలిసింది. పాండవులకు కష్టాలను కలిగించడానికై అతడు  కొత్త ఉపాయం ఆలోచించాడు. ఒకనాడు తన దగ్గరకు వచ్చిన దుర్వాస మహర్షికి దుర్యోధనుడు భక్తిపూర్వకంగా ఉపచారాలు చేశాడు. అంతట ఆ మహర్షి ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. 
అప్పుడు దుర్యోధనుడు ఇలా పలికాడు- ‘మీకు నాపై అనుగ్రహం ఉంటే మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని నాకు కలిగించినట్లే పాండవులకూ ప్రసాదించండి. అయితే ద్రౌపది తన భోజనాన్ని ముగించిన తరవాతే మీరు అక్కడకు అతిథిగా వెళ్లాలి’. 
దుర్వాసుడు ‘ఏవమస్తు’ అని, దుర్యోధనుని ప్రార్థనను మన్నించాడు.

ఒకనాడు దుర్వాసుడు పాండవుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు- ‘నేను ఇప్పుడు నదికి వెళ్లి స్నానం చేసి వస్తాను. నా వెంట ఉన్న పదివేలమంది శిష్యులతో పాటు మీ ఇంట భోజనం చేస్తాను’. 
పాండవులు, ద్రౌపది సంకట స్థితిలో పడ్డారు. కారణం- అప్పటికే ద్రౌపది తన భోజనాన్ని ముగించింది. ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి ద్రౌపది సూర్యరూపాన ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించింది. 

శ్రీకృష్ణుడు సమయానికి వచ్చి పాత్రలో మిగిలివున్న ఒక కణాన్ని భుజించాడు. అప్పుడు మూడు లోకాలూ తృప్తి చెందాయి. దుర్వాసుని కోపానికి గురి కాకుండా ఆ శ్రీకృష్ణభగవానుడు పాండవులను ఆదుకొన్నాడు.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *