సంవత్సర ప్రారంభానికి ‘తొలి ఏకాదశి’!

పూర్వకాలంలో ఒక్కో ఋతువులో నాలుగు నెలలు ఉండేవి. సంవత్సర మొత్తానికి వర్ష, హేమంత, వసంత ఋతువులే నడిచేవి. ఆ కాలాన్ని అనుసరించి- వర్ష ఋతువు నుండి సంవత్సర ప్రారంభాన్ని పరిగణించడం వల్ల ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి తిథి ‘తొలి ఏకాదశి’గా పేరొందింది. ఇది ‘తొలి ఏకాదశి’ అనడానికి మరో కారణం కూడా ఉంది- ఈ తిథి నాడు ‘చాతుర్మాస్య వ్రతం’ ఆరంభం కావడమే. దీనికే ‘శయన ఏకాదశి’ అని కూడా పేరు. ఈరోజున శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి (పాలసముద్రం) మీద శయనిస్తాడు. అందుకే ఇది ‘శయన ఏకాదశి’గానూ ప్రసిద్ది చెందింది. ఈనాడు విధిగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

చరాచరాత్మక నిర్మాత భగవానుడు సృష్టి కార్యాన్ని నిర్వర్తించి ఈ నాలుగు నెలలు క్షీరసాగరుడు అవుతాడట ! అందుచేతనే రోగ బాధలు కూడ విజృంభిస్తాయి. భగవానుడు శయనించడం ఎప్పుడు మొదలైందో ఆయన నిద్ర లేవడం కూడా మరొకప్పుడు ఉంటుంది. అదే కార్తికమాస శుద్ధ పక్షంలో వచ్చే ఏకాదశి. దీని పేరు ‘ఉత్థాన ఏకాదశి’.

జాజిపూల పూజ

అన్ని ఏకాదశుల్లోకి విష్ణువుకు బాగా ప్రియమైనది ‘తొలి ఏకాదశి’. విష్ణు సంబంధంగా ఈ పర్వానికి రెండు పౌరాణిక గాథలున్నాయి. ఒకటి- ‘ఈరోజు మొదలు విష్ణుమూర్తి నాలుగు నెలలు పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి, కార్తిక శుద్ధ ఏకాదశికి వెనక్కి తిరిగి వస్తాడని’ చెబుతారు. రెండో కథ- ‘తొలి ఏకాదశి’ రోజు మొదలు విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై పడుకొని, కార్తిక శుద్ధ ఏకాదశికి మేలుకొంటాడని పురాణాలు వివరిస్తున్నాయి.

ఈ రెండో గాథను పురస్కరించుకొని- ఈ పండుగకు ‘దేవశయని’ అనే పేరునూ పురాణాలు పేర్కొంటున్నాయి. గదాధర పద్ధతి దీనిని ‘హరిశయనం’ అంటోంది. ఈ సందర్భంలోనే దీనికి ‘శయన ఏకాదశి’ అనే పేరు వచ్చింది.

విష్ణ్వాలయాల్లో ‘తొలి ఏకాదశి’ నాటి రాత్రి విష్ణు శయన వ్రతాలు చేస్తారు. విష్ణు విగ్రహాన్ని ఆభరణాదులతో అలంకరించి, జాజిపూలతో పూజిస్తారు. పవళింపు సేవ చేస్తారు. కీర్తనలు పాడతారు. చంద్రభాగా నదీతీరాన  ఉన్న పండరీపురంలో ఈరోజున చూడదగిన గొప్ప ఉత్సవం జరుగుతుంది.

‘పేలాపుపిండి’

ఆంధ్రప్రదేశ్ గుంటూరు మండలంలోని కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని ‘పేలాపుపిండి’ పండుగ అంటారట. పేలాలు విసిరి పిండిచేసి, బెల్లంలో కలుపుకొని తింటారనీ, ఆ పేలాలపిండిని మీద చల్లుకోవడం కూడా ఆచారమై ఉందనీ చెబుతారు.

ఆటవిడుపు రోజులు

ఉభయ గోదావరి మండలాల్లోని మాగాణి గ్రామాల్లో రైతులు ఈనాడు కొత్త పాలేళ్లను కుదుర్చుకొంటారు. అక్కడి పాలేళ్లకు తొలి ఏకాదశి, దానికి ముందు దినాలు ఆటవిడుపు రోజులు. తొలి ఏకాదశి నాడు కాని, దాని తరవాత నుంచి రోజున గాని కొత్త పాలేళ్లకు నూతన దుస్తులు ఇచ్చి, పిండివంటలతో భోజనం పెడతారు.

ఏరు, ఏకాదశి – ఏది ముందు?

‘ఏరు ముందా, ఏకాదశి ముందా!’ అని నెల్లూరు జిల్లాలో ఒకసామెత ఉంది. ఆ సామెత తొలి ఏకాదశికి సంబంధించిందని చెబుతూ ఒంగోలు వెంకటరంగయ్య ఇలా రాశారు- ‘ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఉద్దేశించి పుట్టిన సామెత అది. ఆషాఢం నుంచి మేఘాలు ఉదయిస్తుండటంతో ఏరువాక పనులు ప్రారంభించేవారు ఏటినీళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. సామాన్యంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాటికి- పెన్నానదికి కొత్తనీళ్లు వస్తాయి. అందుచేత ఏరు, ఏకాదశి పోటీ పడుతూ ‘నేను ముందా! నీవు ముందా!’ అని తోసుకొని వస్తాయనే అలంకారోక్తితో ఈ సామెత ఏర్పడింది. ఇప్పటికీ సాధారణంగా ఈ ఏకాదశికి కొంచెం వెనకా ముందుగా నదీ ప్రవాహం వస్తుంది.

– ఆండ్ర శేషగిరిరావు
– భాగవతుల సుబ్రహ్మణ్యం

సమర్పణ : దైవమ్ డిజిటల్

2 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *