ఆదివారం నాడు సూర్య గ్రహణం, సోమవారం రోజున చంద్ర గ్రహణం సంభవిస్తే ‘చూడమణి యోగం’ అంటారు. ఆ సమయంలో చేసిన దానం అనంత ఫలప్రదం. గ్రహణస్పర్శ కాలంలో స్నానం, మధ్య సమయంలో హెూమం, దేవతార్చన; గ్రహణ మోక్ష సమయంలో శ్రాద్ధం, అన్నం, వస్త్ర, ధనాది దానాలు; సంపూర్ణ మోక్షం తరవాత స్నానం- ఇదీ క్రమం.

తీర్థస్నానాల ప్రాముఖ్యత

స్నానజలాల్లో తారతమ్యం ఇలా ఉంటుంది- వేడినీటి కంటే చన్నీళ్ల స్నానం శ్రేష్ఠం. ఇతర జలాల కన్నా ఇంటి బావినీరు, భూమిగత జలం శ్రేష్ఠం. అంతకంటే జలపాతాల నీళ్లు, దానికంటే చెరువు నీరు పవిత్రం. చెరువు కన్నా నదీజలం, సాధారణ నదుల కంటే తీర్థనదుల జలం, అంతకంటే గంగాజల స్నానం పవిత్రం. సముద్ర స్నానం సర్వోత్తమం. గ్రహణ సమయంలో ధరించిన వస్త్రాలను ఉతికి శుభ్రం చేసుకోవాలి.

సుపాత్ర దానం

అర్హత గల వ్యక్తికి (సుపాత్రునికి) దానం చేయడం వల్ల అధిక పుణ్యం లభిస్తుంది. తపస్సు, విద్య రెండూ ఉన్నవాడు పాత్రుడు. ఇంతకంటే బ్రాహ్మణునికి ఇచ్చే దానఫలం రెండు రెట్లు అధికం. వేదపండితునికి దానమిస్తే లక్షరెట్లు అధిక ఫలం. సత్పాత్రునికి చేసే దానం అనంత ఫలప్రదం.

గ్రహణ వేళ శ్రాద్ధాదులు

1. గ్రహణ సమయంలో- స్నానం, దానం, జపం, దేవతార్చన, పితృదేవతల శ్రాద్ధం తప్పక చేయాలి.
2. గ్రహణ కాలంలో ఇచ్చే దానం భూదానంతో సమాన ఫలం కలిగిస్తుంది. 
3. ద్విజులందరూ బ్రాహ్మణులతో సమానం. ఏ జలమైనా గంగాజలంతో సమానంగా పవిత్రత కలిగిస్తుంది. 
4. గ్రహణ సూతకంలో పితరులకు శ్రాద్ధం లభించాలి. వీలైతే వండిన అన్నంతో శ్రాద్ధం చేయాలి. బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే అపక్వాన్నం (పిండి, ధాన్యం, పప్పు, నెయ్యి), పండ్లు, వస్త్ర, ధనాదులు, బంగారం మొదలైన వాటితో శ్రాద్ధకార్యం నిర్వర్తించాలి. సంపన్నులు తులాదానం కూడా చేయవచ్చు.
5. సాధారణంగా వండిన పదార్థాన్ని గ్రహణ సమయంలో త్యజించాలి. సూతకంలో, మృత్యుకాలంలో, సూర్య-చంద్ర గ్రహణ వేళలో భోజనం చేసే వ్యక్తికి మరుజన్మలో నర జన్మ లభించదు.

కొన్ని ఉపాయాలు

1. గ్రహణ కాల స్పర్శ ప్రారంభం కాగానే స్నానం చేయాలి.
2. గ్రహణం పూర్తిగా గ్రహితమైనప్పుడు హోమం చేయాలి.
3. మోక్షకాలం ప్రారంభం కాగానే దానం; పూర్తిగా మోక్షమయ్యాక మళ్లీ స్నానం చేయాలి. ఈ అంశం గురించి గర్గ మహర్షి ఇలా వివరించారు- గ్రహణ కాలంలో స్నానం కోసం ఉపయోగించే జలం భూగతమైనది తీసుకోవాలి. వాగులు లేదా చెరువు, నదీజలం, తీర్థనదీ జలం, గంగ, యమున, కృష్ణ, గోదావరీ నదుల జలాలు లేదా సముద్ర సంగమ జలం విశిష్టమైంది. 
4. సాగర సంగమంలో స్నానం వల్ల పది జన్మల పాపం నశిస్తుందని మత్స్య పురాణం వివరిస్తుంది. గ్రహణ వేళలో  సముద్రస్నానం చేయడం వల్ల వేలాది జన్మల నుండి సంచితమైన పాపం తొలగిపోతుంది. 
5. గ్రహణ కాలంలో ఓషధీ స్నానానికి- గరిక, శిలాజిత్, సర్వోషధి, దారు, లోధ్ర మొదలైన ఓషధులను నీటిలో వేసి ఆ నీటిలో స్నానం చేయటం వల్ల గ్రహజనిత అనిష్టాలు నశిస్తాయి. 
6. సూర్యగ్రహణ సమయంలో- రాగిపాత్రలో పెరుగు, నెయ్యి, తేనె నింపాలి. బంగారంతో చేసిన సూర్యబింబాన్ని ఆ పాత్రలో ఉంచాలి. వెయ్యి ఎర్రని పూలతో పూజించాలి. 
7. కింది మంత్రం పఠిస్తూ శక్త్యానుసారం వెండి లేక బంగారు సర్ప ప్రతిమను జ్యోతిష్కునికి దానం చేయాలి. మంత్రం :- తపోమయ మహాభీమ సోమసూర్య విమర్దన | హేమనాగ ప్రదానేన మమ శాంతి ప్రదోభవ || గ్రహణ కాలంలో సత్పాత్ర దానం వల్ల రాహు జనిత దోషాల నుండి విముక్తి లభిస్తుంది.

– వై.కె.శర్మ

సమర్పణ : దైవమ్

3 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *