జ్యోతిషం దృష్ట్యా సూర్య-చంద్రులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు ప్రపంచానికి ఆత్మ అయితే చంద్రుడు మనసు. గ్రహణ సమయంలో సూర్య చంద్రులు- రాహువు దుష్ప్రభావం వల్ల దుర్బల స్థితిలో ఉంటారు. గ్రహణ ప్రభావం భూమిపై ఉన్న ప్రతి ప్రాణిపై పడుతుంది. గ్రహణ వేళలో సౌర మండలంలో పూర్తిగా మార్పు కలుగుతుంది. సూర్యకాంతి వల్లనే భూమిపై జీవితం స్థితి కలిగి ఉంటుంది. సూర్యకిరణాలు లోపిస్తే సమస్త జీవుల్లో కలవరపాటు తప్పదు. ప్రమాదకర తరంగాలు ఉద్భవిస్తాయి. చంద్ర గ్రహణ సమయాన రాత్రివేళ చంద్ర కిరణాలు లోపిస్తే మనసు కలవరపాటు చెందుతుంది. రాత్రిపూట సంచరించే ప్రాణులు ఎక్కువగా ఈ ప్రభావానికి లోనౌతాయి. సూర్యగ్రహణ ప్రభావం రాత్రివేళ ఉండదు.

అనిష్టం నిశ్చయం

జ్యోతిషం దృష్ట్యా- గ్రహణం ఒక అశుభ ఘటన. కాని, దీని దుష్ప్రభావం ఒక వ్యక్తిపై అధికంగా, మరో వ్యక్తిపై మధ్యమంగా, వేరొక వ్యక్తి పై సామాన్యంగా ఉంటుంది. గ్రహణం ఏ రాశిలో, ఏ నక్షత్రం ఉన్న సమయంలో సంభవిస్తుందో ఆ రాశి జాతకులపై దాని ప్రభావం విశేషంగా చూపుతుంది. అందుచేత అది హానిని సూచిస్తుంది. ఏ రాశిలో గ్రహణం సంభవిస్తుందో దాని ఆధారంగానే మనుషులు శుభ – అశుభాలకు లోను కావలసి వస్తుంది. జన్మనక్షత్రంలో గ్రహణం సంభవిస్తే నిశ్చయంగా అనిష్టం కలుగుతుంది. జాతకునికి రోగం, భయం, ధననాశం, మృత్యుభయం కూడా ఉత్పన్నం కావచ్చు. 

గ్రహణ పరిధి

గ్రహణ స్పర్శకు పూర్వమే గ్రహణ ప్రభావం మొదలవుతుంది. దీనినే ‘సూతక కాలం’ అంటారు. సూర్య గ్రహణానికి 12 గంటల ముందు నుండి, చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు నుంచీ సూతకం ఆరంభమౌతుంది. 
1. గ్రహణస్పర్శ నుండి మోక్షకాలం వరకు వంట చేయడం, భోజనం, నిద్ర, విగ్రహ స్పర్శ,
మొదలైనవి నిషిద్ధం. 
2. ఏ రక్షణ లేకుండా నగ్న నేత్రాలతో ఆకాశం వైపు చూడటం ప్రమాదకరం. 
3. గ్రహణ ప్రభావం ఒక మాసం వరకు ఉంటుంది. ఆరు నెలల దాకా ఉండవచ్చని కొన్ని గ్రంథాల వ్యాఖ్య.

అశుభాల నివారణ

గ్రహణ జన్య అనిష్ట నాశనానికి మహర్షులు అనేక ఉపాయాలు చెప్పారు. స్నాన, జప, దాన, శ్రాద్ధాదులకు విశిష్ట ప్రాముఖ్యతనిచ్చారు.
స్నానం : గ్రహణం సంభవించినప్పుడు అన్ని వర్ణాల వారికి సూతకం ఉంటుంది. అందుచేత సూతక నివృత్తికై స్నానం చేయాలి. దీనికి తీర్థాల్లోని జలం విశేషమైనది. గంగానది స్నానం అనేక జన్మల పాపాన్ని పరిహరిస్తుంది. గ్రహణ కాలం ప్రారంభం కాగానే స్నానం చేయాలి. గ్రహణం ఉన్నంత సేపు స్తోత్ర పఠనం, దానం, మొదలైనవి చేయాలి. గ్రహణ కాలంలో ఓషధీ స్నానానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంటుంది. 
పూజ : గ్రహణ కాలంలో పూజార్థం గ్రహణశాంతి ఉపాయాలు చేయాలి. మొదటగా నాలుగు బ్రహ్మఘటాలు స్థాపించి, అందులో చతుస్సముద్ర భావన చేయాలి. సప్త మృత్తికలను కలశంలో వేయాలి. పంచగవ్యం, స్వచ్ఛమైన ముత్యం, కమలం, శంఖం, పంచరత్నాలు, శాష్ఠికం, తెల్లచందనం, తీర్థజలం, పంచపల్లవాలు కలశంలో వేసి కింది మంత్రం పఠించాలి. 
సర్వే సముద్రా: సరితస్తీర్థాని జలదానదాః | 
ఆయాన్తు మమ శాంత్యర్థం దురితక్షయ కారకాః ||
తరవాత వ్యాహృతితో 1,008 ఆహుతులు నువ్వులతో హోమం చేయాలి. అనంతరం గ్రహణ దోష నాశక స్తుతి పాఠం చదివి స్నానం చేయాలి. తరవాత కూడా గ్రహణ సమయం గడపటానికి తూర్పు ముఖంగా కూర్చుని ఇష్టదైవాన్ని ధ్యానించాలి. గ్రహణ మోక్షం తరవాత స్నానం చేసి, దానాదులతో పవిత్రుడై బ్రాహ్మణునికి దక్షిణ సమర్పించి తృప్తిపరచాలి. 
దానం : గ్రహణ సమయంలో చేసే దానాలకు, విశేష ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహణ సమయ దానం అక్షీణం. గ్రహణ వేళలో- భూమి, గోవు, బంగారం, ధాన్యం దానం చేయడం ఆత్మహితార్థం అవసరమని మహాభారతం చెబుతోంది. 
1. గ్రహణ కాలంలో గోదానం చేయడం వల్ల సూర్యలోక ప్రాప్తి.
2. ఎద్దును దానమిస్తే శివలోక ప్రాప్తి. సువర్ణ దానంతో ఐశ్వర్యం. 
3. అశ్వదానం వల్ల వైకుంఠ ప్రాప్తి. భూదానం ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది. 
4. అన్నదానం చేత సమస్త సుఖాలు దక్కుతాయి. వస్త్ర దానం యశస్సును, రజతదానం రూపాన్ని, ఫలదానం పుత్రప్రాప్తిని, ఘృతదానం సౌభాగ్యాన్ని, లవణదానం శత్రునాశాన్ని, గజదానం భూస్వామిత్వాన్ని కలిగిస్తాయి.

– వై.కె.శర్మ

సమర్పణ : దైవమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *