తొలి – ఉత్థాన ఏకాదశుల నడుమ

‘చాతుర్మాస వ్రతం’

‘చాతుర్మాసం’ అంటే నాలుగు నెలలు. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి నుండి కార్తిక మాస శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసం. ఈ నాలుగు నెలల దీక్షను ‘చాతుర్మాస (స్య) వ్రతం’ అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడే తప్తముద్ర ధారణం – ధారణ పారణ వ్రతారంభం కూడా.

శాక వ్రతం

తొలి ఏకాదశి నుండి ‘శాక వ్రతం’ పాటిస్తారు. అంటే- ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి
శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఏ విధమైన కాయగూరలు, ఆకుకూరలను భోజన పదార్థాలుగా వాడరాదు. ఏవి తిన్నా పప్పు పదార్థాలతో వండినవై ఉండాలి. చివరకు పోపు సామాన్లలో వాడే కరివేప ఆకు – కొత్తిమీర కూడా వినియోగించరు. అంతే కాదు, కారం కోసం మిరియాలు, జీలకర్ర తప్ప తక్కిన సుగంధ ద్రవ్యాలను వాడరు. ఈ వ్రత కాలంలో ఉసిరిక వరుగు, మామిడి వరుగు – వేపపూత (అనగా ఎండిన పువ్వులు) పచ్చళ్లుగా వాడుకోవాలి. ఈ విధమైన ఆహార నియమం మనసును స్థిరపరచడానికి, దైవ ధ్యానానికి, ఆరోగ్యానికి తోడ్పడతాయి.

ప్రార్థన

‘ఏకాదశి’ నిరాహార వ్రతం. పదిహేను రోజులకు ఒకసారి నిరాహారంగా ఉండటం ఆరోగ్యప్రదం. మరునాడు ద్వాదశి పారణ. ఈ ఏకాదశీ వ్రతం ఇహ-పర సాధకం. కలియుగంలో ఇంతకంటే సులభతర ఉపాయం మరొకటి ఉండదు.
గృహస్థుడు ఏకాదశీ వ్రతారంభాన దేవతా గృహంలో ఈ విధంగా భగవంతుని ప్రార్థించాలి- 
చతురో వార్షికారమాసార |
దేవస్యోత్థాపనావధి- ఇమం కరిష్యే నియమం |
నిర్విఘ్నం కురుమేచ్యుత | 
ఇదం వ్రతం మయాదేవ | 
గృహీతం పురతస్తవ | 
నిర్విఘ్నం సిద్ధిమాయాతు || 
ప్రసాదాత్తవ కేశవ ||

గృహీతేస్మిన్ వ్రతేదేవ |
పంచత్వం యదిమ్ భవేత్ | 
తధాభవతు సంపూర్ణం – 
త్వత్ర్పసాదాత్ జనార్దన | 
శ్రవణేవర్జుయేశ్శాకం | 
దధిభాద్రపదే తథా | 
దుగ్ధమాశ్వీయుజేమాని 
కార్తికేద్విదతం తథా || 
ఇమం కరిష్యే నియమం | 
నిర్విఘ్నం కురుమేచ్యుత ||
-అని భగవంతుని ప్రార్థించాలి. స్వామి అనుమతితో వ్రతం ఆచరించడం సంప్రదాయం.

అర్ఘ్యం

చాంద్రమాన సిద్ధాంత ప్రకారం ఈ కింది వాటిని వినియోగించరు-
శ్రావణ మాసంలో- దుంప, పండ్లు, ఆకులను; భాద్రపదంలో పెరుగును; ఆశ్వయుజంలో పాలును; కార్తికంలో ద్విదళ ధాన్యాన్ని (పెసలు మొదలైన గింజలు – రెండు బద్దలుగా వచ్చే గింజలు) విసర్జిస్తున్నాను. స్వామీ! ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించేలా అనుగ్రహించు. ఒకవేళ వ్రతాచరణ మధ్యలో మరణం సంభవిస్తే సంపూర్ణమయ్యేలా కరుణించు’ అని
ప్రార్థించి, భగవానునికి శంఖంతో అర్ఘ్యం ఇవ్వాలి.

నాలుగు నెలల నియమాలు

చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు పాటించాల్సిన నియమాలు ఇవీ-
ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాకవ్రతం; శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధివ్రతం; భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వయుజ పౌర్ణమి వరకు క్షీరం, ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తిక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. 
ఈ వ్రత విధానాలు ఇహ-పర సాధనాలు.

ఉపవాస ఫలితం

దశేంద్రియాలకు అతీతుడైన పరమాత్మనే ‘ఏకాదశి’గా భావించారు. ‘ఉపవాసం’ అంటే- భగవంతుని సమీపంలో మనుసును లగ్నం చేయడం. ఇదే ఏకాదశి వ్రత ప్రయోజనం. గృహస్థులు, సన్యాసాశ్రములు ఒకే చోట నిలచి, దీక్షగా అనుష్ఠానాలు చేస్తారు. అందువల్లనే పీఠాధిపతులు, తక్కిన స్వాములవారలు ‘చాతుర్మాస దీక్ష’లో ఉండటం (ప్రయాణాలకు అవరోధం కావచ్చు). శిష్య ప్రబోధానికి, జపానుష్ఠానాలకు ఈ కాలం అతి ముఖ్యమైనది.

‘దధి – క్షీర’ వ్రతాంతర్యం

ఈ కాలంలో గృహస్థులు, సన్యాసులూ రెండు నెలల తర్వాత స్థాన చలనం చేయడం దేశ కాల పరిస్థితుల బట్టే! కాని, నాలుగు నెలలు కదలకుండా ఒకే చోట ఉండటం ఆచారం. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ‘దధి’ వ్రతాన్ని పాటిస్తారు. పాడిపశువులు కొత్తగా ఈని పాలివ్వడంతో అప్పటి పెరుగు తినడం అనారోగ్యమని భావించారు. శ్రావణమాసంలో- మంగళ గౌరీ వ్రతాలు, శుక్రవారం నోములు, మౌంజీ విసర్జనం, హయగ్రీవ జయంతి, రక్షాబంధనం, కృష్ణాష్టమి, మొదలైన పండుగలు వస్తాయి. 

శ్రావణ – భాద్రపద మాసాల్లో క్షీరవ్రతాన్ని పాటిస్తారు. పాలు, పాలతో వండిన పదార్థాలు విసర్జనీయాలు. ఇవి ఆరోగ్యం కోసమే కాని మరొకందుకు కాదు. గణపతి నవరాత్రులు, అనంత వ్రతం మొదలైన పండుగల తర్వాత ‘మహాలయ పక్షం’ ఆరంభమవుతుంది. బహుళ పక్షంలో పితృదేవత ఆరాధన కూడా – దేవపూజలతో పాటు చోటు చేసుకొంటుంది.

‘ద్విదళ’ వ్రత నిష్ఠ

ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో ‘ద్విదళ వ్రతం’ పాటిస్తారు. అంటే- ఏ విధమైన పప్పు పదార్థాలను తినరాదని భావం. మాధ్వ సంప్రదాయంలో- పితృకర్మల్లో కూడా పప్పు పదార్థాల బదులు బియ్యపు పిండి, కొబ్బరి, పచ్చిమిర్చి మొదలైన పదార్థాలతోనే మహా భక్ష్య (మినుప వంట) ప్రత్యామ్నాయంగా వాడతారు. ఈ విధంగా ఆశ్వయుజం గడిచిపోయాక, కార్తిక శుద్ధ ఏకాదశి నాడు ‘ఉత్థాన ఏకాదశి’ వ్రతం ముగిసిన తదుపరి ద్వాదశి నాడు స్వామికి కూడా సర్వపదార్థ నివేదనతో వ్రతం సమాప్తమవుతుంది. 

భగవంతునికి నివేదించినదే మనం తీసుకోవాలనే నియమమే తప్ప- స్వామికి వ్రత విధానం లేదు. నివేదించిన పదార్థం విసర్జన కాకూడదు. కనుక వ్రత నియమానుసారం పరమాత్మకు నివేదన చేసి, పారాయణ చేయడం సంప్రదాయం.

వాడటం – తినడం నిషిద్ధం

ఇంతేగాక – తోలును ఉపకరణాలుగా ఉపయోగించకూడదు. నిమ్మ వాడరాదు. విష్ణువుకు నివేదన చేయని ఆహారాన్ని తినరాదు. పరాన్నం, తేనె, పొట్లకాయ, రేగుపండ్లు, ముల్లంగి, గుమ్మడి, చెరకు, కొత్త ఉసిరిక పప్పు, చింతపండు, మినుములు, ఉలవలు, తెల్ల ఆవాలు తినరాదు. మంచంపై నిద్ర, భార్యా సంగమం చేయకూడదు.

కొన్ని సిద్ధులు

శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో బెల్లాన్ని వదిలితే మధుర స్వరం సిద్ధిస్తుంది. నూనెను ఉపయోగించకపోతే అంగ సౌందర్యం, యోగాభ్యాసం చేస్తే బ్రహ్మపదం, తాంబూలం విసర్జిస్తే భోగసిద్ధి… ఇలా కొన్ని సిద్ధులు చెప్పబడ్డాయి.
మౌనవ్రతం, గంగాస్నానం, విష్ణువందన, విష్ణు ఆలయ ప్రదక్షిణ వంటివి చాతుర్మాసాల్లో ఆచరించాలి.

– భాగవతుల సుబ్రహ్మణ్యం

సమర్పణ : దైవమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *