ఏప్రిల్ 24 నుండి మే 22 వరకు- వైశాఖ మాసంలో ‘అర్యముడు’ పేరుతో సూర్య భగవానుడు ప్రసిద్ధుడు. ‘పులహుడు’ (ఋషి), అథోజుడు (యక్షుడు), పుంజికస్థలి (అప్సరస), ప్రహేతి (రాక్షసుడు) కచ్ఛనీరం (సర్పం), నారదుడు (గంధర్వుడు)… వీరందరితో కలసి సూర్యుడు తన రథంపై పయనిస్తాడు. అతడు మేరుపర్వత శిఖరంపై తిరుగుతుంటాడు. కమలాలను వికసింపజేస్తాడు. అటువంటి అర్యమునికి నేను ప్రణమిల్లుతున్నాను. అతని సంతోషం నాకు శుభాలను చేకూర్చు గాక. అర్యముడు పదివేల కిరణాలతో ప్రకాశిస్తాడు. అతడు పీతవర్ణుడు.

వైశాఖ మాస సూర్య నామం ‘అర్యముడు’

‘ఉత్తరార్క’ సూర్యుని మహిమ
బలవంతులైన రాక్షసుల చేతుల్లో దేవతలు యుద్ధంలో పదే పడే ఓడిపోతున్నారు. దైత్యుల ఆగడాల నుండి విముక్తి పొందడానికై దేవతలు సూర్య భగవానుని ఆరాధించాలని నిశ్చయించుకొన్నారు. వారి సేవలకు ప్రసన్నుడై, సూర్యుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. తమ ఎదుట సాక్షాత్కరించిన సూర్యుని ప్రార్థిస్తూ దేవతలు ఇలా పలికారు- ‘ఓ ప్రభూ! బలిష్టులైన రాక్షసులు ఏదో ఒక నెపంతో మాపై దాడి చేసి, మమ్మల్ని ఓడించి, మా అధికారాలను లాక్కొంటున్నారు. భయంకరమైన ఈ అసురుల అత్యాచారాల నుండి ముక్తి పొందడానికి మేము నిన్ను వేడుకొంటున్నాం. ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి మాకు తగిన ఉపాయాన్ని సూచించండి’ .

ఆదిత్యానుగ్రహం
సూర్య భగవానుడు బాగా ఆలోచించి, తన ప్రభావంతో ఏర్పడిన ఒక పర్వతశిలను దేవతలకు అప్పగించి ఇలా నిర్దేశించాడు- ‘మీరు ఈ శిలను తీసుకొని, వారణాసికి వెళ్లండి. అక్కడ విశ్వకర్మతో శాస్త్రోక్తంగా ఈ రాయిని నా విగ్రహంగా చేయించండి. అలా విగ్రహ తయారీలో దీనిని చెక్కేటప్పుడు రాలే ముక్కలు మీకు దృఢమైన అస్త్రాలుగా మారతాయి. మీరు వాటిని ప్రయోగిస్తే రాక్షసులపై విజయాన్ని సాధిస్తారు’.

దేవతా విజయం
దేవతలు వారణాసికి వెళ్లారు. సూర్య భగవానుని నిర్దేశానుసారం విశ్వకర్మను కలిశారు. విశ్వకర్మ ద్వారా ఆ శిలతో సుందరమైన విగ్రహాన్ని నిర్మింపజేశారు. విగ్రహాన్ని చెక్కే సమయంలో రాతిముక్కలు రాలాయి. వాటి నుండి దేవతల కోసం గొప్ప శక్తి గల అస్త్ర శస్త్రాలు వెలువడ్డాయి. ఆ తరవాత అసురులు, దేవతల మధ్య మహా సంగ్రామం జరిగింది. అప్పుడు దేవతలు సూర్య భగవానుని కృపతో లభించిన అస్త్ర శస్త్రాలను ప్రయోగించారు. వాటి దెబ్బకు తట్టుకోలేక రాక్షసులు ఎటువారటు పారిపోయారు. శిలను తవ్వి తీయడం వల్ల ఏర్పడిన గుంతను ‘ఉత్తర మానసం’ లేదా ‘ఉత్తరార్క కుండం’ అంటారు.

పార్వతీపరమేశ్వరుల కరుణ
ఆ యుద్ధం జరిగిన కొన్నేళ్లకు- ఎవ్వరూ ఆదుకొనేవారు లేని ఒక బ్రాహ్మణ కన్య ‘ఉత్తరార్క’ సూర్యుని సమీపాన తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు శివపార్వతులు లీలావిలాసంగా విహరిస్తూ అక్కడకు వచ్చారు. దయామయి పార్వతీదేవి శంకరునికి చెప్పిన మాట- ‘ప్రభూ! ఈ బ్రాహ్మణ కన్యకు బంధువులు ఎవ్వరూ లేరు. మీరు వరాలు ఇచ్చి అనుగ్రహించండి’.
పరమశివుడు కరుణించాడు. ఆ కన్యతో ఇలా చెప్పాడు- ‘ఉత్తమమైన వ్రతాన్ని ఆచరిస్తున్న ఓ సులక్షణా! నీ తపస్సుకు మెచ్చాను. ఏదైనా ఒక వరం కోరుకో’. భగవానుని దర్శనభాగ్యం పొందిన బ్రాహ్మణ కన్య భక్తి సంద్రంలో మునకలేస్తూ ‘ఓ కృపానిధీ! మీ అనుగ్రహంతో, నాకు మీ భక్తిని ప్రసాదించు స్వామీ! అన్నది.
పరమేశ్వరుని కృపతో ఆ కన్య పార్వతీదేవికి ఇష్టసఖి అయ్యింది. ఉత్తరార్క సూర్యుని స్థానం అలయీపురానికి దగర్లో ఉంది. ఉత్తరార్కుని మహిమ అద్భుతం, విలక్షణం.

సమర్పణ :
????️ దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *