దక్షిణావర్తి శంఖం

శ్రీ మహాలక్ష్మికి తోబుట్టువు శంఖం. శ్రీమహావిష్ణువుకు ప్రియమైనది. హిందువులకు పవిత్ర, పూజనీయ వస్తువు. పర్వదినాలు, ఉత్సవాలు, శుభకార్యాల్లోనే గాక సమర ప్రారంభంలోనూ శంఖధ్వని చేస్తుంటారు. వాతావరణంలో నవ చైతన్య వ్యాప్తికి శంఖధ్వని దోహదపడుతుంది. సాధారణంగా శంఖాలు ‘వామావర్తి’లో ఉంటాయి. అంటే- ఎడమ వైపుకు తిరిగి ఉండడం. కొన్ని శంఖాలను పూరించడానికి ఉపయోగిస్తారు. మరికొన్ని కేవలం ప్రదర్శనకు మాత్రమే.

పూజార్హత
శంఖం ఆకారం వైవిధ్యభరితం. ఇది సముద్ర ప్రాణి నత్త జాతికి చెందినది. గోధుమగింజ పరిమాణం నుండి ఐదు కిలోల బరువు గల శంఖాలు లభిస్తాయి. వీటితో చిత్ర విచిత్రమైన బొమ్మలు, ఆభరణాలూ తయారుచేస్తారు. శంఖంతో రూపొందిన గాజులు, హారాలను పవిత్రంగా భావిస్తారు. దెబ్బతినని శంఖమే పూజనీయమైనది. శంఖం ఉన్న నివాస గృహంలో సాత్వికత, పవిత్రత, శుద్ధి ఏర్పడతాయి. భద్రత లభిస్తుంది. ముఖ్యమైన విశేషం- దేవతా ప్రతిమలతో సమానంగా శంఖాన్ని పూజించడం.

లక్ష్మీ శంఖం
శంఖాల్లో రకాలు అనేకం. వాటిలో ‘దక్షిణావర్తి శంఖం’ లభించడం అరుదు. ఇది కుడి వైపుకు తిరిగి ఉంటుంది. ఈ కారణంగానే ‘దక్షిణావర్తి’ అంటారు. ఈ తరహా శంఖం లక్ష్మీదేవికి సంబంధించిందని తంత్ర శాస్త్ర నిర్ధారణ. దక్షిణావర్తి శంఖం ఉన్న చోటు లక్ష్మీదేవి నివాస స్థానమని హిందూ ప్రగాఢ విశ్వాసం.

శంఖం బరువు
ఎక్కడా పగుళ్లు లేని దక్షిణావర్తి శంఖం ఉత్తమమైనది. దోష రహితమై ఉండాలి. ఇది ధన సమృద్ధి ప్రదాయిని. దీని బరువు కనీసం ఐదు తులాలు ఉండాలని కొందరంటారు. కాని, ఇది తప్పనిసరి నియమం కాదు. అంతకంటే తక్కువ బరువు గల శంఖాలు కూడా అద్భుత ప్రభావం చూపుతాయి.

దక్షిణావర్తి శంఖ పూజ
శంఖం – తంత్రం కేవలం అర్థ (ధన) సమృద్ధికి మాత్రమే ఉపయోగకరం. వశీకరణం, రోగనాశనం వంటివి ఈ సాధనతో సిద్ధించవు. అయితే ధన – ధాన్య సమృద్ధి పరంగా అద్భుత ఫలితాన్ని సాధించవచ్చు. దక్షిణావర్తి శంఖాన్ని పూజిస్తే తాంత్రిక లాభం సులభంగా లభిస్తుంది. దీనికి సంబంధించిన తంత్ర పూజా విధానం ఇదీ-

పూజా దినం
ఎలాంటి దోషం లేని దక్షిణావర్తి శంఖాన్ని ఎంచుకోవాలి. 27 కంటే ఎక్కువ శిఖరాలు ఉంటే మంచిది. వీలైనంతవరకు సాధన చేసేవారి వర్ణానికి చెందిన రంగులో ఉండాలి. తప్పనిసరైతే నలుపు మినహా ఇతర రంగులో ఎంచుకోవచ్చు. గురు-పుష్య యోగం ఉన్న రోజున పూజ చేయాలి. ఈ యోగం సమీప దినాల్లో లేకపోతే శుభకరమైన గురువారం నాడు ఆచరించాలి.

శంఖాభిషేకం
సాధకుడు స్నానానంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శంఖాన్ని ఒక పళ్లెంలో ఉంచి అభిషేకం చేయాలి. దీని కోసం పంచామృతం లేదా పాలు లేదా బావి నీటిని వినియోగించాలి. తరవాత శంఖాన్ని ఎర్రని వస్త్రంపై ఉంచాలి. తెల్లచందనం లేదా ఎర్రచందనం, పూలు, అక్షతలు, ధూప దీపాదులతో పూజించాలి. కింది మంత్రం జపించాలి. కనీస జప సంఖ్య 11 మాలాజపాలు (108 పూసల మాలతో). ఆ తరవాత 108 ఆహుతులతో హోమం చేయాలి.
దక్షిణావర్తి శంఖ పూజా మంత్రం :
ఓం హ్రీమ్ శ్రీమ్ కి-లీమ్ శ్రీధర కరస్థాయ పయోనిధి జాతాయ శ్రీ దక్షిణావర్త శంఖాయ హ్రీమ్ శ్రీమ్ కి-లీమ్ శ్రీకరాయ పూజ్యాయ నమః.

లక్ష్మీ నారాయణులతో బ్రహ్మ, గరుత్మంతుడు, నారదుడు, ఆంజనేయుడు

లక్ష్మీనారాయణ స్వరూపం
ఒక బ్రాహ్మణ బాలుని ఆహ్వానించి భోజనం, దక్షిణ సమర్పించాలి. తరవాత వెండిపాత్ర లేదా చెక్కపీటపై ఎర్రని వస్త్రం పరచి, అందులో శంఖాన్ని ఉంచాలి. ఒక వెండిముక్కను కూడా శంఖం పక్కన పెట్టాలి. శంఖాన్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి, శ్రద్ధా భక్తులతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి సమృద్ధి ప్రాప్తిస్తుంది.

శంఖ-స్థానంపూజ ఆరంభించింది మొదలు వెండిపాత్రలో స్థాపించేంత వరకు- శంఖం అడుగుభాగం (వీపు) ఆసనానికి ఆనించాలి. తెరచిన భాగం పైకి (ఆకాశం వైపుకు) ఉంచాలి. ఊదే ముఖ భాగం సాధకుని వైపు, పుచ్ఛ భాగం గోడవైపు ఉండాలి.

పాప నివారణ
శంఖంలో ఆవుపాలు నింపి గృహం లేదా ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మామూలుగా కూడా శంఖంలో శుద్ధ జలం నింపి, లక్ష్మీ ప్రతిమకు అభిషేకిస్తే శుభకరం. దక్షిణావర్తి శంఖంలో నీరు నింపి, ఎవరిపైనైనా సంప్రోక్షిస్తే వారి పాపాలు (గోహత్య, బ్రహ్మహత్య వంటివి) తొలగిపోతాయి.

ఒక మాలాజపం
ప్రతి రోజూ పూజా సమయంలో ‘శ్రీ లక్ష్మీనారాయణ నమః’ మంత్రం ఒక మాలాజపం (108సార్లు) చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా వృద్ధి పథంలో ముందుకు వెళతారు. ధనానికి లోటు ఉండదు. ఇల్లు కళకళలాడుతుంది.

సమర్పణ :
????️ దైవమ్ డిజిటల్

2 Responses

  1. నా రాశి తెలుసుకోవడం ఎలా దేనిని బట్టి రాశి ని సూచిస్తుంది

    1. శ్రీ సురేష్ గారు, మీకు దగ్గరలోని జ్యోతిష్కుడిని కలసి మీకున్న సందేహాలను వ్యక్తం చేయండి. వారు ముఖాముఖి మీకు బోధపడేలా వివరిస్తారు.
      ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *